Hydrogen Car: హైడ్రోజన్ ఇంధనంతో నడిచే Toyota Mirai కారులో పార్లమెంటుకు వెళ్లిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ..
దేశ భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీపైనే ఆధారపడి ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ రవాణాను ప్రోత్సహించేందుకు గడ్కరీ నేడు పార్లమెంటుకు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా మిరాయ్ (Toyota Mirai) కారులో వచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో భారత్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుందని పేర్కొన్నారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం పార్లమెంటుకు హైడ్రోజన్‌తో నడిచే టయోటా మిరాయ్ (Toyota Mirai) కారులో వచ్చారు. పెరుగుతున్న పెట్రోలు-డీజిల్ ధరలు, అలాగే పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో హైడ్రోజన్ కార్లు భవిష్యత్తులో సరైన ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల, గడ్కరీ మొదటి హైడ్రోజన్ కారు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
టయోటా కొద్ది రోజుల క్రితం దేశంలోనే మొట్టమొదటి ఆల్-హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు మిరాయ్ (Toyota Mirai)ను విడుదల చేసింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) సహకారంతో పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కారును విడుదల చేశారు. మిరాయ్ (Toyota Mirai) ప్రపంచంలోని కొన్ని FCEVలలో ఒకటి మరియు పూర్తిగా హైడ్రోజన్ నుండి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుతో నడుస్తుంది.
Toyota Mirai కారు కర్ణాటకలోని టయోటా తయారీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. వాస్తవానికి ఈ కారు గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యింది. ట్యాంక్‌ను ఒకసారి హైడ్రోజన్ ఇంధనంతో నింపుకోవడానికి 5 నిమిషాల సమయం తీసుకుంటుంది. అలాగే ఈ కారు 646 కి.మీ. మైలేజ్ అందిస్తుంది.
ఇంజిన్ ఇలా పనిచేస్తుంది
దేశంలో గ్రీన్ మరియు క్లీన్ ఇంధనాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. మిరాయ్‌లో అధిక పీడన హైడ్రోజన్ ఇంధన ట్యాంక్, ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. సాధారణ కార్ల మాదిరిగా కాకుండా, హైడ్రోజన్‌తో నడిచే కారు దీని టెయిల్‌పైప్ నుండి నీరు మాత్రమే బయటకు వస్తుంది. సేంద్రీయ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్రోల్ కంటే గ్రీన్ హైడ్రోజన్ చౌకగా ఉంటుందని గడ్కరీ పేర్కొన్నారు.
హైడ్రోజన్ భవిష్యత్ ఇంధనం
భారతదేశానికి స్వచ్ఛమైన మరియు సరసమైన ఇంధన భవిష్యత్తును సాధించడంలో గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నితిన్ గడ్కరీ ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తెలిపారు.