జియో యూజర్లకు పండగే.. ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సేవలు
టెలికం రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన జియో యూజర్లను ఆకట్టుకునే క్రమంలోనే సరికొత్త ప్రయత్నాలు చేస్తోంది. రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కొత్త యూజర్లను దక్కించుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా యూట్యూబ్ ప్రీమియం సేవలను ఉచితంగా అందిస్తూ అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది వీడియోలను ఉచితంగా అందిస్తోంది యూట్యూబ్. అయితే ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ సైతం పెయిడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూట్యూబ్ ప్రీమియం పేరుతో మెరుగైన ఫీచర్లను అందిస్తోంది. అయితే తాజా జియో తమ యూజర్ల కోసం ఈ సేవలను ఉచితంగా అందిస్తోంది.
జియో ఎయిర్ ఫైబర్‌తో పాటు జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా యూట్యూబ్ ప్రీమియం సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. జవనరి 11వ తేదీ (శనివారం) నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇకపై 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. భారదేశంలో తమ సబ్‌స్క్రైబర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని కలిగించే ఉద్దేశంతో జియో ఈ అవకాశం కల్పించినట్లు తెలిపింది.
యూట్యూబ్ ప్రీమియం ఉపయోగాలు..
ఇక యూట్యూబ్ ప్రీమియం ఉపయోగాల విషయానికొస్తే.. యూజర్లు యూట్యూబ్‌లో ప్రకటనలు లేకుండా వీడియోలను వీక్షించవచ్చు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేని సమయంలో కూడా కొన్ని రకాల వీడియోలను వీక్షించేందుకు ముందుగానే డౌన్‌లోడ్ చేసకోవచ్చు.
అదే విధంగా ఇతర యాప్స్ ఉపయోగిస్తున్న సమయంలో అలాగే స్క్రీన్ ఆఫ్ అయిన సమయంలో కూడా వీడియోలను చూడడం లేదా మ్యూజిక్‌ను వినే అవకాశం లభిస్తుంది. ఇక యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల అడ్-ఫ్రీ లైబ్రరీ, వ్యక్తిగత ప్లేలిస్ట్‌లు, గ్లోబల్ చార్ట్-టాపర్లు వంటి ఫీచర్లను పొందొచ్చు.
ప్లాన్స్ వివరాలు..
ఈ ఆఫర్ కేవలం జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందులోనూ రూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ప్లాన్స్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని జియో తెలిపింది. ఇక యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి మై జియో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మీ యూట్యూబ్ ఖాతాలోకి లాగిన్ కావాలి. అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్‌లో లాగిన్ అవ్వాలి. దీంతో యాడ్ ఫ్రీ కంటెంట్‌ను వీక్షించవచ్చు. పూర్తి వివరాల కోసం www.jio.comని సందర్శించాలని జియో తెలిపింది.