- Home
- Sports
- Cricket
- కీలక టోర్నీలు ముందున్నాయి.. వాళ్లిద్దరి మీద ఓ కన్నేసి ఉంచండి : వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
కీలక టోర్నీలు ముందున్నాయి.. వాళ్లిద్దరి మీద ఓ కన్నేసి ఉంచండి : వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ స్పెషల్ రిక్వెస్ట్
IND vs ZIM: భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. గురువారం నుంచి జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ..

జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి వన్డేకు సన్నద్ధమవుతున్నది. ఈ సిరీస్ కోసం ముందు శిఖర్ ధావన్ ను సారథిగా నియమించినా తర్వాత కోవిడ్ నుంచి కోలుకోవడంతో కెఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించారు సెలక్టర్లు. రాహుల్ సారథ్యంలో యువ భారత్.. జింబాబ్వే పని పట్టడానికి ప్రాక్టీస్ లో మునిగిఉంది.
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఈ సిరీస్ లో విశ్రాంతినివ్వడంతో జింబాబ్వే సిరీస్ కు వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. అయితే లక్ష్మణ్ కు బీసీసీఐ సిరీస్ ప్రారంభానికి ముందు ఓ స్పెషల్ రిక్వెస్ట్ పంపింది.
విరామం తర్వాత ఈ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిన దీపక్ చాహర్, కెఎల్ రాహుల్ ల మీద ప్రత్యేక దృష్టి సారించాలని బీసీసీఐ అధికారులు లక్ష్మణ్ ను కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ సిరీస్ లో గాయపడిన చాహర్.. సుమారు 5 నెలల తర్వాత ఇదే తొలి సిరీస్. ఇక కెఎల్ రాహుల్ కూడా ఐపీఎల్ ముగిశాక కాలికి గాయమై మళ్లీ ఇప్పుడే గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
దీంతో వీళ్లిద్దరి మీద ఓ కన్నేసి ఉంచాలని లక్ష్మణ్ ను బీసీసీఐ కోరింది. రాహుల్, చాహర్ ల ప్రదర్శన, ఫిట్నెస్ ఇప్పుడు టీమిండియాకు కీలకం. రానున్న రోజుల్లో కీలక సిరీస్ లతో పాటు రెండు మెగా టోర్నీలున్నాయి. జింబాబ్వేతో సిరీస్ తర్వాత భారత జట్టు ఆసియా కప్ ఆడనుంది. ఆసియా కప్ కోసం ఈ ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు.
ఆసియా కప్ ముగిశాక స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో కూడా భారత్ మ్యాచ్ లు ఆడనుంది. అవి ముగిశాక అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాపార్డర్ బ్యాటర్ గా రాహుల్, ఆల్ రౌండర్ గా దీపక్ చాహర్ లు జట్టుకు ఎంతో కీలకం కానున్నారు. దీంతో వారి ఫిట్నెస్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని బీసీసీఐ లక్ష్మణ్ ను కోరింది.
ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘రాహుల్, చాహర్ లు టీమిండియాకు కీలక ఆటగాళ్లు. వాళ్లిద్దరూ పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉండాలని మేం కోరుకుంటున్నాం. వాళ్లిద్దరినీ ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిందిగా మేం లక్ష్మణ్ ను కోరాం. రాహుల్, చాహర్ లు ఆసియా కప్ లో కూడా ఆడాల్సి ఉంది..’ అని తెలిపాడు.
జస్ప్రీత్ బుమ్రాకు గాయం కావడంతో టీమిండియా ఆందోళన చెందుతున్నది. అతడి గాయం పెద్దదే అని.. కనీసం మూడు నెలలైనా విశ్రాంతి తప్పదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్ అవసరం భారత్ కు ఎంతైనా ఉంది. ఆ స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేసే అవకాశమున్నట్టు సమచారం. అందుకే టీమిండియా.. అతడి మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.
మరోవైపు రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అతడు తరుచూ గాయాలపాలవుతుండటంతో గడిచిన ఐదారునెలల్లో భారత జట్టుకు ఓపెనింగ్ కష్టాలు తప్పడం లేవు. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా రోహిత్ శర్మతో సిరీస్ కు ఒకరు ఓపెనింగ్ కు వచ్చినా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. మరి ఈ ఇద్దరూ జింబాబ్వే సిరీస్ లో ఏమేరకు ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.