28 బంతుల్లోనే సెంచరీ... 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్
T20 Cricket Fastest Century: మేఘాలయతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతుల్లోనే సూపర్ సెంచరీతో 10 ఓవర్లలోనే తన జట్టుకు విజయాన్ని అందించాడు.
Abhishek Sharma
Abhishek Sharma: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భారత యంగ్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. సునామీ ఇన్నింగ్స్ లతో కొత్త రికార్డులు మోత మోగిస్తున్నారు. ఇదే క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) యంగ్ ప్లేయర్ బౌండరీల వర్షం కురిపిస్తూ.. సూపర్ సెంచరీ సాధించాడు.
కేవలం 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి సరికొత్త రికార్డు సాధించాడు. తాను ఆడుతున్న జట్టుకు కేవలం 10 ఓవర్లలోనే విజయాన్ని అందించాడు. అతనే ఐపీఎల్ హైదరాబాద్ టీమ్ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ.
Abhishek Sharma
సూర్యకుమార్ యాదవ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మేఘాలయపై టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ భీకర బ్యాటింగ్ చేశాడు. వరుస రికార్డులు సృష్టించే విధంగా బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించాడు. పంజాబ్ తరఫున ఆడుతున్న అభిషేక్ ఈ మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 106 పరుగులతో అజేయంగా నిలిచిన అభిషేక్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ లోనే పంజాబ్ కు విజయాన్ని అందించింది. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. టీ20 ఫార్మాట్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
అభిషేక్ రికార్డు సెంచరీ... 10 ఓవర్లలో పంజాబ్ విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మ మొదటి బంతి నుండి తన తుఫాను బ్యాటింగ్ తీరును ప్రదర్శించి పరుగుల సునామి తెప్పించాడు. 28 బంతుల్లో సెంచరీ బాదాడు. మొత్తంగా 29 బంతుల్లో 11 సిక్సర్లు, 8 ఫోర్లతో 106 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా పంజాబ్ 9.3 ఓవర్లలో 144 పరుగులతో విజయాన్ని అందుకుంది.
Abhishek Sharma
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అభిషేక్ శర్మ 28 బంతుల్లో సెంచరీ సాధించి, టీ20లో వేగవంతమైన భారత సెంచరీ రికార్డును సమం చేశాడు. గత వారం త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఎస్టోనియా తరపున 27 బంతుల్లో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ పూర్తి చేసిన టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సాహిల్ చౌహాన్ కంటే ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఒక బంతితో వెనుకబడి ఉన్నారు.
టీ20 క్రికెట్ లో వేగవంతమైన సెంచరీలు
27 బంతులు - సాహిల్ చౌహాన్ - ఎస్టోనియా vs సైప్రస్, 2024
28 బంతులు - అభిషేక్ శర్మ - పంజాబ్ vs మేఘాలయ, 2024
28 బంతులు - ఉర్విల్ పటేల్ - గుజరాత్ vs త్రిపుర, 2024
30 బంతులు - క్రిస్ గేల్ - రాయల్ ఛాలెంజర్స్, పూణె,2013
33 బంతులు - రిషబ్ పంత్ - ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్, 2018
సూర్యకుమార్ యాదవ్ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ
అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 10వ సిక్సర్ కొట్టిన వెంటనే, సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ శర్మ ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక T20 సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు 2022లో 85 సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ పేరిట ఉంది. ప్రస్తుత సంవత్సరంలో అభిషేక్ శర్మ 87 సిక్సర్లు కొట్టాడు.
ఒక సంవత్సరంలో అత్యధిక T20 సిక్సర్లు బాదిన భారతీయులు
87 - 2024లో అభిషేక్ శర్మ*
85 - 2022లో సూర్యకుమార్ యాదవ్
71 - 2023లో సూర్యకుమార్ యాదవ్