ఈ బ్యాంకు బంగారం విలువలో 90 శాతం గోల్డ్ లోన్ ఇస్తోంది
SIB Gold Xpress : గోల్డ్ విలువలో బ్యాంకులు సాధారణంగా 75 శాతం లోన్ ఇస్తుంటాయి. కానీ, 'SIB Gold Xpress' స్కీమ్‌లో బంగారం విలువపై 90% వరకు గోల్డ్ లోన్ పొందవచ్చు. ఆ వివరాలు మీకోసం.
బంగారం విలువపై 90% గోల్డ్ లోన్
బ్యాంకులు సాధారణంగా 50 నుంచి 75 శాతం వరకు బంగారం పై రుణాలు అందిస్తుంటాయి. అయితే, తాజాగా ఒక బ్యాంకు బంగారం విలువపై 90 శాతం రుణం అందిస్తోంది. అదే సౌత్ ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంకు వినియోగదారుల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్ ను తీసుకొచ్చింది.
SIB Gold Xpress పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్‌లో కస్టమర్లు తమ బంగారం విలువలో 90% వరకు లోన్ పొందవచ్చు. ఇప్పటివరకు బ్యాంకులు గరిష్టంగా 75% వరకు మాత్రమే లోన్ ఇస్తుండగా, ఈ కొత్త స్కీమ్ తో సౌత్ ఇండియన్ బ్యాంకు రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు గోల్డ్ లోన్ అందిస్తోంది. గరిష్టంగా మూడు సంవత్సరాల గడువు ఉంటుంది.
KNOW
చిరు వ్యాపారులు, వ్యక్తిగత అవసరాలున్న వారికి ప్రయోజనాలు
SIB Gold Xpress స్కీమ్ ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, చిరు వ్యాపారాలు, వ్యక్తిగత అవసరాలు ఉన్న వారికి ఉపయోగపడేలా రూపొందించారు. వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు లేదా వ్యక్తిగత ఖర్చులకు ఈ లోన్ ఉపయోగించుకోవచ్చు.
సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటన ప్రకారం, ఈ లోన్‌లో ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు. పూర్తి పారదర్శకతతో కస్టమర్లకు సదుపాయం కల్పిస్తామని బ్యాంక్ తెలిపింది. అన్ని బ్యాంకులు అందిస్తున్నట్టుగానే వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటుంది.
SIB Gold Xpress గోల్డ్ లోన్ ఎలా తీసుకోవాలి?
SIB Gold Xpress లోన్ తీసుకోవడం చాలా సులభం. ఇది పూర్తిగా డిజిటల్‌గా కూడా పూర్తి చేయవచ్చు. కొత్త కస్టమర్లకు కూడా ఈ లోన్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమ బంగారు ఆభరణాలను దేశవ్యాప్తంగా ఉన్న సౌత్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లలో భద్రంగా తాకట్టు పెట్టవచ్చు.
బంగారు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు
కొన్ని నెలల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్లపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తమ బంగారంపై కొనుగోలు రసీదు చూపించలేని సందర్భాల్లో, కస్టమర్లు స్వీయ ప్రమాణ పత్రం ఇవ్వడం సరిపోతుందని స్పష్టం చేసింది. దీంతో కస్టమర్లకు లోన్ పొందడం మరింత సులభమైంది.
గోల్డ్ లోన్ వివరాలు
గోల్డ్ లోన్ అనేది సెక్యూర్డ్ లోన్, అంటే కస్టమర్లు తమ బంగారం తాకట్టు పెట్టి డబ్బు రుణంగా తీసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్న వారు, భారత పౌరులు ఈ లోన్‌కు అర్హులు. దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా రుజువు, ఫోటో.
గోల్డ్ లోన్ ఆమోద ప్రక్రియ వేగంగా జరుగుతుంది. కస్టమర్లు బంగారం బ్యాంక్ బ్రాంచ్‌కు తీసుకువెళ్ళిన వెంటనే దాని విలువ అంచనా వేసి లోన్ మొత్తాన్ని ఇస్తారు. ఆపై డబ్బు నేరుగా ఖాతాలో లేదా నగదు రూపంలో అందజేస్తారు.
కస్టమర్ల బంగారం భద్రతకు బ్యాంకు పూర్తి హామీ ఇస్తోంది. ఆభరణాలను సీల్ చేసి సురక్షితమైన వాల్ట్‌లో ఉంచుతారు. ప్రతి కస్టమర్‌కి రసీదు కూడా ఇస్తారు.