పింక్ బాల్ టెస్టు: ఇంగ్లాండ్‌ను తిప్పేసిన భారత స్పిన్నర్లు... ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మనోళ్ల బ్యాటింగ్...
పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోని ఇంగ్లాండ్, పరుగులకే ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ ఆరు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. రెండో సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా, ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయనుంది.
100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో డొమినిక్ సిబ్లీ డకౌట్ కావడంతో 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్... రెండో ఓవర్‌లోనే వికెట్ తీశాడు ఇషాంత్ శర్మ...
9 బంతులు ఆడిన పరుగులేమీ చేయలేకపోయిన జానీ బెయిర్ స్టో, అక్షర్ పటేల్ వేసిన తొలి బంతికే అవుట్ అయ్యాడు. 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
కెప్టెన్ జో రూట్, ఓపెనర్ జాక్ క్రావ్లే కలిసి కాసేపు వికెట్లు పతనాన్ని అడ్డుకున్నారు. 37 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన జో రూట్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు జో రూట్...
ఆ తర్వాత కొద్దిసేపటికే టెస్టుల్లో నాలుగో హాఫ్ సెంచరీ చేసుకున్న ఓపెనర్ జాక్ క్రావ్లే కూడా పెవిలియన్ చేరాడు. 84 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసిన జాక్ క్రావ్లే, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత 12 బంతులు ఆడి ఒక్క పరుగు చేసిన ఓల్లీ పోప్ కూడా 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఓల్లీ పోప్...
24 బంతుల్లో 6 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 81 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...
జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 93 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
జాక్ లీచ్ 14 బంతుల్లో 3 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, 29 బంతుల్లో 3 పరుగులు చేసిన స్టువర్ట్ బ్రాడ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
58 బంతుల్లో 12 పరుగులు చేసిన ఫోక్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్..
భారత బౌలర్లలో రెండో టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్ ఆరు వికెట్లు తీసి, కెరీర్‌లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చగా రవిచంద్రన్ అశ్విన్‌కి 3 వికెట్లు దక్కాయి. ఇషాంత్ శర్మ ఓ వికెట్ తీయగా, బుమ్రాకి వికెట్ దక్కలేదు.
ఇండియాలో ఆతిథ్య జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో ఇది రెండో అత్యల్ప స్కోరు. మొదటి పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ 106 పరుగులకి ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్ జట్టు 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది.