2019 Round Up: మార్కెట్లోకి రిలీజైన నవ నవరత్నలాంటి ‘కార్లివే’!!
ఆటోమొబైల్స్ రంగాన్ని సమస్యల సుడిగుండంలో చుట్టేసింది 2019. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారు చేయాలన్న సమస్యకు తోడు, ఆర్థిక మందగమనం వెంటాడటంతో కార్లు, మోటారు బైక్‌ల విక్రయాల్లో వెనుకబడ్డాయి. కానీ ఎస్‌యూవీ మోడల్ కార్లకు మాత్రం మంచి డిమాండ్ నెలకొంది.
హ్యుండాయ్ మోటార్స్ మరో హాట్ కేక్ ‘వెన్యూ’:దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ మరో హాట్ కేక్ మోడల్ కారు వెన్యూ. మేలో విపణిలో అడుగు పెట్టిన ఈ కారు హాట్ కేక్ మాదిరిగా అమ్ముడవుతోంది. నాటి నుంచి ఇప్పటి వరకు 60,922 యూనిట్లు అమ్ముడయ్యాయి. హ్యుండాయ్ తొలి సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ఇది. మారుతి విటారా బ్రెజ్జా, టాటా నెనన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తోంది.
సెప్టెంబర్‌లో విపణిలోకి మారుతి ‘ఎస్-ప్రెస్సో’ : ప్రముఖ ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్‌లోని ఎస్ యూవీ మోడల్ కారు ‘ఎస్-ప్రెస్సో’ సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26,860 కార్లను విక్రయించింది. టాల్ బాయ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న ‘ఎస్-ప్రెస్సో’ కారు ప్రత్యర్థి సంస్థ ‘రెనాల్డ్ వారి క్విడ్ ఫేస్ లిఫ్ట్’ మోడల్ కారుతో పోటీ పడుతోంది. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆల్టో కే 10 హ్యాచ్ బ్యాక్ కారు 5500 ఆర్పీఎం వద్ద 67 బీహెచ్పీ, 3500 ఆర్పీఎం వద్ద 90 ఎన్ఎం టార్చి శక్తి వెలువరిస్తుంది. బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ ఆప్షన్ కారు ఇది.
ఫిబ్రవరిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారు ఆవిష్కరణ : మహీంద్రా రూపొందించిన ఎక్స్ యూవీ 300 మోడల్ కారు ఇప్పటి వరకు 33,581 యూనిట్లు అమ్ముడైంది. ప్రీమియం మోడల్‌లో డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. 1.2 లీటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. మారుతి సుజుకి విటారా బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మోడల్ కార్లకు పోటీ పడుతోంది.
జనవరిలో టాటా హారియర్ ఆవిష్కరణ : టాటా మోటార్స్ తన ఒమెగా ప్లాట్ ఫామ్ మోడల్ ఎస్‌యూవీ కారు హారియర్ భారత విపణిలోకి జనవరిలో అడుగు పెట్టింది. న్యూ ఇంపాక్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ మోడల్ కారులో ఫీచర్లు లాండ్ రోవర్ డిస్కవరీ ప్లాట్ ఫామ్ లో వాడినవే. 2.0 లీటర్ల నాలుగు సిలిండర్ల టర్బో చార్జిడ్ డీజిల్ మోటర్ ఇంజిన్‌తోపాటు మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఎకో, సిటీ, స్పోర్ట్‌లలో లభ్యం కానున్నది. ఎంజీ మోటార్స్ హెక్టార్, హ్యుండాయ్ క్రెటా, కియో సెల్టోస్, జీప్ కంపాస్ మోడల్ కార్లతో తల పడుతున్నది.
