- Home
- Sports
- Cricket
- WI vs IND: అవి పదేండ్లుగా వింటూనే ఉన్నా.. పట్టించుకోను.. : విమర్శకులకు గబ్బర్ అదిరిపోయే కౌంటర్
WI vs IND: అవి పదేండ్లుగా వింటూనే ఉన్నా.. పట్టించుకోను.. : విమర్శకులకు గబ్బర్ అదిరిపోయే కౌంటర్
WI vs IND: వెస్టిండీస్ సిరీస్ లో టీమిండియా సారథ్య బాధ్యతలు మోస్తున్న శిఖర్ ధావన్ విమర్శకులకు గట్టి కౌంటరిచ్చాడు. ఎవరెన్ని చెప్పినా తాను విననని స్పష్టం చేశాడు.

టీమిండియా రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ గైర్హాజరీలో వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు పగ్గాలు మోస్తున్న శిఖర్ ధావన్ తన ఫామ్ పై వస్తున్న విమర్శలు, చేస్తున్న విమర్శకులకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. ఎవరెన్ని చెప్పినా తన పంథా మారదని స్పష్టం చేశాడు.
విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధావన్ మాట్లాడుతూ ఇదే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పదేండ్లుగా తాను వాటిని (విమర్శలను) వింటూనే ఉన్నానని గబ్బర్ అన్నాడు.
Image credit: Getty
ధావన్ మాట్లాడుతూ.. ‘వాటి (విమర్శలు) గురించి నేనేం ఆశ్చర్యపోవడం లేదు. ఇప్పటికీ పదేండ్లుగా వాటిని వింటూనే ఉన్నా. వాళ్లు నా గురించి ఏదో ఒక విషయమై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నా ఆట నేను ఆడుతూనే ఉన్నా.
ఒకవేళ నేను గనక ఆ విమర్శలను పట్టించుకుని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు. వ్యక్తులందరికీ వారి స్వంత అభిప్రాయాలుంటాయి. అయితే నా పనేంటో నాకు తెలుసు. నా కర్తవ్యాలమీద నాకు సంపూర్ణ అవగాహన ఉంది. చాలాకాలంగా నేను ఇదే ఫాలో అవుతున్నాను.
నా ఫామ్ గురించి నాకు పెద్దగా బెంగ లేదు. కొన్ని మ్యాచులలో విఫలమయ్యాయనని నేను హైరానా పడిపోను. నా ఆట మీద నేను ఆత్మ విమర్శ చేసుకుని తప్పులు సరిదిద్దుకుంటా.. నాకు అదే ముఖ్యం..’ అని తెలిపాడు.
ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్ లో జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన ధావన్.. తొలి వన్డేలో రోహిత్ తో కలిసి ఫర్వాలేదనిపించినా తర్వాత రెండు వన్డేలలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి ఫామ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక విండీస్ టూర్ లో యువ భారత్ తో కలిసి ఆడటంపై ధావన్ స్పందిస్తూ.. ‘నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. యువకులతో కలిసి ఆడే అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. నా అనుభవాన్ని వాళ్లకు పంచుతాను. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండటమెలాగో వాళ్లకు చెబుతా.
ఆటలో అదే అత్యధిక ప్రభావం చూపుతుందని నాకు తెలుసు. అంతర్జాతీయ మ్యాచులంటేనే ఒత్తిడితో కూడుకున్నవి. అయితే ఆ ఒత్తిడి నా మైండ్ సెట్ ను మార్చదు. నా ఆటతీరుపై కూడా అది ప్రభావం చూపదు. నామీద నాకు బోలెడంత విశ్వాసముంది. నా జట్టుమీద కూడా అంతే ఉంది. మేము గ్రౌండ్ లోకి దిగిన ప్రతీసారి విజయం సాధించాలనే కోరుకుంటాం..’ అని ధావన్ తెలిపాడు.