Joe Root: దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేసిన రూట్..
Ashes 2023: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ యాషెస్ సిరీస్ ను ఘనంగా ఆరంభించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రూట్ 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టులలో రూట్ కు ఇది 30వ సెంచరీ. ఈ మ్యాచ్ లో రూట్.. 152 బంతులలో 118 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను బ్రేక్ చేశాడు.
Don Bradman
రూట్.. 30 వ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) శతకాల రికార్డును బ్రేక్ చేశాడు. బ్రాడ్‌మన్.. 52 టెస్టులలో ఏకంగా 99.94 సగటుతో 6,996 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు 29 సెంచరీలు చేశాడు. తాజాగా రూట్.. బ్రాడ్‌మన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేశాడు.
Alaister Cook
అంతేగాక రూట్.. ఇంగ్లాండ్ తరఫున అతి పిన్న వయసులో 30 సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ తరఫున అలెస్టర్ కుక్.. 161 మ్యాచ్ లలో 33 సెంచరీలు సాధించాడు. రూట్ .. 131 మ్యాచ్ లో 30 సెంచరీల ఘనతను అందుకున్నాడు. రూట్ వయసు 32 ఏండ్లు మాత్రమే.
30 సెంచరీలు చేయడానికి రూట్ కు 239 ఇన్నింగ్స్ అవసరం కాగా కుక్ 254 ఇన్నింగ్స్ లలో ఆ రికార్డు అందుకున్నాడు. రూట్.. కుక్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మరో మూడు సెంచరీలు చేస్తే రూట్.. కుక్ ను సమం చేస్తాడు.
గడిచిన రెండేండ్లుగా సెంచరీల మోత మోగిస్తున్న రూట్.. ఆధునిక క్రికెట్ లో ఫ్యాబ్ -4 గా పిలుచుకునే (విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్) బ్యాటర్లలో మిగిలిన ముగ్గురి కంటే దూకుడుగా ఆడుతున్నాడు. ఈ రెండేండ్లలో కోహ్లీ, కేన్, స్మిత్ లు కలిసి 2021 నుంచి ఇప్పటివరకూ పది సెంచరీలు చేస్తే.. రూట్ ఏకంగా 13 సెంచరీలు బాదాడు.
2012లో ఇండియాలోనే జరిగిన టెస్టు సిరీస్ లో ఎంట్రీ ఇచ్చిన రూట్.. మూడేండ్ల తర్వాత టెస్టులలో సెంచరీ (ఆస్ట్రేలియా) చేశాడు. 2021 వరకూ రూట్.. 96 టెస్టులు ఆడితే చేసింది 17 సెంచరీలే. కానీ 2021 తర్వాత 34 టెస్టులు ఆడిన రూట్.. 62 ఇన్నింగ్స్ లలో 58.91 సగటుతో 3,299 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అతడు 13 సెంచరీలు, 9 అర్థ సెంచరీలు చేయడం గమనార్హం.