Phone pay: పది నిమిషాల్లో ఫోన్‌పే నుంచి డబ్బు అప్పుగా తీసుకోవచ్చు, ఎలాగో తెలుసుకోండి
ఫోన్‌పే (Phone pay) నుంచి యూపీఐ సేవలు మాత్రమే కాదు అప్పు కూడా ఇస్తోంది. డీఎస్‌పీ ఫైనాన్స్‌తో కలిసి లోన్లు అందిస్తోంది. దీని ద్వారా నెలవారీ EMI లేకుండా, కేవలం వడ్డీ మాత్రమే చెల్లించి మ్యూచువల్ ఫండ్స్ కోసం డబ్బును (Loan) అప్పుగా తీసుకోవచ్చు.

ఫోన్‌పే నుంచి లోన్
డిజిటల్ పేమెంట్స్ చేసే ఫోన్‌పేలో ఇప్పుడు లోన్ కూడా తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినవారికి 10 నిమిషాల్లో లోన్ ఇచ్చేందుకు ఫోన్ పే సిద్ధమైంది. పెట్టుబడులను విత్‌డ్రా చేయకుండా నేరుగా లోన్ పొందొచ్చు కాబట్టి ఇది ఎంతో మందికి సహాయపడే అవకాశం ఉంది.
నిమిషాల్లో లోన్
ఫోన్ పే ఈ సర్వీసును డీఎస్‌పీ ఫైనాన్స్ అనే NBFC సంస్థతో కలిసి ప్రారంభించింది. మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ (LAMF) పేరుతో ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తాకట్టు పెట్టి అప్పు పొందవచ్చు. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు లోన్ అందిస్తారు. ఇది చెల్లించేందుకు నెలవారీ EMI కట్టాల్సిన అవసరం లేదు. ఎంత మొత్తం లోన్ తీసుకుంటారో దానికి వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది.
ఎప్పుడైనా కట్టేయచ్చు
మీరు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఆ లోన్ లిమిట్‌ను వాడుకోవచ్చు. ఇలా పెట్టుబడులను అలాగే ఉంచుకుని లిక్విడిటీ పొందొచ్చు. లోన్ అప్లికేషన్ నుంచి డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే వరకు అంతా ఫోన్‌పే యాప్‌లోనే డిజిటల్‌గా పూర్తి చేయొచ్చు. కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు.
ఇలా లోన్ తీసుకోండి
ఫోన్‌పే యాప్ నుంచి లోన్ పొందేందుకు.. ముందుగా లోన్ విభాగంలోకి వెళ్లండి ‘మ్యూచువల్ ఫండ్‌పై లోన్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. పాన్, ఓటీపీ వివరాలు ఇచ్చి లోన్ ఆఫర్ పొందొచ్చు. కేవైసీ పూర్తి చేసి, ఆటో-పే సెట్ చేసి, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ప్లెడ్జ్ చేశాక, డిజిటల్ అగ్రిమెంట్‌పై సంతకం చేస్తే లోన్ వెంటనే బ్యాంక్ ఖాతాలో పడుతుంది.