ప్రజలంతా ఆనందంగా జీవించే దేశం ఏదో తెలుసా?
మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ దేశంలో ప్రజలు అత్యంత ఆనందంగా జీవిస్తారో? అది ఒక చిన్న దేశం. జనాభా కేవలం 6 మిలియన్లు. అందరూ ఐకమత్యంగా చక్కటి విధానాలు పాటించడం ద్వారా ఆనందంగా జీవిస్తున్నారట. మరి ఆ దేశ విశేషాలు తెలుసుకుని మనం కూడా పాటిద్దామా?
ఆనందంగా జీవించడమే మనిషి జీవితానికి పరమార్థం. అంటే కష్టాలు, బాధలపై ఫోకస్ పెట్టకుండా మనం అనుకున్న పని చేసుకుంటూ వెళ్లిపోతే రిజల్ట్స్ ఆటోమెటిక్ గా అవే వస్తాయి. సక్సెస్ కి విపరీతంగా ఆనంద పడిపోకూడదు. ఫెల్యూర్ కి దారుణగా బాధపడిపోకూడదు. ఏదైనా లైట్ గా తీసుకుంటూ ముందుకెళ్లిపోవడమే. గొప్ప గొప్ప ఫిలాసఫర్లు చెప్పే మాట ఇదే. వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా.. కాని ఆచరించడం అంత ఈజీ కాదు. అందుకే అందరూ రకరకాలుగా కష్టపడుతూ బాధల్లోనే జీవిస్తుంటారు.
కాని ఈ ప్రపంచంలో ఓ దేశంలో ప్రజలు మాత్రం ఇలాంటి జీవన సూత్రాలను పాటిస్తూ ఎప్పుడూ ఆనందగానే జీవిస్తుంటారు. ఇదేదో మాట వరసకి చెబుతున్న మాట కాదు.
ఏడు సంవత్సరాలుగా వరుసగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఆ దేశం నిలిచింది. ఆ దేశం పేరు ఫిన్లాండ్. ఆ దేశ ప్రజల సంతోష రహస్యాలను తెలుసుకుందాం రండి.
1. ఫిన్లాండ్‌లో ప్రజలు కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. సెలవులను కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తారు. వారికున్న సౌకర్యాలనే ఉపయోగించుకుంటూ విహార యాత్రలు చేస్తారు. ఫిన్లాండ్ దేశస్థుల సింపుల్ లివింగ్(సరళమైన జీవనశైలి) వారి సంతోషానికి ముఖ్య కారణం. ఈ విధానం ఇప్పుడు ప్రపంచానికే స్ఫూర్తినిస్తోంది. అందుకే వరుసగా ఏడు సంవత్సరాలుగా ఆనందకరమైన దేశంలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది.
2. ఫిన్లాండ్‌లో పురుషులు, స్త్రీలకు సమాన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందువల్ల కుటుంబ అవసరాలకు సరిపడా సంపాదించుకుంటారు. ఇద్దరూ కష్టపడతారు కాబట్టి ఇంటి పనిని కూడా ఇద్దరూ షేర్ చేసుకుంటారు. వంట పని, తోట పని, డ్రైవింగ్, ఖర్చులు ఇలా ప్రతి విషయంలో షేరింగ్ ఉంటుంది.
3. ఫిన్లాండ్ ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను కలిగి ఉంది. కిండర్ గార్టెన్ నుండి విశ్వవిద్యాలయం వరకు ఉచితంగా చదువుకోవచ్చు. ఎవరికి నచ్చిన కోర్సులు, నచ్చిన స్కూల్స్, కాలేజీలు ఇలా ప్రతి చోట వారు చాయిస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారికి వైద్యం కూడా ఫ్రీ. ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేయిస్తుంది. ఇక వారికి బాధలేముంటాయి. అందుకే అవసరాలకు సరిపడా డబ్బులు సంపాదిస్తూ, ఖర్చు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తారు.
4. ప్రపంచవ్యాప్తంగా పని ఒత్తిడి, వర్క్ అవర్స్ పెరుగుతుంటే ఫిన్లాండ్ లో మాత్రం ఆ దేశ పౌరులు ఒత్తిడి లేకుండా జీవించేలా చట్టాలు ఉన్నాయి. అందువల్ల వారికి పని ఒత్తిడి ఉండదు. వర్కింగ్ అవర్స్ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.
5. ఫిన్లాండ్ రాజకీయాలు చాలా నిజాయతీగా ఉంటాయి. వెన్నుపోటు వ్యవహారాలు, హత్యా రాజకీయాలు, బెదిరింపులు, అధికారపు అహంకారాలు ఇలాంటివేవీ అక్కడ ఉండవు. చెప్పాలంటే అక్కడ రాజకీయ నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల సేవకులమని భావించి, వారికి జవాబుదారీగా పనిచేస్తారు. అవినీతికి ఆస్కారం ఇవ్వరు. అందువల్లనే ఫిన్లాండ్ ప్రజలు ఏ విషయాలకు బాధ పడకుండా సంతోషంగా జీవిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.