ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్.. ఈ ఐదుగురికి ఇక టీమిండియాలో చోటు కష్టమే..!
IPL 2023: ఐపీఎల్ ప్రదర్శనలే భారత జట్టులోకి కొలమానాలుగా వస్తున్న కాలమిది. రెండు ఐపీఎల్ సీజన్లలో అదరగొడితే ఆ ఆటగాడి దశ తిరిగినట్టే..

‘ఎక్కడ టాలెంట్ ఉందో అవకాశం అక్కడికి వెతుక్కుంటూ వస్తుంది’ అంటుంటారు పెద్దలు. అన్ని రంగాల్లో మాదిరిగానే క్రికెట్ లో కూడా ఇదే యాప్ట్ అవుతుంది. భారత క్రికెట్ లో తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి అత్యుత్తమ వేదిక ఇండియన్ ప్రీమియర్ లీగ్. భారత జట్టులోకి ఎంట్రీకి కూడా ఇందులోని ప్రదర్శనలే కొలమానాలవుతున్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదు.
దేశవాళీలో ఎంత ఆడినా అది అక్కడి వరకే పరిమితం అవుతుంది. కానీ ఐపీఎల్ లో మెరిస్తే మాత్రం గుర్తింపు, పేరుతో పాటు బోనస్ గా డబ్బు.. అన్నీ కుదిరితే భారత జట్టులో అవకాశం కూడా దక్కుతుంది. ఇలానే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు చాలామంది. కానీ ఈ ఏడాది ఓ ఐదుగురు వర్ధమాన క్రికెటర్లు, భారత జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి తంటాలు పడుతున్నవారు మాత్రం ఈ ఐపీఎల్ లో దారుణంగా విఫలమయ్యారు. దీంతో టీమిండియాలో కూడా వారి స్థానం కోల్పోయే ప్రమాదముంది.
ఈ జాబితాలో టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్ లు ముందువరుసలో ఉన్నారు. వీరిలో సర్ఫరాజ్ ఖాన్ మినహా మిగిలినవారంతా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించినవారే. ఈ ఐపీఎల్ లో ఈ ఐదుగురు విఫలమయ్యారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న పృథ్వీ షా మీద ఈసారి ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రిషభ్ పంత్ లేకపోవడంతో అతడి మీద మరింత భారం పడింది. గత రెండు సీజన్లలో రాణించిన షా.. ఈ సీజన్ లో మాత్రం పేలవ ప్రదర్శనల (ఆరు ఇన్నింగ్స్ లలో 47 పరుగులు) తో ఢిల్లీ జట్టులో కూడా చోటు కోల్పోయాడు. 2020 తర్వాత మూడేండ్లకు జనవరి లో న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన షా.. తాజా ఐపీఎల్ ప్రదర్శనలతో మళ్లీ టీమిండియాలోకి రావడం కష్టమే.
Image credit: PTI
రాహుల్ త్రిపాఠి.. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు గత ఐపీఎల్ సీజన్ లో నిలకడగా ఆడి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత రెండు సిరీస్ లలో పలు మ్యాచ్ లు కూడా ఆడాడు. కానీ ఈ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తో చేసిన 70 పరుగులు మినహా మిగతా మ్యాచ్ లలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
దీపక్ హుడా.. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ విజయాల్లో దీపక్ హుడా భాగస్వామ్యం ఉంది. ఈ యువ ఆల్ రౌండర్ ఈ సీజన్ లో మాత్రం క్రీజులో నిలవడానికే తంటాలు పడుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 53 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కేతో మ్యాచ్ లో హుడాకు ఛాన్స్ రాలేదు.
దీపక్ చాహర్ : ఐపీఎల్ 2022లో దీపక్ చాహర్ ను చెన్నై రూ. 14 కోట్లతో కొనుగోలు చేసినా అతడు గాయం కారణంగా సీజన్ మొత్తం తప్పుకున్నాడు. ఆరు నెలల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి అడపా దడపా మ్యాచ్ లు ఆడాడు. ఈ సీజన్ లో పూర్వపు ఫామ్ ను అందుకుంటాడని భావించినా రెండు మ్యాచ్ లే ఆడి గాయంతో మళ్లీ మ్యాచ్ లతకు దూరంగా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చాడు. ఆడింది మూడు మ్యాచ్ లే అయినా ఆకట్టుకోలేదు.
సర్ఫరాజ్ ఖాన్ : దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ లో రాణిస్తాడని అంతా భావించారు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు తహతహలాడుతున్న ఈ ముంబై కుర్రాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఫస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపింగ్ కూడా చేశాడు. కానీ వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఈ సీజన్ లో 4 మ్యాచ్ లు ఆడి 53 పరుగులే చేశాడు.