కెప్టెన్సీ నీ వల్ల కాదుగానీ వదిలేయ్.. ఆసీస్ సారథిపై ఇయాన్ హీలి షాకింగ్ కామెంట్స్
BGT 2023: భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆ జట్టు బ్యాటర్లతో పాటు వ్యూహరచన చేయడంలో విఫలమవుతున్నాడని సారథి పాట్ కమిన్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండు టెస్టులలో ఓడిన కంగరూలపై ఆసీస్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు టెస్టులలోనూ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటర్లతో పాటు భారత్ లో వ్యూహరచన చేయడంలో విఫలమవుతున్నాడని సారథి పాట్ కమిన్స్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ హీలి కూడా కమిన్స్ ను టార్గెట్ చేసి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతడు సారథ్య బాధ్యతలను వదిలేసి బౌలింగ్ మీద దృష్టి సారిస్తే బెటరని సూచించాడు. కమిన్స్ అందుబాటులో లేకుంటే స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ ఇచ్చే బదులు ట్రావిస్ హెడ్ కు ఇవ్వడం బెటర్ అని హీలి అభిప్రాయపడ్డాడు.
రెండో టెస్టు ముగిసిన తర్వాత కమిన్స్ స్వదేశానికి వెళ్లిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో అతడు సిడ్నీ వెళ్లాడు. దీంతో మూడో టెస్టులో ఆసీస్ కు స్టీవ్ స్మిత్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో హీలి మాట్లాడుతూ... ‘కమిన్స్ సారథిగా ఎక్కువకాలం ఆ భారాన్ని మోయడం నాకిష్టం లేదు. అతడు రిటైర్ అయ్యేనాటికి నెంబర్ వన్ బౌలర్ గా ఉండాలి.. కానీ కెప్టెన్సీ వల్ల అది కాని పని.
ఇప్పటికే రెండేండ్లుగా అతడు టెస్టు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు అదనంగా వన్డే, టీ20 బాధ్యతలు కూడా వచ్చాయి. ఇది అతడిపై అదనపు భారం మోపుతోంది. ఇది అతడి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కమిన్స్ సారథ్య బాధ్యతలను వదులుకుని వాటిని ఇతరులకు అప్పగించాలి.
టెస్టులలో ట్రావిస్ హెడ్ కు కెప్టెన్సీ అప్పజెప్పితే బెటర్. హెడ్ కు ఆ సామర్థ్యం ఉంది. కమిన్స్ లేకుంటే సారథిగా మెదిలినవారిలో అతడు ఒకడు. ఇక పరిమిత ఓవర్లలో అయితే ఆ బాధ్యతలను గ్లెన్ మ్యాక్స్‌వెల్ కు అందజేయాలి...’అని అభిప్రాయపడ్డాడు.
కాగా కమిన్స్ కు సీనియర్ గా ఉండి ప్రస్తుతం ఆస్ట్రేలియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను హీలి పట్టించుకోకపోవడం గమనార్హం. దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ ఊడిన విషయం తెలిసిందే. 2021లో టిమ్ ఫైన్ ను తొలగించిన తర్వాత కమిన్స్ ను సారథిగా నియమించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్మిత్ ను వైస్ కెప్టెన్ గా చేసింది.