ఏంటీ..! మన నితీష్ రెడ్డి ధోనీనే రాటుదేలేలా తయారుచేసాడా!!
నితీష్ కుమార్ రెడ్డి 2024 ఐపిఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చాడు. కానీ అంతకుముందే ధోనిలాంటి దిగ్గజ ఆటగాడితో ఆడాడట... చెన్నై సూపర్ కింగ్స్ టీం ఐపిఎల్ కప్ గెలుపులో అతడి పాత్ర కూడా వుందట. నితీష్ గురించి చాలా తక్కువమందికి తెలిసిన ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.
Nitish Kumar Reddy
నితీష్ కుమార్ రెడ్డి... ఈ తెలుగు కుర్రాాడి పేరు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో బాగా వినిపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన ఒకే ఓక సూపర్ ఇన్నింగ్స్ అతడి కేరీర్ ను మలుపుతిప్పింది. కోట్లాది మంది యువత కోరుకున్నా రాని టీమిండియాకు ఆడే అవకాశం... ఆ జెర్సీ ధరించే లక్ అతడికి వచ్చింది. తాజాగా అతడి టాలెంట్ యావత్ ప్రపంచానికి తెలిసింది.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోపీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా జట్టులో నితీష్ ఒకడు. ఈ సీరిస్ లో మొదటి మూడు టెస్టుల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినా అతడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ మెల్ బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ ద్వారా నితీష్ కుమార్ రెడ్డి పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు పరుగులు చేయడానికి తడబడిన పిచ్ పై ఈ తెలుగు కుర్రాడు బ్యాట్ తో మాయ చేసాడు... సెంచరీ (114 పరుగులు) కొట్టి ఔరా అనిపించాడు.
బాక్సింగ్ డే టెస్ట్ లో టీమిండియా ఓడిపోయి వుండవచ్చు.... కానీ ఈమాత్రం పోరాటపటిమ చూపించి గౌరవప్రద ఓటమిని మూటగట్టుకుందంటే అందుకు ఓ కారణం నితీష్ రెడ్డి సెంచరీ. ఈ ఇన్నింగ్స్ తో అతడి పేరు మరోసారి మారుమోగిపోయింది. ఈ క్రమంలో నితీష్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు టీమిండియా ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అతడి గురించి ఓ ఆసక్తికర విషయం తెలుసుకుందాం.
Nitish Kumar Reddy
ధోనీ టీం గెలుపుకు నితీష్ సాయం చేశాడా? అదెలాగబ్బా!!
టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడమే గొప్ప విషయం. అలాంటిది ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్‌లోనే సెంచరీతో అదరగొట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ మన తెలుగు కుర్రాడు నితిష్ కుమార్ రెడ్డి ఇది చేసి చూపించాడు. అయితే గత ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన సూపర్ ఇన్నింగ్స్ తో వెలుగులోకి వచ్చాడు నితీష్. కానీ అంతకుముందే అతడు లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడనే విషయం మీకు తెలుసా?
అవునండి...మీరు వింటున్నది నిజమే. ఒక ధోనితోనే కాదు మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడే అవకాశం 2021 లోనే నితీష్ కు దక్కింది. అయితే మైదానంలో ఆటగాడిగా కాదు... నెట్స్ లో బౌలర్ గా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐపిఎల్ లో ఆడే అవకాశాన్ని పొందాడు నితీష్.
