ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకులపై భారీ జరిమానా.. ఈ లిస్టులో మీ బ్యాంక్ ఉందా చూసుకోండి
RBI: భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సంచలన నిర్ణయం. 5 సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. నియమాలు పాటించకపోతే సహకార బ్యాంకులు కూడా కఠిన చర్యలకు గురవుతాయని మరొకసారి స్పష్టంచేసింది. ఇంతకీ ఆ బ్యాంకులేంటీ? కారణమేంటీ?

బ్యాంకులకు బిగ్ బాస్ ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)భారతదేశపు కేంద్ర బ్యాంకు. దీనిని 1935లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం, 1934 ప్రకారం స్థాపించారు. మొదట్లో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, 1949లో జాతీయికరణలో భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఈ బ్యాంకు దేశ ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తూ, వడ్డీ రేట్లను నిర్ణయించడం, ద్రవ్య సరఫరా, ధరల స్థిరత్వాన్ని కాపాడుతుంది. అదేవిధంగా భారత రూపాయిని జారీ చేసి, దాని సరఫరా, చెలామణిని వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. అంతేకాదు, ప్రభుత్వం తరఫున బ్యాంకర్‌గా, ఆర్థిక ఏజెంట్‌గా కూడా వ్యవహరిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే .. దేశంలోని అన్ని బ్యాంకులకు బిగ్ బాస్.
బ్యాంకులపై జరిమానా
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమశిక్షణ, పారదర్శకత, వినియోగదారుల రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), ఫిన్‌టెక్ సంస్థలు, సహకార బ్యాంకులపై ఆర్జీఐ నియంత్రణ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఒకేసారి 5 సహకార బ్యాంకులపై జరిమానా విధించింది.
కారణం ఏమిటి?
చంద్రాపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), యావత్మాల్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), అహ్మదాబాద్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ (గుజరాత్), భారత్ కోఆపరేటివ్ బ్యాంక్ (ముంబై), జలగావ్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర) బ్యాంకులపై ఆర్జీఐ జరిమానా విధించింది. ఈ బ్యాంకులు KYC నిబంధనలు, సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలు, డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్ నిబంధనలు, ఇతర రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను ఉల్లంఘించాయి. కొన్ని సందర్భాల్లో కస్టమర్ డబ్బును నిర్దేశిత నిధికి బదిలీ చేయకపోవడం, లేదా సైబర్ ఘటనల గురించి RBIకి సమాచారం ఇవ్వకపోవడం వంటి తప్పిదాలు కూడా చోటుచేసుకున్నాయి.
ఏ బ్యాంకుపై ఎంత జరిమానా?
ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవడంతో ఐదు సహకార బ్యాంకులపై జరిమానాలు విధించింది.
- మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ₹4.50 లక్షల జరిమానా పడింది. ఈ బ్యాంక్ KYC మార్గదర్శకాలు పాటించకపోవడంతో పాటు, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కి నిర్దేశిత సమయంలో అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ బదిలీ చేయడంలో విఫలమైంది.
- ముంబైలోని భారత్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ₹3.75 లక్షల జరిమానా విధించగా, సైబర్ సెక్యూరిటీ సంఘటనలపై RBIకి సమాచారం ఇవ్వకపోవడం, అలాగే ఐటీ వ్యవస్థ లోపాల వల్ల కస్టమర్లకు సేవల్లో అంతరాయం కలిగించడమే కారణమైంది.
- మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ₹3.50 లక్షల జరిమానా పడింది, ఇది డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్ నిబంధనలను ఉల్లంఘించింది.
- యావత్మాల్ జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ₹1 లక్ష జరిమానా విధించబడింది, ఎందుకంటే ఇది కూడా డైరెక్టర్ రిలేటెడ్ లోన్స్ నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసింది.
- గుజరాత్‌లోని అహ్మదాబాద్ మర్చంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ₹23,000 జరిమానా పడింది. ఈ బ్యాంక్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సభ్యత్వానికి సంబంధించిన RBI ఆదేశాలను పాటించకపోవడంతో పాటు, 2024 మార్చి 31లోగా రుణగ్రహీతలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ వివరాలు అందించడంలో విఫలమైంది.
RBI కఠిన చర్యలు
పై ఐదు సహకార బ్యాంకుల్లో నియమావళి ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేయడం, కస్టమర్ సెక్యూరిటీని హామీ ఇవ్వకపోవడం, లేదా అవసరమైన రిపోర్ట్స్ సమయానికి RBIకి అందించకపోవడం వంటి కారణాల వల్ల జరిమానాలు తప్పవు. సమస్యలు తీవ్రంగా ఉంటే, RBI లైసెన్స్ రద్దు చేసే అవకాశం కూడా ఉందని స్పష్టంగా తెలిపింది. ఈ చర్యలు పూర్తిగా రెగ్యులేటరీ కంప్లయెన్స్ లోపాలపై మాత్రమే తీసుకున్నవే. కస్టమర్లతో బ్యాంకులు చేసుకున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ జరిమానా ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది.