- Home
- Sports
- Cricket
- Shane Warne Controversies: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. మలుపుల రారాజుకు అంటుకున్న మరకలివే..
Shane Warne Controversies: వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. మలుపుల రారాజుకు అంటుకున్న మరకలివే..
Shane Warne Passes Away: ఒక ఆటగాడు దేశం తరఫున ప్రాతినిథ్యం వహించినప్పుడు ఆటకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో.. ఆటేతర విషయాలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే అతడు గొప్ప ఆటగాడు అవుతాడు. కానీ వార్న్ రెండోదాన్ని పాటించలేదు.

పదిహేనేండ్ల క్రికె్ కెరీర్ లో లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించిన షేన్ వార్న్.. ఆసీస్ కెప్టెన్ అయ్యే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు. క్రికెట్ ఆడటం మొదలుపెట్టడం నుంచి రిటైరయ్యేదాకా ఆయన జీవితంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి.
బౌలింగ్ లో అతడి సామర్థ్యంపై విమర్శలు చేయడానికి సాహసించేవాళ్లు కూడా వార్న్ చేసిన పనులకు అతడిపై దుమ్మెత్తిపోశారు. లైంగిక ఆరోపణలు, బుకీలతో వివరాలు పంచుకోవడం.. డ్రగ్స్.. వార్న్ జీవితంలో అతడిని చుట్టుముట్టిన వివాదాల గురించి ఓసారి చూస్తే..
బుకీలకు కీలక సమాచారం.. 1994లో శ్రీలంక పర్యటన సందర్భంగా సహచర ఆసీస్ ఆటగాడు మార్క్ వాతో కలిసి పిచ్ వివరాలు, అక్కడి పరిస్థితులకు సంబంధించిన విషయాలను బుకీతో పంచుకున్నాడని, డబ్బులు కూడా తీసుకున్నాడని వార్న్ పై ఆరోపణ. 1992లోనే కెరీర్ ఆరంభించిన వార్న్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ..
రణతుంగను తిడుతూ.. బుకీల వివాదం ముగిసిపోకముందే వార్న్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. 1999లో ప్రపంచకప్ సందర్భంగా శ్రీలంక సారథి అర్జున రణతుంగను దూషిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఐసీసీ.. అతడిపై రెండు మ్యాచుల నిషేధాన్ని విధించింది.
డోప్ పరీక్షల్లో దొరికి.. 2003 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా వార్న్ మళ్లీ తనలోని బ్యాడ్ బాయ్ ను బయటకు తీశాడు. అతడు నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు డ్రగ్ పరీక్షలో తేలింది. దీంతో 2003 వరల్డ్ కప్ ఆరంభానికి సరిగ్గా ఒక్కరోజు ముందు వార్న్ ను ఇంటికి పంపించింది ఐసీసీ. అంతేగాక వార్న్ పై ఏడాది నిషేధం కూడా విధించింది.
నర్సుతో రాసలీలలు.. లైఫ్ ను విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే మనస్తత్వమున్న వార్న్ 2000లో ఓ బ్రిటీష్ నర్సుతో లైంగిక వ్యవహారం నడిపాడు. నర్సుకు లైంగిక వాంఛతో కూడిన మెసేజ్ పంపించాడు. ఇది అతడి క్రికెట్ కెరీర్ లో మాయని మచ్చ. ఈ వ్యవహారం కారణంగా ఆ ఏడాది వరకు టెస్టులలో ఆస్ట్రేలియాకు వైస్ కెప్టెన్ గా ఉన్న వార్న్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఆ బాధ్యతల నుంచి తప్పించింది.
2005లో మళ్లీ అదే తప్పు.. గతంలో అతడు చేసిన పనికి వైస్ కెప్టెన్సీ పోయినా వార్న్ లో మార్పు రాలేదు. 2005లో దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా.. ఇలాగే మహిళకు ఓ అసభ్యకర మెసేజ్ పెట్టాడు. దీంతో ఆమె వార్న్ పై ఫిర్యాదు చేసింది.
వివాహ బంధం కూడా సరిగా లేదు.. ప్రపంచ క్రికెట్ లో ఎన్నో కీలక భాగస్వామ్యాలను విడదీసిన వార్న్ తన జీవిత భాగస్వామితో కూడా ఎక్కువకాలం కలిసి జీవించలేదు. తన భార్య సిమోన్ తో కలిసి పదేండ్ల పాటు సంసారం చేసి.. ముగ్గురు పిల్లలకు తండ్రైన వార్న్.. 2005లో విడిపోయాడు. వార్న్ విలాసాలు, వివాదాలు చూసిన సిమోన్.. అతడితో తెగదెంపులు చేసుకుంది.
ఇవే గాక మోడళ్లతో హాఫ్ న్యూడ్ ఫోటోలకు ఫోజులివ్వడం.. ఒకే హోటల్ లో పలువురితో గడపడం.. బ్రిటీష్ నటి ఎలిజిబిత్ లిజ్ తో ప్రేమ వ్యవహారం వంటివి అతడి ఉన్నత స్థానాన్ని కిందకు దించాయి.