KL Rahul: గాయాల రాహుల్.. ఏడు నెలల్లో నాలుగోసారి.. ఇలా అయితే కష్టమే..
IND vs SA T20Is: టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ వరుసగా గాయాల భారిన పడుతుండం జట్టుకు ఆందోళనకరమే కాకుండా అతడి కెరీర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్నది.

టీమిండియా కు విరాట్ కోహ్లి తర్వాత కెప్టెన్ గా చేస్తున్న రోహిత్ శర్మకు వారసుడు అనే ట్యాగ్ తో జట్టులో కొనసాగుతున్న కెఎల్ రాహుల్.. ఆ పాత్ర కు న్యాయం చేసేలా కనిపించడం లేదు. వరుసగా గాయాల బారీన పడుతుండటం అతడి కెరీర్ కు శాపంగా మారింది.
గడిచిన ఏడు నెలల్లో అతడు నాలుగు సార్లు గాయపడి జట్టు నుంచి తప్పుకోవడమే గాక కీలక సిరీస్ లకు దూరమయ్యాడు. తాజాగా అతడు దక్షిణాఫ్రికాతో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్ లో కూడా గాయం కారణంగా వైదొలిగిన విషయం తెలిసిందే.
గతేడాది నవంబర్ లో టీ20 ప్రపంచకప్ అనంతరం భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ కు ముందు తొడ కండరాల నొప్పితో బాధపడ్డ రాహుల్ ఆ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ లో గాయపడ్డాడు.
దీంతో అతడు విండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చిన్న గాయమే అని.. దీని నుంచి త్వరగా కోలుకుని తర్వాత శ్రీలంకతో జరిగే సిరీస్ లో అతడు ఆడతాడని భావించారు.
కానీ లంకతో సిరీస్ కు ముందు గాయం నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో శ్రీలంకతో టీ20 లతో పాటు టెస్టు సిరీస్ కూడా మిస్ అయ్యాడు. అయితే లంకతో సిరీస్ ముగిసిన తర్వాత మొదలైన ఐపీఎల్-15లో ఆడాడు.
ఐపీఎల్ లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాహుల్.. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు రోహిత్ శర్మ విరామం తీసుకోవడంతో తాత్కాలిక సారథిగా నియమితుడయ్యాడు.
కానీ సరిగ్గా టీ20 సిరీస్ కు ఒక్క రోజు ముందుగా మళ్లీ గాయం కారణంగా సిరీస్ మొత్తం నుంచి దూరమయ్యాడు. అయితే వరుస గాయాలు టీమిండియా అభిమానులు కోరుకోలేనివే అయినా అంతకంటే ఎక్కువగా రాహుల్ కే నష్టం జరిగే అవకాశముంది.
వరుసగా గాయాల బారిన పడుతుంటే టీమ్ మేనేజ్మెంట్ అతడిపై నమ్మకముంచే అవకాశం కోల్పోతుంది. రోహిత్ తర్వాత కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్.. ఇలాగా వరుసగా గాయపడితే మాత్రం అతడికి సారథ్య బాధ్యతలు కూడా అప్పజెప్పడం కష్టమే. ఎందుకంటే ఒక ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు గానీ కెప్టెన్ ను భర్తీ చేయడం అంత ఈజీ కాదు.
రొటేషన్ పాలసీ వల్ల ఏదో ఒక సిరీస్ మట్టుకు అయితే దానివల్ల పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ వరుసగా గాయపడుతుంటే.. అదీ కెప్టెన్ స్థాయి ఆటగాడు గాయాలపాలవుతుంటే మాత్రం అది ఆందోళనకరం.
ఇదీగాక అక్టోబర్ లో ఆసీస్ వేదికగా రాబోయే టీ20 ప్రపంచకప్ తో పాటు వచ్చే ఏడాది భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ లో భారత్ రాణించాలంటే కీలకంగా వ్యవహరించే రాహుల్ వంటి ఆటగాళ్లు గాయాలపాలవడం అత్యంత ఆందోళనకరం.