సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? మీరు తప్పక తెలుసుకోవాల్సిన 6 విషయాలు
Second Hand Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు ధర, లోన్, వారంటీ, పేపర్‌వర్క్ వంటి 6 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఆ పూర్తి వివరాలు మీకోసం.

సెకండ్ హ్యాండ్ కార్ల కోసం చూస్తున్నారా? మీరు ఇవి తెలుసుకోవాల్సిందే
భారతదేశంలో కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లను కంపెనీలు వరుసగా లాంచ్ చేస్తూనే ఉన్నా, బడ్జెట్ క్రమంలో చాలా మంది ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
తక్కువ ధరలో మంచి క్వాలిటీ కారు దొరకడం, ఎక్కువ వేరియంట్లు దొరకడం, ఎక్కువగా ఆర్థిక భారంలేకపోవడం వంటివి దీనికి కారణాలుగా ఉన్నాయి. దీంతో భారతదేశంలో యూజ్డ్ కార్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనడం ఒక మంచి నిర్ణయమయ్యే అవకాశముంది, కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే అది మీకు తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి డీల్ ఫైనల్ చేయడానికి ముందు ఈ ఆరు ముఖ్యమైన విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వాటిలో..
1. కారు ధర, మార్కెట్ లోకి వచ్చిన టైమ్
కొత్త కారు షోరూమ్ నుండి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ తగ్గుతుంది. మొదటి సంవత్సరంలోనే దాదాపు 20 శాతం వరకు ధర పడిపోతుంది. కాబట్టి ఒక సంవత్సరం మాత్రమే వాడిన కారు కొంటే మీరు నేరుగా 20 శాతం వరకు సేవ్ చేసుకోవచ్చు. సాధారణంగా కొత్త కార్లు మొదటి సంవత్సరంలో ఎక్కువగా నడపరు.
అలాంటప్పుడు మీకు తక్కువ వాడిన మంచి కారు దొరకవచ్చు. అయితే, ధర చూసి మాత్రమే కొనకూడదు. వాహనం టెక్నికల్‌గా బాగుందో లేదో ఖచ్చితంగా పరిశీలించాలి. అలాగే, మీరు తీసుకోవాలనుకున్న కారు మార్కెట్ లోకి వచ్చి ఎంత సమయం అయింది, ఎంత తిరిగింది అనేది కూడా ముఖ్యమే.
2. తక్కువ ధరలో టాప్ మోడల్
కొత్త కార్లలో టాప్ వేరియంట్ కొనడం చాలా ఖరీదుగా ఉంటుంది. కానీ యూజ్డ్ కార్ మార్కెట్‌లో అదే టాప్ మోడల్ మీకు చాలా తక్కువ ధరకే దొరకవచ్చు. మీరు కాస్త సమయం కేటాయించి వెతికితే, తక్కువ నడిచిన, టాప్ స్పెక్ వేరియంట్ సులభంగా దొరికే అవకాశం ఉంది. దీని వల్ల మీరు కొత్త కార్ బేస్ మోడల్ ధరలోనే టాప్ మోడల్‌ను పొందవచ్చు. ఈ విషయం కూడా మీరు గమనించాలి.
3. తక్కువ లోన్, తక్కువ ఇన్షూరెన్స్
పాత కారు తక్కువ ధరలో దొరకడంతో పెద్ద మొత్తంలో లోన్ అవసరం ఉండదు. దీని వల్ల EMIలు తగ్గుతాయి. అయితే, యూజ్డ్ కార్ లోన్లపై వడ్డీ రేట్లు కొత్త కార్లతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ మరోవైపు, ఇన్షూరెన్స్ ప్రీమియం మాత్రం గణనీయంగా తక్కువగా ఉంటుంది. కారణం, పాత కారు విలువ (IDV) ఇప్పటికే తగ్గిపోయి ఉంటుంది. అలాగే, ఈఎంఐ లు కూడా తక్కువకు అందించే సంస్థలు కూడా ఉన్నాయి. మీరు పాత కారు తీసుకునే ముందు ఈ విషయాలు కూడా తెలుసుకోండి.
4. పేపర్‌వర్క్ సౌలభ్యం
డీలర్‌షిప్ ద్వారా కారు కొంటే వాహనం పూర్తిగా చెక్ చేసి, పేపర్‌వర్క్ మొత్తం డీలర్ చూసుకుంటాడు. దీంతో మీకు అదనపు కష్టాలు ఉండవు. కానీ నేరుగా ఒక వ్యక్తి నుండి కారు కొనుగోలు చేస్తే కాగితాల పనంతా మీరే చేయాలి.
ఇందులో రిజిస్ట్రేషన్, ఇన్షూరెన్స్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ వంటి కీలక అంశాలు ఉంటాయి. కాబట్టి మీకు తెలియకపోతే తెలిసిన వారి సాయం తీసుకోవాలి. తప్పుడు కాగితాలతో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అప్రమత్తత అవరసం.
5. వారంటీ పరిమితులు
కారు ఇంకా వారంటీ పీరియడ్‌లో ఉన్నప్పుడు కంపెనీ డీలర్‌షిప్ ద్వారా కొంటే రెండు విధాలుగా లాభం ఉంటుంది. కంపెనీ అసలు వారంటీతో పాటు డీలర్ ఇచ్చే అదనపు వారంటీ కూడా దొరుకుతుంది. కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి నుండి కొనుగోలు చేస్తే వారంటీ ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి.
6. పరిమిత ఎంపికలు
కొత్త కార్ల మార్కెట్‌లో విభిన్న వేరియంట్లు, కలర్ ఆప్షన్లు దొరుకుతాయి. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఉదాహరణకు, మీరు హ్యుందాయ్ క్రెటా టాప్ మోడల్ కోరుకుంటే అది అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే, మీరు కొంచెం సమయం కేటాయిస్తే మీరు తీసుకోవాలనుకున్న వేరియంట్లు ఉండవచ్చు. కాబట్టి తొందరపాటు లేకుండా పాత కారు తీసుకునే విషయాన్ని ప్లాన్ చేసుకోండి.
సెకండ్ హ్యాండ్ కార్ కొనుగోలు ఆర్థికంగా మంచి ఎంపిక అవుతుంది కానీ, సరైన పరిశీలన, పేపర్‌వర్క్, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పుడే మీరు మంచి డీల్ ను పూర్తి చేస్తారు. లేకుంటే పాతకారుతో కొత్త తలనొప్పులు వస్తాయి.