Most powerful సైన్యం కలిగిన top 10 దేశాలు
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. రష్యా లాంటి పెద్ద దేశంతో అతి చిన్న దేశమైన ఉక్రెయిన్ ఢీకొట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిన్న దేశం వద్ద అంత బలమైన సైన్యం ఉందా.. సరిపడా ఆయుధాలు, యుద్ధ ట్యాంకులు ఉన్నాయా అంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ క్రమంలో గ్లోబల్ ఫైర్ పవర్ అనే ఆర్గనైజేషన్ 145 దేశాల మిలిటరీ కెపాసిటీని పరిశీలించి సైనిక శక్తి సూచికలను విడుదల చేసింది. వాటిలో టాప్ 10గా నిలిచిన దేశాల వివరాలు తెలుసుకుందాం..
10. ఇటలీ
సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1863 పాయింట్లతో పదవ స్థానంలో నిలిచింది. ఆధునిక సాంకేతిక, రక్షణ వ్యూహాలను అనుసరిస్తోంది. సమర్థవంతమైన 2,89,000 మంది సైనికులను కలిగి ఉంది. సైన్యం కోసం ఆ దేశం ఏటా 31.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది.
9. పాకిస్థాన్
17,04,000 మంది సైనిక బలం ఉన్న పాకిస్థాన్.. టెర్రరిజాన్ని మాత్రం పెంచిపోషిస్తోంది. ఆ దుష్ట శక్తుల వల్ల ఆ దేశంలోనే బాంబు దాడులు జరిగిన దాఖలాలు అనేకం. సైన్యం బలోపేతానికి ఏటా 6.3 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1711 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
8.టర్కీ
ఈ దేశం తమ సైన్యం కోసం ఏటా 40 బిలియన్ డాలర్లు ఖర్చుపెడుతోంది. 8,83,900 మంది సైన్యం ఉండి సేవలందిస్తున్నారు. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1697 పాయింట్లతో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఆధునిక సాంకేతిక, సామర్థ్యాలను మెరుగుపరచుకొంటూ ప్రత్యర్థి దేశాలతో పోటీ పడుతోంది.
7. జపాన్
సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1601 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. జపాన్ సాంకేతిక పురోగతితో దూసుకుపోతోంది. స్వీయ రక్షణ దళాలు ఈ దేశానికి ప్రత్యేక బలం. మొత్తం 3,28,150 మంది సైనికులున్నారు. ఏటా 53 బిలియన్ డాలర్లు సైన్యం బలోపేతానికి ఆ దేశం ఖర్చు చేస్తోంది.
6.యూకే
యునైటెడ్ కింగ్ డమ్ మిలటరీ కూడా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రత్యర్థి దేశాలకు పోటీనిస్తోంది. 62.8 బిలియన్ డాలర్లు ఏటా ఖర్చు పెడుతూ సైనిక బలాన్ని బలోపేతం చేసుకుంటోంది. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1413 పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. ప్రస్తుతం 11,08,860 మంది సైనికులుగా ఉన్నారు.
5. దక్షిణ కొరియా
ఈ దేశం అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ ప్రత్యేక రక్షణ వ్యూహాలతో సుసంపన్నమైన మిలటరీని కలిగి ఉంది. ఏటా 44.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ సైన్యం బలోపేతమవుతోంది. 38,20,000 సైనిక బలం ఉంది. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.1416 పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది.
4.భారత దేశం
ఇండియా అతిపెద్ద, అత్యంత సామర్థ్యం ఉన్న మిలటరీల్లో ఒకటి. ఆధునిక, వ్యూహాత్మక ఆలోచనలతో ప్రత్యర్థి దేశాలకు గట్టి సంకేతాలు ఇస్తోంది. సైనిక శక్తి సూచికలో భారతదేశం 0.1023 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఏటా 74.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ సైనిక సంపత్తిని పెంచుకుంటోంది. ప్రస్తుతం సైన్యంలో 51,37,550 మంది ఉన్నారు.
3.చైనా
ప్రపంచంలోనే అధిక విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న చైనా తన మిలిటరీని వేగంగా బలోపేతం చేసుకుంటోంది. అన్ని దేశాలపై ఆధిపత్యం సంపాదించాలన్న కాంక్షతో అడుగులు వేస్తోంది. ఏటా 227 బిలియన్ డాలర్లు వెచ్చిస్తూ ప్రస్తుతం 31,70,000 మంది సైనికులను కలిగి ఉంది. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.0706 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
2.రష్యా
రష్యా గణనీయమైన అణు ఆయుధ సంపత్తిని కలిగి ఉంది. అంతేకాకుండా అధునాతన క్షిపణులను వినియోగిస్తూ బలమైన సైనిక సంపదను పెంచుకుంటోంది. ఏటా 109.0 బిలియన్ డాలర్లను సైన్యం బలోపేతానికి ఉపయోగిస్తోంది. సైనిక శక్తి సూచికలో ఈ దేశం 0.0702 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం 35,70,000 మంది సైనికులు ఉన్నారు.
1.అమెరికా
యునైటెడ్ స్టేట్స్ సైనిక శక్తి సూచికలో 0.0699 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. సాటిలేని సైనిక సాంకేతికత, అతిపెద్ద రక్షణ బడ్జెట్ తో అగ్రస్థానంలో ఉంది. ఏటా 831 బిలియన్ డాలర్లు సైన్యం కోసం వెచ్చిస్తోంది. 21,27,500 మంది ఆ దేశ సైన్యంలో సేవలందిస్తున్నారు.