ఫీల్డింగ్ టెస్టు పాస్ కాకపోతే, విరాట్ కోహ్లీనైనా పక్కన పెట్టేయాలి... మహ్మద్ కైఫ్ సూచన...
టీమిండియాకి జాంటీ రోడ్స్ లాంటి టాప్ క్లాస్ స్టార్ ఫీల్డర్ మహ్మద్ కైఫ్. ఎన్నో అద్బుతమైన క్యాచులను అందుకున్న కైఫ్, వెనక్కి పరుగెడుతూ క్యాచులు అందుకుని 15 ఏళ్ల క్రిందటే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేశాడు. భారత జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవ్వడానికి కైఫ్ కూడా ప్రధాన కారణం. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు క్యాచులు జారవిడుస్తోంది. వన్డే, టీ20 సిరీస్‌లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ కూడా క్యాచులు జారవిడిచాడు.
తొలి టెస్టులో భారత ఫీల్డర్లు జారవిడిచిన క్యాచులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీమిండియా. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, బుమ్రా క్యాచులు వదిలేయడంతో లబుషేన్, టిమ్ పైన్ మంచి స్కోర్లు చేశారు.
భారత జట్టు ఫీల్డింగ్‌పై హాట్ కామెంట్లు చేశాడు మహ్మద్ కైఫ్. భారత జట్టు ఫీల్డింగ్ చాలా మెరుగయ్యిందని చెప్పిన మహ్మద్ కైఫ్, బ్యాటింగ్, బౌలింగ్ టెస్టులాగే ఫీల్డింగ్ టెస్టు కూడా పెట్టాలని అన్నారు.
‘ఆస్ట్రేలియా సిరీస్‌లో కొన్ని అద్భుతమైన క్యాచులు చూశాం. కానీ ఓవరాల్‌గా చూస్తే ఆసీస్ సిరీస్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. దీనికి కారణం సరైన ప్రాక్టీస్ లేకపోవడం...
దాదాపు ఏడు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న క్రికెటర్లు, ఐపీఎల్‌లోనూ ఈజీ క్యాచులు డ్రాప్ చేయడం చూశాం... ఫీల్డర్లు మళ్లీ గాడిలో పడాలంటే ట్రైనింగ్ అవసరం..
ఏ ప్లేయర్ అయినా ఫీల్డింగ్ స్టాండర్లను అందుకున్నప్పుడే తుది జట్టులో చోటు దక్కించుకునేలా రూల్స్ మార్చాలి. విరాట్ కోహ్లీ కూడా క్యాచులు డ్రాప్ చేశాడు. ప్రతీ ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేశారు...
ఐపీఎల్ నుంచే ఇలా జరుగుతోంది.. నాలుగైదు ఇంట్లో గడిపిన క్రికెటర్ల ఫిట్‌నెస్ గురించి నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఫిట్‌నెస్ టెస్టుతో పాటు ఫీల్డింగ్ టెస్టు కూడా తప్పనిసరి చేస్తే ఆటగాళ్ల మైండ్ సెట్ మారుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ కైఫ్.
బ్యాటింగ్‌లో ఏ బాల్‌ని ఎలా ఆడాలి... బౌలింగ్‌లో ఏ బ్యాట్స్‌మెన్‌కి ఎలా వేయాలి అనే ప్రణాళిక ఆటగాళ్ల దగ్గర ఉంటుందని... అయితే ఫీల్డింగ్‌లో మాత్రం ఇది ఉండదని... కేవలం 15-20 నిమిషాల ప్రాక్టీస్‌తో వదిలేస్తారని చెప్పాడు కైఫ్.
జిమ్ ఫిట్‌నెస్‌కి గ్రౌండ్ ట్రైనింగ్‌కి మధ్య చాలా తేడా ఉందని చెప్పిన మహ్మద్ కైఫ్.... కోచ్‌గా తాను ఫీల్డింగ్‌పైన కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పాడు... అప్పుడు వాళ్లు మంచి ఫీల్డర్లుగా మారతారని చెప్పాడు.
భారత జట్టు తరుపున 125 వన్డేలు, 13 టెస్టులు ఆడిన మహ్మద్ కైఫ్... దాదాపు 70 క్యాచులు అందుకున్నాడు.