గౌతమ్ గంభీర్ - భారత ఆటగాళ్లకు మధ్య బిగ్ ఫైట్ జరిగిందా?
Team india : ఆసీస్ లో దారుణ ప్రదర్శన క్రమంలో భారత జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, భారత ఆటగాళ్ల మధ్య ఘర్షణ జరిగిందనీ, దీనివల్ల జట్టులో చీలిక ఏర్పడిందని వార్తలు కలకలం రేపుతున్నాయి.
ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్
టీమిండియా ఘోర పరాజయం
టెస్టు సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడుతున్నాయి. అయితే, ఈ పర్యటనలో భారత స్టార్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శనలు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా భారత స్టార్ బ్యాట్స్‌మెన్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ సహా జట్టులోని ప్లేయర్స్ వరుసగా విఫలమవడం జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. వీరి ఆటతీరు కారణంగా మెల్ బోర్న్ టెస్టులో భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ భావించారు, కానీ ఇండియా డ్రా కోసం కూడా పోరాడకుండా లొంగిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ ఓటమితో భారత జట్టు ప్రదర్శనపై అభిమానులు, మాజీ క్రికెటర్లు విమర్శల దాడిని మొదలుపెట్టారు.
భారత ప్లేయర్లపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం
ఈ సిరీస్‌లో పలువురు స్టార్ ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా ఇవ్వడంలో విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ పరుగులు చేయడంలో విఫలం కావడం మొత్తం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. రోహిత్ బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ దూకుడు ఫీల్డింగ్, అద్భుతమైన వ్యూహాలతో మ్యాచ్ ను గెలిపించగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి దూకుడు ఫీల్డింగ్ లేకుండా చాలా సాధారణ కెప్టెన్సీతో జట్టు ఓటమికి కారణంగా ఉన్నాడని విమర్శలు వచ్చాయి. అదేవిధంగా, ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టు వరుసగా ఓటములు చవిచూసింది. దీంతో గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 4వ టెస్ట్ తర్వాత గంభీర్ భారత ఆటగాళ్లతో కోపంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. డ్రెస్సింగ్ రూల్ లో ఇది మరింత హీటును పెంచిందని క్రికెట్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
అలాంటివాళ్లు జట్టుకు అవసరంలేదు.. గంభీర్ హాట్ కామెంట్స్
పలు మీడియా నివేదికల ప్రకారం.. బాక్సింగ్ డే టెస్టు లో ఆసీస్ చేతిలో భారత జట్టు ఓడిపోయిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం హీటెక్కింది. 4వ టెస్ట్‌లో జట్టు ఘోర పరాజయంతో నిరాశ చెందిన గంభీర్, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో కోపంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా భారత జట్టులోని స్టార్ సీనియర్ ప్లేయర్ల ఆట తీరును ప్రశ్నించారు. సీనియర్ ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించకుండా.. “నాకు జట్టు కోసం సరిగ్గా ఆడే వాళ్లే కావాలి. జట్టుకు తగినంతగా సహకరించని వారికి నమస్కారం చెప్పి పంపిస్తారు” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా స్టార్ ప్లేయర్లు, సీనియర్ ప్లేయర్లు అనే సంబంధం లేకుండా మంచి ప్రదర్శనలు ఇవ్వని ఏ ప్లేయరూ తమకు అవసరం లేదనీ, వారిని ఇంటికి సాగనంపుతాయని తేల్చిచెప్పినట్టు పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
గంభీర్-రోహిత్ శర్మ మధ్య ఘర్షణ జరిగిందా?
కాగా, గౌతమ్ గంభీర్ మాటలతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. అంతేకాకుండా, జట్టు ఆటగాళ్ల ఎంపికలో గంభీర్, రోహిత్ శర్మ మధ్య ఘర్షణ నెలకొందని కూడా చెబుతున్నారు. గంభీర్ ఒత్తిడితో అశ్విన్ రిటైర్ అయ్యాడని, దాన్ని రోహిత్ శర్మ ఇష్టపడలేదని, గంభీర్ తీరు రోహిత్‌కు నచ్చలేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలతో తీవ్ర నిరాశలో ఉన్న రోహిత్ శర్మ 5వ టెస్ట్ తర్వాత రిటైర్ కావొచ్చని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం భారత జట్టులో చీలిక ఏర్పడిందని టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు మాజీ భారత దిగ్గజ ప్లేయర్లు ఇలాంటి పరిణామాలు భారత జట్టుకు మంచివి కావని పేర్కొంటున్నారు.
IND vs AUS
భారత జట్టు ప్రంపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ బరిలో నిలిచేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆసీస్ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. మొదటి మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. రెండో మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించింది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మెల్ బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. కంగారుల టీమ్ ఈ సిరీస్ లో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాలు గమనిస్తే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మెరుగైన ప్రదర్శనలు లేకపోవడం. అలాగే, సీనియర్ స్టార్ బ్యాటర్లతో పాటు మిగతా ప్లేయర్లు కూడా పరుగులు చేయడంలో విఫలం కావడం.
ఆస్ట్రేలియాలో భారత జట్టు దారుణ ప్రదర్శనలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు కూడా భారత్ కు క్లిష్టంగా మారాయి. సిడ్నీలో జరిగే చివరి టెస్టును తప్పకుండా గెలవడంతో పాటు శ్రీలంక-ఆసీస్ టెస్టు సిరీస్ మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలోకి జారుకుంది. టీమిండియా సిడ్నీ టెస్టులో గెలవడంతో పాటు శ్రీలంక చేతిలో ఆసీస్ ఓడిపోతేనే భారత జట్టుకు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలుంటాయి. అలా జరగని పక్షంలో ఇప్పటికే ఫైనల్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకున్న సౌతాఫ్రికాతో ఆసీస్ ఫైనల్ ఆడుతుంది.