9 కొత్త ఫీచర్లు, సూపర్ డిజైన్ తో న్యూ మహీంద్రా బొలెరో 2025
Mahindra Bolero: మహీంద్రా బొలెరో 2025 మోడల్ ₹7.99 లక్షల ప్రారంభధరతో విడుదలైంది. కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్, లెదరెట్ ఇంటీరియర్‌తో లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది.

అప్‌డేట్ ఫీచర్లతో కొత్త మహీంద్రా బొలెరో 2025
ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా తన మహింద్రా బొలెరో (Mahindra Bolero) 2025 వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో స్వల్ప డిజైన్ మార్పులతో పాటు 9 కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. అయితే, ఇంజిన్, మెకానికల్ సెటప్ మాత్రం మారలేదు. కొత్త బొలెరో ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ₹7.99 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర ₹9.69 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా బొలెరో కొత్త వేరియంట్లు, వాటి ధరలు
మహీంద్రా బొలెరో 2025 ఎడిషన్ లో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి B4, B6, B6(O), కొత్త B8. వాటి ధరలు ఇలా ఉన్నాయి..
• Bolero B4 ₹7.99 లక్షలు
• Bolero B6 ₹8.69 లక్షలు
• Bolero B6(O) ₹9.09 లక్షలు
• Bolero B8 ₹9.69 లక్షలు
వీటితో పాటు మహింద్రా బొలెరో నియో 2025 (Mahindra Bolero Neo 2025) కూడా విడుదలైంది. ఇది ఐదు వేరియంట్లలో వస్తోంది. అవి N4, N8, N10, N10(O), కొత్త N11. ఈ మోడళ్ల ధరలు ₹8.49 లక్షల నుండి ₹9.99 లక్షల వరకు ఉన్నాయి.
మహీంద్రా బొలెరో కొత్త లుక్
2025 బొలెరోలో డిజైన్ పరంగా పలు మార్పులు చేశారు. కొత్త 5-స్లాట్ క్రోమ్ గ్రిల్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కొత్త 16-అంగుళాల అలాయ్ వీల్స్ వంటి అప్‌డేట్లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. టాప్ వేరియంట్ B8 లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. అలాగే, కొత్త కలర్లు కూడా ఉన్నాయి. స్టెల్త్ బ్లాక్, డీసాట్ సిల్వర్, డైమండ్ వైట్, రాతి లేత గోధుమ రంగులో అందుబాటులో ఉన్నాయి. బొలెరో నియోను కాంక్రీట్ గ్రే, జీన్స్ బ్లూ అనే రెండు కొత్త రంగులలో కూడా తీసుకొచ్చారు.
కొత్త మహీంద్రా బొలెరో ఇంటీరియర్ ఫీచర్లు
కొత్త మహీంద్రా బొలెరోలో ప్రధానంగా ఇంటీరియర్ విభాగంలో పెద్ద మార్పులు చేశారు. వాటిలో..
• మొదటిసారి 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు.
• USB Type-C చార్జింగ్ పోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, లెదరెట్ సీట్లు, డోర్ ట్రిమ్స్‌లో బాటిల్ హోల్డర్లు లాంటి ఫీచర్లు తీసుకొచ్చారు.
• అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబీఎస్ తో ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
కొత్త మహీంద్రా బొలెరో నియో వేరియంట్లలో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ISOFIX మౌంట్స్, రియర్ వ్యూ కెమెరా వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
కొత్త మహీంద్రా బొలెరో ఇంజిన్, పనితీరు వివరాలు ఏంటి?
కొత్త మహీంద్రా బొలెరో లో ఇంజిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేవు. మహీంద్రా బొలెరో 2025 ఎడిషన్ లోనూ 1.5-లీటర్, 3-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 76 హెచ్‌పీ పవర్, 210 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
మహీంద్రా బొలెరో నియో అదే సామర్థ్యం ఉన్న 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది కానీ దాని అవుట్‌పుట్ 100 హెచ్‌పీ, 260 Nm టార్క్ వరకు ఉంటుంది.
ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో, రియర్ వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్‌లో తనదైన ముద్రవేసిన మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో కు మంచి మార్కెట్ ఉంది. మహీంద్రా బొలెరో, నియోతో పోటీ పడే వాహనాలు తక్కువగానే ఉన్నాయి. మహీంద్రా తెలిపిన ప్రకారం, ఈ కొత్త అప్‌డేట్‌తో బొలెరో, బొలెరో నియో రైడ్ క్వాలిటీ, హ్యాండ్లింగ్ మరింతగా మెరుగుపడింది.
కొత్త మహీంద్రా బొలెరో 2025 మోడల్, తన క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తూ, ఆధునిక ఫీచర్లు, ఇంటీరియర్ అప్‌డేట్స్‌తో మరింత ప్రీమియం అనుభవాన్ని అందిస్తోంది. ₹7.99 లక్షల ప్రారంభ ధరతో ఇది మధ్యతరగతి SUV కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయమైన ఎంపికగా ఉందని నిపుణలు పేర్కొంటున్నారు.