- Home
- Business
- TCS Layoffs: ఉద్యోగులకు టీసీఎస్ షాక్.. స్కిల్ గ్యాప్, ఏఐ క్రమంలో 12,000 ఉద్యోగాలు ఊస్టింగ్ !
TCS Layoffs: ఉద్యోగులకు టీసీఎస్ షాక్.. స్కిల్ గ్యాప్, ఏఐ క్రమంలో 12,000 ఉద్యోగాలు ఊస్టింగ్ !
TCS Layoffs: టీసీఎస్ 2026లో 2% ఉద్యోగులను తొలగించనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు 12,000 మందిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా మిడ్-సీనియర్ స్థాయిలో తొలగింపులు ఉండనున్నాయి. దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమైన టీసీఎస్
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్-TCS) తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తాజా త్రైమాసికానికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000 గా ఉంది. దీని ప్రకారం సుమారు 12,200 మందికి పైగా ఉద్యోగులపై ప్రభావం ఉండనుంది. టీసీఎస్ ఈ తొలగింపులను 2026 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు) అమలు చేయనుంది.
KNOW
టీసీఎస్ సీఈవో కృతివాసన్ కామెంట్స్ వైరల్
టీసీఎస్ సీఈవో కే కృతివాసన్ మనీ కంట్రోల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "ఇది సీఈవోగా నేను తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటి. కొత్త టెక్నాలజీలు, ముఖ్యంగా ఏఐ, కొత్త ఆపరేటింగ్ మోడళ్ల వలన సంస్థల పని విధానాలు మారుతున్నాయి. భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాల కోసం మేము విశ్లేషణలు చేస్తున్నాం. కొన్ని రోల్స్‌కి తిరిగి పంపిణీ చేయడంతో ఫలితం లేదు" అని తెలిపారు. అలాగే, పని చేసే విధానాలు మారుతున్నాయనీ, మనం భవిష్యత్తుకు సిద్ధంగా, చురుగ్గా ఉండాలన్నారు.
ఈ తొలగింపులు సంస్థలోని మధ్యస్థ, సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలలోనే ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ నిర్ణయం ఏఐ ప్రభావం వల్ల కాదు, పునఃపంపిణీ సాధ్యాసాధ్యతలపై ఆధారపడిందని స్పష్టం చేశారు.
#MCInterview | 🚨TCS CEO K Krithivasan spoke exclusively to Moneycontrol on its decision to let go of 2 percent of its workforce.
Who will be impacted and what's the rationale?
Highlights ⏬#TCS#CEO#Business#IT#Company
Also read the full interview here ⤵️ by… pic.twitter.com/HK6OGINzrU— Moneycontrol (@moneycontrolcom) July 27, 2025
టీసీఎస్ బెంచ్ పాలసీలో మార్పులతో కొత్త నిబంధనలు
టీసీఎస్ తన బెంచ్ పాలసీని మార్చి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఉద్యోగులు సంవత్సరానికి 225 బిల్లబుల్ డేస్ కలిగి ఉండాలి. ఒక ఉద్యోగి సంవత్సరంలో 35 రోజులకంటే ఎక్కువ బెంచ్‌లో ఉండకూడదు. ఈ నిబంధనల ఉల్లంఘనతో డిసిప్లినరీ చర్యలు తీసుకుంటారు. అంటే ఉద్యోగి ఏదో ఒక ప్రాజెక్టులో ఉండి తీరాలి. ఖాళీగా ఎక్కువ సమయంలో ఉండరాదని స్పష్టం చేసింది.
"రెండు నెలలకంటే ఎక్కువ బెంచ్‌లో ఉన్న ఉద్యోగులకు హెచ్ ఆర్ ను కేటాయించి వెంటనే రాజీనామా కోరుతున్నారు. అంగీకరిస్తే మూడు నెలల జీతం సవరెన్స్ అందుతుంది. లేదంటే ఉద్యోగం నుండి తొలగించి సవరెన్స్ ఇవ్వడం లేదని" ఒక ఉద్యోగి తెలిపినట్టు మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది .
క్లయింట్ ప్రాజెక్టులు ఆలస్యం, ఆర్ధిక ప్రభావంతో టీసీఎస్ చర్యలు
2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టీసీఎస్ ఆపరేటింగ్ మార్జిన్లు 24.5%కి తగ్గాయి. దీనిపై సీఈవో కృతివాసన్ మాట్లాడుతూ.. "కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి కానీ రద్దు కాలేదు. క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని" అన్నారు. అయితే, సీఎఫ్ఓ సమీర్ సెక్సారియా.. సంస్థ ప్రస్తుతం కొత్త లాటరల్ హైరింగ్‌ను తగ్గించి, జీతాల పెంపుపై దృష్టి పెడుతోందని తెలిపారు.
ఏఐ తో మారుతున్న పరిశ్రమ మోడల్
ఏఐ రాకతో టెక్నాలజీ మార్పులు సంప్రదాయ ఐటీ మోడల్‌ను ప్రభావితం చేస్తున్నాయి. విశ్లేషకుల ప్రకారం, క్లయింట్లు 20–30% ధర తగ్గింపులు కోరుతున్నారు. ఇది ఉద్యోగాలపై ఒత్తిడిని పెంచుతుంది.
2025లో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80,000 మందికి పైగా టెక్ ఉద్యోగుల తొలగింపునకు గురయ్యారని layoffs.fyi నివేదించింది. టీసీఎస్ నిర్ణయం ఇతర పెద్ద ఐటీ సంస్థలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.