హల్దీరామ్ కంపెనీలో 51 శాతం వాటాపై కన్నేసిన టాటా గ్రూప్...డీల్ విలువ తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం..
ప్రముఖ భారతీయ స్నాక్ ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్‌లో కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కృషిచేస్తోంది. టాటా గ్రూప్ కు చెందిన ఈ సంస్థ హల్దీరామ్‌లో కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోందని, ఈ డీల్ విలువ దాదాపు 83 వేల కోట్లు రూపాయలు ఉండే వీలుంది.
దేశంలోని ప్రముఖ చిరుతిళ్ల తయారీ సంస్థ హల్దీరామ్‌లో టాటా గ్రూప్ కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేయాలని టాటా గ్రూపు ప్లాన్ చేస్తోంది. బిజినెస్ స్టాండర్డ్ పత్రిక అందించిన సమాచారం ప్రకారం, టాటా గ్రూప్ దాని యూనిట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈ ఒప్పందాన్ని చర్చలు జరుపుతోంది. అయితే ప్రస్తుతం హల్దీరామ్ వాల్యుయేషన్ విసయంలో తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. హల్దీరామ్ తన ఈక్విటీని 10 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు రూ. 83,000 కోట్ల విలువ కట్టింది. టాటా గ్రూప్ ఈ వాల్యుయేషన్ ను చాలా ఎక్కువగా భావిస్తోంది.
టాటా గ్రూప్, హల్దీరామ్ మధ్య ఈ ఒప్పందం విజయవంతమైతే, టాటా గ్రూప్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రిలయన్స్ రిటైల్ , పెప్సీలతో ప్రత్యక్ష పోటీని ఇవ్వనుంది. హల్దీరామ్ భారతదేశపు దేశీయ బ్రాండ్, దీని పరిధి దేశంలోని ప్రతి ఇంట్లో ఉంది. హల్దీరామ్ తన ఈక్విటీలో 10 శాతం విక్రయించడానికి బెయిన్ క్యాపిటల్‌తో సహా కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది.
ఇదిలా ఉంటే బ్రిటిష్ కంపెనీ టెట్లీ కూడా టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ యాజమాన్యంలో ఉంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు భారతదేశంలో స్టార్‌బక్స్‌తో భాగస్వామ్యం కూడా ఉంది. టాటా గ్రూప్ హల్దీరామ్‌లో 51 శాతం కంటే ఎక్కువ వాటాలను కొనుగోలు చేయాలని చూస్తోంది. అయితే స్నాక్ కంపెనీ కోరుతున్న వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
హల్దీరామ్‌ను కొనుగోలు చేయడం టాటా గ్రూప్‌కు తన వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లడానికి ఒక అవకాశం అని వర్గాలు చెబుతున్నాయి. టాటా ప్రస్తుతం ప్రధానంగా టీ కంపెనీ ఇమేజ్‌ను కలిగి ఉంది. అయితే హల్దీరామ్ వినియోగదారు ఉత్పత్తులు, ముఖ్యంగా స్నాక్ ఫుడ్ మార్కెట్‌లో గణనీయమైన మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఏజెన్సీ ప్రకారం, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధిని దీని గురించి అడిగినప్పుడు, మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించలేనని తెలిపారు.
హల్దీరామ్ 1937లో చిన్న దుకాణంతో ప్రారంభమైంది. కంపెనీ ప్రాడక్టు "భుజియా"కి మంచి పేరుంది. చిన్న ప్యాకెట్లు రూ. 5, రూ. 10 ద్వారా ఈ కంపెనీ మార్కెట్లో విస్తరిస్తోంది. భారతదేశంలోని బల్క్ స్నాక్ మార్కెట్‌లో హల్దీరామ్‌కు దాదాపు 13 శాతం వాటా ఉంది. భారతదేశంలోనే కాకుండా, సింగపూర్ , అమెరికాలో కూడా హల్దీరామ్ స్నాక్స్ విక్రయిస్తారు. ఇది కాకుండా, హల్దీరామ్ దేశవ్యాప్తంగా దాదాపు 150 రెస్టారెంట్లను కలిగి ఉంది.