Reliance Shares: షేర్ మార్కెట్‌లో అద్భుతం.. రూ.300 పెట్టి షేర్లు కొంటే రూ.11.88 లక్షలు లాభం..
Reliance Shares: షేర్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఓ వ్యక్తి కేవలం రూ.300 పెట్టి షేర్లు కొన్నారు. ఆ విషయం ఆయన మర్చిపోయారు. ఇప్పుడు ఆ షేర్లు విలువ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.11.88 లక్షలు. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడుంటారు, అతణ్ని లక్షాధికారిని చేసిన ఆ కంపెనీ డీటైల్స్ తెలుసుకుందాం రండి.

రతన్ ధిల్లాన్ అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో రెండు డాక్యుమెంట్స్ షేర్ చేశారు. ‘‘ఈ రెండు పత్రాలను ఇటీవలే మా ఇంట్లో కనుగొన్నాను. వీటిని ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఎవరైనా నాకు సహాయం చేయండి’’ అని అతను తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. అతని పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రెండు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన కొందరు నెటిజన్లు వారు రతన్ ధిల్లాన్ కు అభినందనలు చెప్పారు. మీరు లక్షాధికారి అయ్యారంటూ కంగ్రాట్ర్ తెలిపారు. ఆ పత్రంలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
రతన్ ధిల్లాన్ తన ఇంట్లో గుర్తించిన డాక్కుమెంట్స్ 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన రిలయన్స్ షేర్ల రికార్డులు. ఈ షేర్ల విలువ తెలియని ఆయన ఎక్స్ వేదికగా సహాయం కోరారు.

రతన్ ధిల్లాన్ పోస్ట్ ప్రకారం ఈ రెండు రిలయన్స్ షేర్లు 1987, 1992 మధ్య కొనుగోలు చేశారు. ధిల్లాన్ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు చెందిన 30 షేర్లను కొనుగోలు చేసింది. మొదటిసారిగా 1987లో 20 షేర్లు కొనుగోలు చేయగా, రెండోసారి 1992లో 10 షేర్లు కొనుగోలు చేశారు.
ఆ సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ షేరు ధర రూ.10గా ఉంది. ఈ షేర్లు 30 సంవత్సరాల క్రితం కొన్నారు. అప్పట్లో డిజిటల్ ఫార్మాట్ లేనందున ఈ రకమైన పత్రాలు (బాండ్లు) షేర్లు కొనుగోలు చేసిన వారికి అందించారు.

ఈ షేర్ల ప్రస్తుత ధర ఎంత?
గత 30 సంవత్సరాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు అనేక మార్పులకు గురయ్యాయి. రిలయన్స్ సంస్థ 30 ఏళ్లలో మూడుసార్లు షేర్లను విభజించిందని ఓ యూజర్ రతన్ ధిల్లాన్ కు రిప్లై ఇచ్చారు. ఈ విభజన ప్రకారం మీరు కలిగి ఉన్న షేర్ల సంఖ్య 960 అవుతుందని, ప్రస్తుత ధర ప్రకారం 960 షేర్ల ధర రూ.11.88 లక్షలు ఉంటుందని ఆ యూజర్ వివరించారు.
అంటే 30 సంవత్సరాల క్రితం రతన్ ధిల్లాన్ కుటుంబం రూ.300లకు 30 షేర్లను కొంటే ఇప్పుడు వాటి విలువ రూ.11.88 లక్షలకు పెరిగిందన్న మాట. షేర్ మార్కెట్ లో అద్భుతాలు జరుగుతాయంటే ఇదేనేమో.

ఇలాంటి సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. రతన్ ధిల్లాన్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇంట్లోనే ఇంకా వెతికితే మరికొన్ని షేర్స్ బాండ్లు దొరుకుతాయేమో చూడండంటూ ధిల్లాన్‌ను ప్రోత్సహిస్తున్నారు.
ఈ షేర్స్ డబ్బులు ఎలా అవుతాయి
రతన్ ధిల్లాన్ మొదట ఈ పత్రాన్ని డిజిటల్ రూపంలోకి మార్చాలి. దీని కోసం ఈ షేర్లను కలిగి ఉన్న వ్యక్తి పర్సనల్ డీటైల్స్, కుటుంబ సభ్యుల డీటైల్స్ ఉన్న పత్రాలు సమర్పించాలి. ఈ షేర్లు తరువాత డీమాట్ ఖాతాకు బదిలీ అవుతాయి. ఆ తరువాత ధిల్లాన్ కుటుంబం కోరుకుంటే ఈ షేర్లను డబ్బుగా మార్చుకోవచ్చు.