వరుసగా రెండు సెంచరీలు.. సౌతాఫ్రికా బౌలర్లను వణికించిన 22 ఏళ్ల తిలక్ వర్మ
Tilak Varma Back to back centuries : జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. అద్భుతమైన ఆటతో అదరగొట్టింది. కొత్త రికార్డులు నమోదుచేసింది.
Tilak Varma
IND vs SA : భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో నాలుగవ, చివరి మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి బ్యాట్స్ తో దిగిన టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ సెంచరీల మోత మోగించారు. దీంతో భారత జట్టు టీ20 క్రికెట్ లో సౌతాఫ్రికాపై తమ అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది.
Tilak Varma, Sanju Samson, IND vs SA
తిలక్.. తిలక్.. తిలక్ వర్మ..
జోహన్నెస్‌బర్గ్‌లో లో తిలక్ వర్మ షో కనిపించింది. అతను క్రీజులోకి వచ్చిన తర్వాత తిలక్.. తిలక్.. తిలక్.. ఇదే వినిపించేలా చేశాడు. దక్షిణాఫ్రికాలో ఈ 22 ఏళ్ల యంగ్ భారత బ్యాట్స్‌మన్ ఆట గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి ఇన్నింగ్స్ మరోసారి ఆడాడు.
సెంచూరియన్‌లో తన మొదటి సెంచరీ కొట్టిన తిలక్ వర్మ.. వాండరర్స్ స్టేడియంలో తన రెండో టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ బాదాడు. తిలక్ వర్మ ఆఫ్రికన్ బౌలర్లను భయపెట్టేశాడు. అద్భుతమైన ఆటతో సౌతాఫ్రికా బౌలింగ్ ను చిత్తుచేశాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన రెండో భారత ప్లేయర్ గా ఘనత సాధించాడు. వాండరర్స్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో తిలక్ 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.
Sanju Samson, Tilak Varma
వాండరర్స్‌లో తిలక్ వర్మ సునామీ సెంచరీ
మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ వర్మ.. వచ్చిన వెంటనే ఫోర్లు, సిక్సర్లు బాదడం మొదలుపెట్టాడు. ఓ వైపు సంజూ శాంసన్ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించగా, మరోవైపు తిలక్ కూడా అదే స్టైల్లో బ్యాటింగ్ అదరగొట్టాడు. ఒక సమయంలో సంజూ కంటే ముందే సెంచరీ కొట్టేలా కనిపించాడు.
తిలక్ వర్మ 250 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో సౌతాఫ్రికా బౌలర్ల పై విరుచుకుపడుతూ 120* పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ ఈ సెంచరీని కేవలం 41 బంతుల్లో పూర్తి చేశాడు. తిలక్ వర్మ ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 9 ఫోర్లు బాదాడు. ఈ సెంచరీతో పాటు పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
Tilak Varma
తిలక్ వర్మ ఈ ప్రత్యేక క్లబ్‌లో చేరాడు
తిలక్ వర్మ వరుసగా రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సెంచరీలు పూర్తి చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సంజూ శాంసన్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ టీ20 సెంచరీలు బాదిన రెండవ భారత ప్లేయర్ గా ఘనత సాధించాడు. తిలక్ వర్మ కంటే ముందు ఈ ఫీట్ చేసిన నలుగురు బ్యాట్స్‌మెన్లలో గుస్తావ్ మాకెన్, రిలే రూసో, ఫిల్ సాల్ట్, సంజు శాంసన్ లు ఉన్నారు. తిలక్ వర్మ తన టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ లో ఇప్పటివరకు రెండు సెంచరీలు సాధించాడు. ఈ రెండు కూడా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లలోనే వచ్చాయి. అది కూడా ఒకే నెలలో కావడం విశేషం.
ఈ ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు బాదిన సంజూ శాంసన్
సౌతాఫ్రికాతో జరిగిన నాల్గో మ్యాచ్ లో తిలక్ వర్మతో పాటు సంజూ శాంసన్ కూడా సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన సంజూ శాంసన్.. నాల్గో మ్యాచ్ లో కూడా 100 పూర్తి చేశాడు. ఈ సెంచరీని 51 బంతుల్లో పూర్తి చేశాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ తన ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. 109 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో శాంసన్‌కి ఇది మూడో సెంచరీ. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించడం విశేషం. ప్రస్తుత సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 107 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.