Gold: బంగారం ధర భారీగా పతనం ఏకంగా రూ. 3500 తగ్గింది..ప్రస్తుత ధరలో బంగారం కొనొచ్చా..లేక ఇంకా తగ్గుతుందా..?
బంగారం ధర ఏకంగా 3500 తగ్గింది ఇది కూడా కేవలం నెల రోజుల గ్యాప్ లోనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో బంగారం ఇక్కడి నుంచి ఇంకెంత తగ్గుతుంది అనే సందేహం. పసిడి ప్రియుల్లో కలుగుతోంది అసలు ఈ రేంజ్ లో బంగారం ప్రస్తుతం కొనవచ్చా లేదా అనే విషయం తెలుసుకోండి.
బంగారం ధరలు గడచిన వారం రోజుల్లో భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా గమనించినట్లయితే, బంగారం ధర జూన్ నెలలో భారీగా తగ్గింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడం కూడా ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 59, 170 రూపాయల వద్ద పలుకుతోంది. గత నెల మే 24వ తేదీన బంగారం ధర చివరిసారిగా రూ. 62,720 గరిష్ట స్థాయిని తాకింది. అక్కడ నుంచి పోల్చి చూసినట్లయితే బంగారం ధర ఏకంగా రూ. 3500 తగ్గింది. అంటే గడచిన నెల రోజుల కాలంలో బంగారం ధర దాదాపు 5% తగ్గినట్లు మనకు కనిపిస్తోంది.
ఇక అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధర ఒక ఔన్సు (31 గ్రాములు) మే నెలలో అమెరికాలో 2030 డాలర్లు పలికింది. అదే ప్రస్తుతం బంగారం ధర 1930 డాలర్లు మాత్రమే పలుకుతోంది. దీన్నిబట్టి బంగారం ధర దాదాపు 100 డాలర్లు తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న విధానాలే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ప్రధానంగా అమెరికాలోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లు 500 బిపిఎస్ పాయింట్లను ఇప్పటివరకు గడచిన 15 నెలల్లో పెంచింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డాలర్ ధర కూడా పుంజుకుంది. డాలర్ ప్రస్తుతం భారతీయ రూపాయితో పోల్చి చూసినట్లయితే 82 రూపాయల దాటిపోయింది. దీంతో అమెరికన్ బాండ్ మార్కెట్ కూడా పుంజుకుంది. ఫలితంగా మదుపుదారులు తమ పెట్టుబడులను బంగారం మీద నుంచి అమెరికా బాండ్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు.
ఫలితంగా బంగారం ధరలు అంతర్జాతీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ ప్రభావం దేశంపై కూడా కనిపిస్తోంది. తాజాగా ఆగ్మెమెంట్ గోల్డ్ డైరెక్టర్ సచిన్ కొఠారి మాట్లాడుతూ బంగారం ధరలు మరో మూడు నుంచి నాలుగు శాతం వరకు దిగివచ్చే అవకాశం ఉందని అతి తక్కువ సమయంలోనే ఈ మార్పు మనం చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే విఘ్నహర్త గోల్డ్ లిమిటెడ్ చైర్మన్ మహేంద్ర యునియా మాట్లాడుతూ బంగారం ధర గడచిన నెల రోజులుగా భారీగా పతనమైందని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్న దేశాల పరిస్థితిని చూస్తున్నట్లయితే, బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ముఖ్యంగా మదుపుదారులు ఇంతకాలం బంగారంపై ఇన్వెస్ట్ చేసి ప్రస్తుతం ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారని అందుకే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొంటున్నారు.
మరి ఈ తగ్గుతున్న మార్కెట్లో బంగారం కొనచ్చా అనే సందేహం మీకు రావచ్చు. అయితే బంగారం ధర తగ్గే కొద్దీ మీరు కొంత మొత్తంలో ఫిజికల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చని తద్వారా రాబోయే వివాహ సీజన్లో ఫెస్టివల్ సీజన్లో మీరు లాభం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం అతి త్వరలోనే 58 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్ ధర వద్ద ఫిజికల్ బంగారం కొనుగోలు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ఎంత తగ్గితే అంత యాడ్ చేసుకోవడం ద్వారా లాభదాయకంగా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు.