భారత్ ను గురిచూసి దెబ్బకొట్టిన ట్రంప్ మామ... కేవలం వారంరోజుల్లో రూ.17 లక్షల కోట్లా!!
Stock Market Crash : భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ప్రభావం గట్టిగానే పడుతోంది. ఇలా ఈ ఒక్కరోజే భారత్ రూ.10 లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ పదిరోజుల్లో జరిగిన నష్టమెంతో తెలుసా?

Stock Market Crash
Stock Market Crash : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన 'అమెరికన్స్ ఫస్ట్' అంటే అమెరికా ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అనే పాలసీని అమలుచేస్తున్నారు. ఏ దేశం ఎటుపోయినా పర్వాలేదు అమెరికా బావుంటేచాలు అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు వుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు సంభవిస్తున్నాయి.
ట్రంప్ నిర్ణయాలు వివిధ దేశాల వ్యాపారవర్గాల్లోనూ ఆందోళనను రగిలించాయి. ఇలా భారతీయ స్టాక్ మార్కెట్స్ పై కూడా ట్రంప్ ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్ లో ట్రంప్ సృష్టించిన భయాల కారణంగా భారత స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. దేశంలోని ప్రముఖ కంపనీల షేర్లన్ని నష్టాలబాట పట్టడంతో కేవలం ఒక్కరోజులో దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
ఇలా ట్రంప్ దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్స్ విలవిల్లాడిపోతున్నాయి. కొద్దిరోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. కానీ ఈ స్థాయిలో పతనం అవుతాయని ఎవరూ ఊహించలేదు. ఏకంగా లక్షల కోట్లు ఆవిరయిపోయి స్టాక్ మార్కెట్ కుదేలయిపోయింది.
Stock Market Crash
స్టాక్ మార్కెట్స్ పతనం సాగుతోందిలా :
మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్స్ పీడకలను మిగిల్చింది. గతకొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్స్ నష్టాలను చవిచూస్తున్నా ఇవాళ మాత్రం కుప్పుకూలిపోయాయి. స్టాక్ మార్కెట్స్ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,018 పాయింట్లు నష్టపోయి 76,293 దగ్గర స్థిరపడింది. ఇక నిప్టీ 309 పాయింట్లు నష్టపోయి 23,071 కి చేరింది.
భారతదేశంలోని ప్రధాన కంపనీల షేర్లన్ని దాదాపు నష్టాల్లోకి వెళ్లాయి. టాటా మోటార్స్, కొటక్ మహింద్రా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, జొమాటో షేర్లు నష్టపోయాయి. ఇలా అనేక కంపనీల షేర్లు పతనం కావడంతో ఏకంగా రూ.10 లక్షల కోట్ల నష్టం జరిగి బిఎస్ఈలోని కంపనీల విలువ రూ.408 లక్షల కోట్లకు చేరింది.
ఈ ఏడాది జనవరి చివరో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ట్రంప్... దీంతో ఫిబ్రవరి నుండి భారతీయ స్టాక్ మార్కెట్స్ లో నష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ పదిరోజుల్లో సెన్సెక్స్ 3.25 శాతం క్షీణించింది... అంటే మొత్తంగా 2,553 పాయింట్లు కోల్పోయింది. కేవలం ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్, నిఫ్టీ 1.5 శాతం క్షీణించాయి. దీంతో ఈ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల నష్టం జరగగా గత పదిరోజులుగా మొత్తం 17.76 లక్షల కోట్లను స్టాక్ మార్కెట్స్ కోల్పోయాయి.
BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.1 శాతం క్షీణించగా BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5 శాతం పడిపోయింది. ఇలా స్టాక్ మార్కెట్స్ పతనం వ్యాపారవర్గాల్లో ఆందోళనను పెంచుతోంది. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడనుంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా మదుపర్ల సంపద ఆవిరయిపోయింది.
Stock Market Crash
స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు :
కేవలం భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ మార్కెట్ పై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాల ప్రభావం పడుతోంది. ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా భారతీయ స్టాక్ మార్కెట్స్ పై ట్రంప్ నిర్ణయాల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది.
తాజాగా స్టీల్, అల్యూమినియం పై అమెరికా అధ్యక్షుడు టారీఫ్స్ పెంచారు. వీటి దిగుమతులపైభారీ సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 10న అంటే నిన్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేసారు. దీంతో యూఎస్ కు దిగుమతి అయ్యే స్టీల్,అల్యూమినియంపై టారిఫ్స్ 10 శాతం నుండి ఏకంగా 25 శాతానికి చేరాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది...ఇది భారత స్టాక్ మార్కెట్స్ ను బాగా దెబ్బతీసింది.
ఇక రోజురోజుకు రూపాయి విలువ పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్స్ పతనానికి కారణం. సోమవారం అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ గరిష్టంగా 88 కి చేరింది. దీంతో మన స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టిన విదేశీ మదుపర్లు అమ్మకాలకు దిగారు. ఈ నెలలోనే విదేశీ పెట్టుబడిదారులు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుండి రూ.12,543 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇలా పెట్టుబడుల ఉపసంహరణతో స్టాక్ మార్కెట్ పతనం అయ్యింది.
ఇక దేశీయ ఈక్విటీ మర్కెట్ లో కూడా సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలు చేపడుతున్నారు. ఫిబ్రవరి 10న ఏకంగా రూ.2,463 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నారు. ఇవాళ కూడా ఈ షేర్ల విక్రయం కొనసాగింది. అందువల్లే స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది.
కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ మార్కెట్స్ అన్నింటి పరిస్థితి కూడా ఇలాగే వుంది. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ 0.3 శాతం, యూరో స్టాక్స్ 50 ఫ్యూచర్స్ క్షీణించాయి. అమెరికాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న పెట్టుబడిదారులకు భయం పట్టుకుంది.. అందువల్లే వారు పెట్టుబడులకు దూరంగా సేఫ్ గా వుండే ప్రయత్నం చేస్తున్నారు.దాని ఫలితమే స్టాక్ మార్కెట్స్ పతనం.