- Home
- Sports
- Cricket
- పెరగనున్న ఐపీఎల్ మ్యాచుల సంఖ్య.. ఒకే ఏడాదిలో రెండు సీజన్ల వైపుగా బీసీసీఐ అడుగులు..?
పెరగనున్న ఐపీఎల్ మ్యాచుల సంఖ్య.. ఒకే ఏడాదిలో రెండు సీజన్ల వైపుగా బీసీసీఐ అడుగులు..?
IPL: గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఒకే ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్ల దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల అభిమానాన్ని చురగొంటున్న ఐపీఎల్ మరింత పెద్దగా కాబోతున్నది. ఇప్పటికే ఒక సీజన్ లో రెండు నెలల సుదీర్ఘ కాలం పాటు సాగుతున్న ఈ సీజన్.. ఇకనుంచి మరిన్ని మ్యాచులతో అలరించనుంది.
ప్రస్తుతం ఒక ఐపీఎల్ సీజన్ లో 74 మ్యాచులను నిర్వహిస్తున్నారు. లీగ్ దశలో 70, ప్లేఆఫ్స్, ఫైనల్స్ కలిపి 4 మ్యాచులు జరుగుతున్నాయి. అయితే 2023 నుంచి 2027 సైకిల్ లో మాత్రం మ్యాచుల సంఖ్య మరింత పెరుగనున్నదని సమాచారం.
క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. 2023-27 సైకిల్ కు గాను మ్యాచుల సంఖ్య ను క్రమంగా పెంచేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. ఈ సైకిల్ లో తొలి రెండు సీజన్లు (2023, 2024) ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం (74 మ్యాచులు) మ్యాచులను నిర్వహించనున్న బీసీసీఐ.. 2025 నుంచి మాత్రం వీటిని పెంచాలని భావిస్తున్నది.
2025 నుంచి ఒక 2026 వరకు సీజన్ కు 84 మ్యాచులు ఆడించాలని బీసీసీఐ ప్లాన్. ఇక ఈ సైకిల్ లో చివరి సీజన్ అయిన 2026లో మ్యాచుల సంఖ్యను 94కు పెంచాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తున్నది.
ఈ మేరకు ఇప్పటికే ఐపీఎల్ మీడియా హక్కుల కోసం బిడ్ లు వేసిన వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేశారట. మొత్తంగా 2023-27 సైకిల్ లో సుమారు 400 కు పైగా మ్యాచులను నిర్వహించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. ఈనెల 12న మీడియా హక్కుల వేలం ప్రక్రియ జరగాల్సి ఉంది.
తాజా పరిణామాలు చూస్తుంటే ఇటీవలే క్రికెట్ లో చర్చనీయాంశమైన ఒకే ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్ల దిశగా బీసీసీఐ అడగులు వేస్తున్నట్టే కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ఒకే ఏడాదిలో రెండు ఐపీఎల్ సీజన్లను నిర్వహించాలని ప్రతిపాదన చేశాడు.
ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు చేరినందువల్ల రెండు సీజన్లుగా విడగొట్టి సీజన్ కు 70 మ్యాచుల చొప్పున 140 మ్యాచులు నిర్వహించాలని ప్రతిపాదించాడు. టీ20 లలో ద్వైపాక్షిక సిరీస్ లను రద్దు చేయాలని.. ఫ్రాంచైజీ తరహా క్రికెట్ కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
భారత క్రికెట్ కు కాసుల పంట కురిపించడమే గాక మెరికల్లాంటి కుర్రాళ్లను వెలికితీస్తున్న ఐపీఎల్ ను మరింత పెద్దదిగా చేసేందుకు బీసీసీఐ అందుబాటులో ఉన్న అనుకూలతలనన్నింటినీ సొమ్ము చేసుకుంటున్నది.