ఆ ఒక్క నెల బిఎస్ఎన్ఎల్ పరిస్థితినే మార్చేసింది ... ఎన్ని లక్షలమంది కస్టమర్లు పెరిగారో తెలుసా?
ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ (Bharat Sanchar Nigam Limited) స్టోరీ కేవలం ఒక్క నెలలోనే పూర్తిగా మారిపోయింది. ఇదే సమయంలో జియో, ఎయిర్ టెల్ కథ అడ్డం తిరిగింది.
BSNL
BSNL : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీ పడలేక కాలక్రమేణా ఢీలా పడిపోయింది. ఇక రిలయన్స్ జియో ఎంట్రీతో బిఎస్ఎన్ఎల్ ఇక కోలకోవడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ బిఎస్ఎన్ఎల్ ఓటమిని అంగీకరించలేదు... తన సమయం కోసం ఎదురుచూసింది. ఇప్పుడు ఆ సమయం రావడంతో విజృంభిస్తోంది.
BSNL
కేవలం ఒకే ఒక్క నెలలో... బిఎస్ఎన్ఎల్ సీన్ రివర్స్ :
ప్రైవేట్ టెలికాం సంస్థల దెబ్బకు ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఎక్కడ నిలుస్తుంది... ఇక దీని పని అయిపోయినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ గోడకు కొట్టిన బంతిలా ఎంత వేగంగా అయితే కిందపడింతో అంతే వేగంగా పైకి లేస్తోంది ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ. తాజాగా ఈ బిఎస్ఎన్ఎల్ దూకుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇటీవల ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలు భారీగా పెంచడంతో కస్టమర్లకు తత్వం బోధపడినట్లుంది... ఎప్పటికయినా ఈ సంస్థలతో తమకు ఆర్థిక భారమేనని భావించారో ఏమో బిఎస్ఎన్ఎల్ లోకి మారుతున్నారు. ఇలా రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) లకు షాక్ ఇస్తూ లక్షలాదిమంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ లోకి పోర్ట్ అవతున్నారు.
ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ... కేవలం ఒక్క జూలై నెలలోనే బిఎస్ఎన్ఎల్ 29 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఇదే సమయంలో ప్రైవేట్ టెలికాం సంస్థల కస్టమర్లు అమాంతం తగ్గిపోయారు. ట్రాయ్ లెక్కలు బిఎస్ఎన్ఎల్ లో నూతన ఉత్తేజాన్ని నింపుతుండగా జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ సంస్థలను కంగారు పెడుతున్నాయి.
Jio and Airtel
జియో, ఎయిర్ టెల్ పరిస్థితేంటి ?
ట్రాయ్ సమాచారం మేరకు ... ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు రీచార్జ్ ప్లాన్స్ ఛార్జీల పెంపు తర్వాత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ గత జూలై నెలలో ఏకంగా 7,58,000 కు పైగా కస్టమర్లను కోలపోయింది. ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా అయితే ఏకంగా ఏకంగా 14 లక్షలమంది కస్టమర్లను దూరం చేసుకుంది.
రీచార్జ్ ప్లాన్ ధరల పెంపు నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎయిర్ టెల్. ఈ సంస్థ ఒక్క జూలై నెలలోనే ఏకంగా 17 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇలా గత కొన్ని నెలలుగా ప్రైవేట్ టెలికాం సంస్థలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
దేశంలో సెల్ ఫోన్ వినియోగదారులు తగ్గుతున్నారా!
మొత్తంగా చూసుకుంటే జూలై 2024 వరకు రిలయన్స్ జియో అత్యధికంగా 475.7 మిలియన్స్ కస్టమర్లను కలిగివుంది. ఇదే సమయంలో ఎయిర్ టెల్ 387.3, వోడాఫోన్ ఐడియా 215.8 కోట్ల కస్టమర్లను కలిగివుంది. ఇక బిఎస్ఎన్ఎల్ మాత్రం తన కస్టమర్ల సంఖ్యను భారీగా పెంచుకుని 88.5 మిలియన్స్ వద్ద నిలిచింది.
ఆసక్తికర విషయంఏమిటంటే ట్రాయ్ ప్రకారం జూలై నెలలో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య తగ్గింది. జూన్ 2024 లో 117 కోట్లుగా వున్న ఫోన్ వినియోగదారులు జూలై 2024 నాటికి 116 కోట్లకు తగ్గారు. అంటే కేవలం ఒక్క నెలలోనే కోటి మంది ఫోన్ ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.
BSNL
బిఎస్ఎన్ఎల్ దూకుడు :
ప్రస్తుతం కస్టమర్ల నుండి వస్తున్న మద్దతును ఇలాగే నిలుపుకునేందుకు బిఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సర్వీస్ క్వాలిటీని పెంచడమే కాదు కస్టమర్లకు అనుకూలంగా వుండేలా ప్లాన్స్ ను రూపొందిస్తోంది. ఇలా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో 4జి సర్వీసులను ప్రారంభించింది. దీన్ని వచ్చే ఏడాది మిడిల్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నిస్తోంది. అలాగే 5G ని కూడా పరిశీలిస్తోంది.
ఇక ప్రైవేట్ టెలికాం సంస్ధలు రీచార్జ్ ప్లాన్స్ ధరలు పెంచినా బిఎస్ఎన్ఎల్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రీచార్జ్ ధరలు పెంచకపోగా కస్టమర్లను ఆకర్షించేలా రీచార్జ్ ప్లాన్స్ తో ముందుకు వచ్చింది. దీంతో ప్రజల చూపును బిఎస్ఎన్ఎల్ తనవైపు తిప్పకుంది. ఈ దూకుడు ఇలాగే ప్రదర్శిస్తే ఈ ప్రభుత్వరంగ సంస్థ పూర్వవైభవాన్ని పొందుతుందని టెలికాం మార్కెట్ లో టాక్ నడుస్తోంది.