2021 ఐపీఎల్ ఫైనల్ దుబాయ్‌లో జరిగిన విషయం తెలిపిందే. ఈ మ్యాచ్ లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 27 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 192 పరుగులు చేసింది. సీఎస్కే ఆటగాడు డుప్లెసిస్ 59 బంతుల్లో 86 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 165 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ సీజన్ లో సీఎస్కె బ్యాట్ మెన్స్ కు నెట్స్ లో బౌలింగ్ వేసే అవకాశం నితీష్ కు దక్కింది. ఈ సీజన్ మొత్తం నితీష్ బౌలింగ్ లో బాగా ప్రాక్టిస్ చేసిన సిఎస్కే ప్లేయర్లు మైదానంలో అద్భుతాలు చేసారు. ఇలా సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోయినా నితిష్ కుమార్ రెడ్డి ఆ టీం గెలుపుకోసం తెరవెనక పనిచేసాడు. ఇలా 2021 ఐపీఎల్ సీజన్‌లో సీఎస్కే నెట్ బౌలర్ కాస్త 2024 ఐపిఎల్ లో హైదరాబాద్ టీంలో ప్రధాన ఆటగాడిగా మారారు. ఆ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుని ఇప్పుడు టీమిండియాలో చోటు దక్కించుకుని అద్భుతంగా ఆడుతున్నాడు.
Nitish Kumar Reddy
నెట్ బౌలర్ నుండి మెయన్ ప్లేయర్ వరకు నితీష్ జర్నీ
నెట్ ప్రాక్టీస్ సమయంలో సీఎస్కే బ్యాట్ మెన్స్ నితిష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌ను ఎక్కువగా ఎదుర్కొన్నారు, ఇది మ్యాచ్‌ల సమయంలో ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చాలా ఉపయోగపడింది. ఒక జట్టు గెలుపుకు నెట్ బౌలర్ల పాత్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఆ విధంగా సీఎస్కే 2021 ఐపీఎల్ కప్పు గెలవడానికి నితిష్ కుమార్ రెడ్డి పరోక్షంగా సాయం చేశారు.
2021 ఐపీఎల్ సీజన్‌లో నెట్ బౌలర్‌గా ఉన్న నితిష్ కుమార్ రెడ్డిని 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20 లక్షలకు వేలంలో కొనుకుంది. తర్వాత 2024 ఐపీఎల్ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో రెండు అర్ధ సెంచరీలతో 303 పరుగులు చేసి, 3 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. దీంతో గత నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని రూ.6 కోట్లకు తమ జట్టులోనే ఉంచుకుంది.
Nitish Kumar Reddy
నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి త్యాగం అలాంటిది...
ఐపిఎల్ లో సత్తాచాటి, ఇప్పుడు టీమిండియా ఆటగాడిగా మారి అద్భుతాలు సృష్టిస్తున్నాడు నితీష్ కుమార్. అయితే అతడి సక్సెస్ వెనక తండ్రి ముత్యాల రెడ్డి త్యాగం దాగివుంది. నితీష్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నప్పటి నుండే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న అతడికి కుటుంబ ప్రోత్సాహం కూడా లభించింది. అతడి తండ్రయితే కొడుకు క్రికెట్ కెరీర్ కోసం తన కెరీర్ ను వదులుకున్నాడు.
విశాఖలోని హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగిగా పనిచేసే ముత్యాల రెడ్డి కొడుకు కోసం జాబ్ వదిలేసాడు. ఆర్థికంగా ఎన్నికష్టాలు ఎదురైనా కొడుకు నితీష్ ప్రాక్టిస్ ఆగకుండా చూసాడు. ఇలా నిత్యం కొడుకు కోసమే ఆలోచించిన ఆ తండ్రి ఇప్పుడు అతడి ఎదుగుదలను చూసి గర్వపడుతున్నాడు.
చాలా చిన్నప్పుడే బ్యాట్ చేతబట్టిన నితీష్ తండ్రి కష్టాన్ని కూడా కళ్లారా చూసాడు. అందుకే అతడు కూడా ఎక్కడా పక్కదారి పట్టకుండా క్రికెట్ నే ప్రపంచంగా మార్చుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో రాటుదేలిన మంచి ఆల్ రౌండర్ గా మారిన నితీష్ టీమిండియా మాజీ ప్లేయర్ ఎమ్మెస్కే ప్రసాద్ కంటపడ్డాడు. అతడి టాలెంట్ ను గుర్తించిన ఎమ్మెస్కే కడపలోని ఏసిఏ అకాడమీలో చేరేందుకు సహకరించాడు. అక్కడే నితీష్ పరిపూర్ణమైన క్రికెటర్ గా మారాడు.