కెఎల్ రాహుల్ విషయంలో ఆ ఇద్దరూ చేస్తుంది తప్పు.. రచ్చ చేయొద్దంటున్న గంభీర్
INDvsAUS: టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ వరుస వైఫల్యాలపై భారత మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రాల మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కెఎల్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ వెంకటేశ్ ప్రసాద్.. ట్విటర్ వేదికగా మండిపడుతున్నాడు.

బీసీసీఐ కెఎల్ రాహుల్ పట్ల ఒక విధంగా మిగతా ప్లేయర్ల పట్ల మరో విధంగా ప్రవర్తిస్తున్నదని.. అతడిని ఆడించడమంటే అది భారత్ లో బ్యాటర్లు లేరని మన పరువు మనం తీసుకోవడమే అని వెంకటేశ్ ప్రసాద్ తన ట్వీట్స్ తో సంచలనం రేపాడు. గణాంకాలతో సహా రాహుల్ వైఫల్యాలను ఎండగట్టాడు. ఢిల్లీ టెస్టు జరుగుతున్నప్పుడే రాహుల్ పై విమర్శలు గుప్పించాడు.
వెంకటేశ్ ప్రసాద్ తీరును ఆకాశ్ చోప్రా తప్పుబట్టాడు. టెస్టు జరుగుతుండగా ఇలాంటి కామెంట్స్ చేయడం మంచిది కాదని టైమింగ్ ముఖ్యమని హితబోధ చేయడానికి యత్నించాడు. కానీ దానికి ప్రసాద్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాను ఎవరిని ఎందుకు విమర్శిస్తున్నానో తనకు తెలుసునని.. నువ్వు యూట్యూబ్ వీడియోలు చేసుకోమని సలహా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
తాజాగా ఈ ట్విటర్ వార్ పై గౌతం గంభీర్ స్పందించాడు. టైమ్స్ నౌ ఛానెల్ తో గంభీర్ మాట్లాడుతూ.. ‘ఆ బజ్ (కెఎల్ గురించి ప్రసాద్ - ఆకాశ్ ల ట్విటర్ వార్) గురించి నేను కచ్చితంగా మాట్లాడాలి. మీరు ఎవరికైనా సాయం చేయాలన్నా ఎవరినైనా విమర్శించాలన్నా అది నలుగురి మధ్య కాకుండా నాలుగు గోడల మధ్య చేయడం బెటర్. దానిని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయొద్దు..
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో రాహుల్ ను తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలువురు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఇలా అనడం నేనూ చూశాను. కానీ టీమ్ ను సెలక్ట్ చేసేది ఎక్స్‌పర్ట్స్ కాదు. సెలక్టర్లు. ఎవరైనా ఆటగాడు సరిగ్గా ఆడకుంటే అతడికి మద్దతుగా నిలవడం ముఖ్యం. కెఎల్ కు కూడా మద్దతుగా నిలవడం అవసరం.
అతడు ఐపీఎల్ లో నేను మెంటార్ గా ఉన్న లక్నో టీమ్ కు కెప్టెన్ అని ఈ మాటలు చెప్పడం లేదు. ఆ స్థానంలో ఎవరున్నా నేను ఇలాగే చేసేవాడిని. ఈ సిరీస్ లో రాహుల్ కు మద్దతుగా రోహిత్ నిలబడ్డాడు. అందుకు మనం అతడిన అభినందించాలి...’అని చెప్పాడు.
ఇదిలాఉండగా గంభీర్ కామెంట్స్ పై విరాట్ కోహ్లీ, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. కోహ్లీ సారథిగా, శాస్త్రి కోచ్ గా ఉండగా ఇదే గంభీర్ ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఇప్పుడు మాత్రం చిలుకపలుకులు పలుకుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీకి ఓ న్యాయం రాహుల్ కు ఓ న్యాయమా..? అని ప్రశ్నిస్తున్నారు.