కియా సెల్టోస్ రికార్డులు:ఆగస్టు నెలలోనే విపణిలోకి విడుదలైన కియా సెల్టోస్ మోడల్ కారు ఇప్పటి వరకు 40,849 కార్లు అమ్ముడు పోయాయి. మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి కియోస్ సెల్టోస్ రికార్డులు నెలకొల్పింది. ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు స్రుష్టించింది. హ్యుండాయ్ క్రెట్టా, ఎంజీ మోటార్స్ హెక్టార్ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది సెల్టోస్.
భారతదేశ మార్కెట్లో అతి తక్కువ కాలంలో సక్సెస్ స్టోరీ సొంతం చేసుకున్న కారు సెల్టోస్. మూడు ఇంజన్ల ఆప్షన్లతోపాటు ఆటోమేటిక్ గేర్ బ్యాక్స్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ స్టాండర్డ్ కారుగా నిలిచింది. సీవీటీ గేర్ బ్యాక్స్ తోపాటు 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.4 లీటర్ల టర్బో చార్జిడ్ ఇంజిన్, డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (డీసీటీ), 1.5 లీటర్ల డీజిల్ సామర్థ్యం గల ఇంజిన్ ఇందులో ఉన్నాయి.
ఆగస్టులో విపణిలోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ఆగస్టులో విపణిలో అడుగు పెట్టింది. నాటి నుంచి ఇప్పటి వరకు 38,820 కార్లు అమ్ముడయ్యాయి. ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ కారుకు ప్రతి జోడి. ఇందులో వైర్ లెస్ ఫోన్ చార్జింగ్ చార్జింగ్, రేర్ ఎయిర్ వెంట్స్, హ్యుండాయ్ గ్రిల్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 1.2 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
జూలైలో విపణిలోకి ఎంజీ మోటార్స్ ‘హెక్టార్’:మొర్రిస్ గ్యారెజెస్ (ఎంజీ) మోటార్స్ రూపొందించిన హెక్టార్ మోడల్ కారు తొలిసారి ఈ ఏడాది భారత విపణిలో అడుగు పెట్టింది. హలోల్ ప్లాంట్ సిద్దం కాకపోవడంతో మధ్యలో కొన్ని రోజులు బుకింగ్స్ నిలిపేసింది. దీంతో ఇప్పటి వరకు 12,909 యూనిట్లు అమ్ముడు పోయాయి. 1.5 లీటర్లు, 2.0 లీటర్ల డీజిల్ సామర్థ్యంతో కూడిన కార్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు కార్లలోనూ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, పెట్రోల్ హైబ్రీడ్ మోడల్ కారు 48 వోల్టుల బ్యాటరీ కలిగి ఉంటుంది. మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇటరేషన్ కారు ఇది. ఇది హ్యుండాయ్ క్రెట్టా, కియా సెల్టోస్, టాటా హారియర్ మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తోంది.
ఆగస్టులో విపణిలోకి మారుతి సుజుకి ‘ఎక్స్ఎల్6’: నెక్సా నెట్ వర్క్ పరిధిలో పరిమితంగా మారుతి సుజుకి ఉత్పత్తి చేసిన మోడల్ కారు ‘ఎక్స్ఎల్6’. దీన్నిఆగస్టు నెలలో విపణిలోకి ఆవిష్కరించారు. నాటి నుంచి 12,899 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎర్టిగా మోడల్ కారును తలపిస్తున్న ఈ కారు మహీంద్రా మర్రాజో, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
సేల్స్‌లో మారుతి వాగన్ ఆర్ రికార్డులు ఈ ఏడాది జనవరిలో విపణిలోకి వచ్చిన మారుతి సుజుకి వాగన్ ఆర్ కార్లు ఇప్పటి వరకు 1,45,186 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వాగన్ ఆర్ మారుతి సుజుకిలో మూడోతరం కారు. రెండు ఇంజిన్ల వేరియంట్లు 1.2 లీటర్లతోపాటు నాలుగు సిలిండర్లు, ఒక లీటర్ మూడు సిలిండర్ల మోటార్ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం హ్యుండాయ్ శాంత్రో కారు, టాటా టియాగో మోడల్ కార్లతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నది.