పెన్షన్ తీసుకొనే వాళ్లందరికీ ఇకపై ఒకటే స్కీమ్.. ప్లాన్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
Universal Pension Scheme: ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఒకే పెన్షన్ పథకాన్ని అమలు చేసే ఆలోచనను పరిశీలిస్తోంది. అసంఘటిత కార్మికులు, వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారు సహా ఎవరైనా ఇందులో చేరవచ్చు. దీన్ని యూనివర్సల్ పెన్షన్ పథకం అంటున్నారు. ప్రస్తుత పెన్షన్ పథకాలను సులభతరం చేయడానికి ఈ ప్రయత్నం సహాయపడుతుందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. మరి ఈ స్కీమ్ అమలు, సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకుందాం.

భవిష్యత్తులో దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య కోట్లలో పెరుగుతుంది. అంతేకాకుండా ఇతర పరిస్థితుల వల్ల ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ పై ఆధారపడేవారు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఎవరి పరిస్థితికి తగ్గట్టుగా వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఇంత డబ్బు చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఇందులో తేడాలు ఉండటం, పెన్షన్ అభ్యర్థులను గుర్తించడంలో లోపాలు ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
కార్మిక మంత్రిత్వ శాఖ ఈ పెన్షన్ పథకం అమలు తీరుపై నిపుణులతో చర్చలు చేస్తోంది. ఈ స్కీమ్ ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఉపయోగపడేలాగే ఉంటుందని సమాచారం. ఈ పథకం నిర్మాణం పూర్తయిన తర్వాత మెరుగుపరచడానికి ప్రజలు, నిపుణుల నుండి అభిప్రాయాలు కోరే అవకాశాలు ఉన్నాయి.
ఈ పెన్షన్ పథకాలన్నీ కలిసిపోతాయి
ప్రధాన మంత్రి-శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన (PM-SYM), వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం జాతీయ పెన్షన్ పథకం (NPS-Traders) వంటి ప్రస్తుత పెన్షన్ పథకాలను ఒకే వ్యవస్థ కింద క్రమబద్ధీకరించడం వాటిని సులభంగా అందుబాటులో ఉంచడం యూనివర్సల్ పథకం లక్ష్యం.
ఈ రెండు పథకాల్లో చేరిన వారికి 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్‌ను ఇస్తారు. వీటిలో కార్మికుల కాంట్రిబ్యూషన్ రూ.55 నుండి రూ.200 వరకు ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి పెన్షన్ అందిస్తుంది.
ఇలాంటి పథకాలతో పాటు అటల్ పెన్షన్ యోజన వంటి స్కీమ్స్ కూడా కలిపి యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
కొత్త పెన్షన్ పథకం ఎందుకు?
2036 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల సంఖ్య 22 కోట్లకు మించిపోతుందని అంచనా. అందుకే యూనివర్సల్ పెన్షన్ పథకం తీసుకొచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తోంది.
అమెరికా, ఐరోపా, కెనడా, రష్యా, చైనా వంటి అనేక దేశాలు పెన్షన్, ఆరోగ్యం, నిరుద్యోగం వంటి సామాజిక అంశాలపై ప్రత్యేక వ్యవస్థలనే నిర్వహిస్తున్నాయి.
ఈ స్కీమ్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ఆమోదం, అమలుపై ఇంకా సమాచారం లేదు.