- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ ప్రదర్శనలే కొలమానమా..? సర్ఫరాజ్‌కు మరోసారి నిరాశ.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం
ఐపీఎల్ ప్రదర్శనలే కొలమానమా..? సర్ఫరాజ్‌కు మరోసారి నిరాశ.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం
WTC Final 2023: వచ్చే నెల 7 - 11 తేదీల మధ్య ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భాగంగా బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి.

దర్శక దిగ్గజం రాజమౌళి తీసిన సై సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. చివర్లో రగ్బీ మ్యాచ్ ఫైనల్ లో ఫస్టాఫ్ లో నితిన్ టీమ్ చెత్తగా ఆడిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ..‘కొత్తగా ఏం జరిగింది. ఊహించిందే కదా..’ అంటాడు. బహుశా ముంబై యువ క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ కు ఈ డైలాగ్ సూట్ పక్కాగా సరిపోతుంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా అతడికి జాతీయ జట్టులో పిలుపు రావడం లేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో గత రెండు రంజీ సీజన్లలో వీరవిహారం చేస్తున్న సర్ఫరాజ్ ఇప్పటివరకు 37 మ్యాచ్ లలో 54 ఇన్నింగ్స్ ఆడి 3,505 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు 80కి పైగానే నమోదైంది. ఆనతికాలంలోనే అతడు 13 సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు కూడా ట్రిపుల్ సెంచరీ (301 నాటౌట్) గా నమోదైంది.
ఇంత ఆడుతున్నా సర్ఫరాజ్ కు ప్రతి టెస్టు సిరీస్ ఆరంభంలో నిరాశే ఎదురవుతున్నది. అతడిని ఎంపిక చేయాలని చాలా కాలంగా ఫ్యాన్స్ డిమాండ్స్ చేస్తున్నా ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మాత్రం అతడికి ప్రతిసారి మొండిచేయే చూపెడుతున్నది. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ లో భాగంగా ఇదివరకే ప్రకటించిన జట్టులో రాహుల్ కు గాయం కాగా నేడు మరోసారి వెల్లడించిన జట్టులో కూడా సర్ఫరాజ్ కు నిరాశ తప్పలేదు.
రాహుల్ స్థానాన్ని ఇషాన్ కిషన్ తో భర్తీ చేయించింది బీసీసీఐ. ఇది టీమిండియా ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పించింది. ఏ బేసిస్ లో ఇషాన్ కిషన్ ను ఎంపిక చేశారో చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శనలనే కొలమానంగా తీసుకుంటే ఈ సీజన్ లో సర్ఫరాజ్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా గొప్పగా రాణించలేదన్న సత్యాన్ని బీసీసీఐ గ్రహిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఐపీఎల్ -16లో సర్ఫరాజ్ ఖాన్ 4 మ్యాచ్ లలో 53 పరుగులే చేయగా ఇషాన్ కిషన్ 10 మ్యాచ్ లు ఆడి 294 పరుగులు చేశాడు. రెండు మ్యాచ్ లలో హాఫ్ సెంచరీలు మినహా ఇషాన్ మిగతా మ్యాచ్ లలో విఫలమయ్యాడు. గత సీజన్ లో అయితే ఇషాన్ దారుణ ఆటతో విమర్శలు మూటగట్టుకున్నాడు.
ముంబై ఇండియన్స్ నుంచి ఆడితే ఎంతటి చెత్త ప్లేయర్ కు అయినా టీమిండియాలో ఛాన్స్ దక్కుతుందని.. దానికి తాజాగా బీసీసీఐ ప్రకటనే నిదర్శనమని ఫ్యాన్స్ వాపోతున్నారు. రాహుల్ స్థానాన్ని ఇషాన్ తో భర్తీ చేయించిన బీసీసీఐ.. స్టాండ్ బై ప్లేయర్ గా కూడా సూర్యకుమార్ యాదవ్ ను ఎంపికచేసింది. సూర్య కూడా ముంబై ఇండియన్స్ ఆటగాడే. ఈ సీజన్ కు ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలలో మూడు డకౌట్లు అయినవాడే. ఐపీఎల్ - 16లో కూడా మొదట్లో విఫలమయ్యాడు.
Image credit: PTI
ఒకవేళ ఐపీఎల్ ప్రదర్శనలనే కొలమానంగా తీసుకుంటే ఇషాన్ కంటే గొప్పగా ఆడుతున్న రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ను తీసుకుంటే బావుండేదని.. కానీ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని ఇషాన్ ను ఎంపిక చేయడం అంటే ఇది బీసీసీఐ ఫేవరెటిజానికి నిదర్శనమని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.