ఇలాంటి వారికి పొరపాటున కూడా అప్పు ఇవ్వకూడదు!
మనలో చాలామంది ఏదో ఒక కారణంతో ఎప్పుడో ఒకప్పుడు అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేస్తూనే ఉంటాం. మనం ఇతరులకు అవసరమైనప్పుడు సహాయపడాలి అనుకోవడం మంచి విషయమే అయినప్పటికీ.. కొందరు వ్యక్తులకు అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఎవరికో ఇక్కడ చూద్దాం.

ఎలాంటి వారికి అప్పు ఇవ్వకూడదు?
ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి టైంలో చాలామంది బంధువులు, స్నేహితులు లేదా తెలిసిన వారి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు అప్పు తీసుకునేటప్పుడు చూపించినంత ఆసక్తి తిరిగి చెల్లించేటప్పుడు చూపించరు. దానివల్ల డబ్బులు ఇచ్చి మరీ సమస్య కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మరి ఎలాంటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇస్తే.. తిరిగి వసూలు చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
గొప్పల కోసం అప్పు చేసే వ్యక్తులు
కష్ట సమయాల్లో అప్పులు చేయడం సహజం. కానీ కొందరు కేవలం సరదా కోసం, గొప్పల కోసం అప్పు చేస్తుంటారు. ఇది కొనాలి.. అది కొనాలని చెబుతుంటారు. అందుకు డబ్బులు కావాలని స్నేహితులను, బంధువులను అడుగుతుంటారు. ఇలా ఎంజాయ్ చేయడానికే డబ్బులు అడిగే వారికి అప్పు ఇవ్వకపోవడమే మంచిది.
మతిమరుపు ఉన్న వ్యక్తులు
మతిమరపు ఉన్న వ్యక్తులకు అప్పు ఇస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. వారు మీ దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ తిరిగి చెల్లించడం మాత్రం మర్చిపోతారు. అలాంటి వ్యక్తులు ఎన్నిసార్లు డబ్బు అడిగినా ఇవ్వకపోవడమే ఉత్తమం. ఇస్తే ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది.
పదే పదే అప్పులు అడిగేవారు
చాలామంది గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వక ముందే మళ్లీ అప్పు అడుగుతుంటారు. “ డబ్బు చాలా అవసరం. ఈ ఒక్కసారికి ఇవ్వు. అన్నీ కలిపి ఇస్తాను.” అని చెబుతుంటారు. కానీ గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్లీ డబ్బు అడిగితే అలాంటి వారికి ఇవ్వకపోవడమే మంచిది. వారికి అప్పు ఇచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుంది.
నటించే వ్యక్తులకు
చాలామంది అప్పు తీసుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడుతారు. కానీ తిరిగి కట్టమన్నప్పుడు మాత్రం విశ్వరూపం చూపిస్తారు. అస్సలు మీరు ఎవరో కూడా తెలియదన్నట్లే ప్రవర్తిస్తారు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా.. తప్పించుకొని తిరుగుతుంటారు. అలాంటి వారికి అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు.
స్వార్థపరులు
కొంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే స్నేహితులు, బంధువులు గుర్తుకువస్తారు. మిగతా టైంలో అసలు మనం ఎవరో కూడా తెలియనట్లుగా ఉంటారు. ఇలా ప్రవర్తించే వారికి అప్పు ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వారు అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు.