CIBIL స్కోరు లేకుండానే లోన్ పొందవచ్చా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
Loan Without CIBIL: రుణగ్రస్తులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మొదటిసారి రుణం కోసం దరఖాస్తు చేసుకునేవారి లోన్ ను కేవలం CIBIL స్కోరు లేకపోవడంతో బ్యాంకులు తిరస్కరించలేవు.

CIBIL స్కోరు లేకుండా లోన్ పొందవచ్చా?
CIBIL స్కోరు లేకుండా లోన్ పొందవచ్చా? లోన్ అప్లై చేస్తే వస్తుందా? రాదా? అని ఆందోళనలో ఉన్నవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త నియమాల ప్రకారం మొదటిసారి రుణం కోరే వారికి CIBIL స్కోరు తప్పనిసరి కాదట. అంటే.. తొలిసారి రుణం తీసుకునే వారికి క్రెడిట్ స్కోర్, లోన్ హిస్టరీ లేకపోయినా, వ్యక్తిగత అవసరాల కోసం లేదా కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి రుణం కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. RBI మార్గదర్శకాలు ప్రకారం, బ్యాంకులు కేవలం సిబిల్ స్కోరు లేకపోవడం వల్ల లోన్ ను తిరస్కరించలేవు.
కేంద్రం కీలక ప్రకటన
కేంద్ర ఆర్థిక శాఖ (Finance Ministry) కీలక ప్రకటన చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మొదటిసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం CIBIL స్కోరు తప్పనిసరి కాదు. RBI మార్గదర్శకాలు ప్రకారం, క్రెడిట్ హిస్టరీ లేకపోవడం లేదా స్కోరు తక్కువగా ఉండడం కారణంగా రుణ దరఖాస్తులను తిరస్కరించరాదని తెలిపారు. అలాగే లోన్ అప్లికేషన్‌ను తిరస్కరించకూడదని RBI మార్గదర్శకాలను గుర్తు చేశారు.
CIBIL స్కోరు (Credit Score) అంటే?
CIBIL స్కోరు అనేది వ్యక్తి క్రెడిట్ అర్హత (credit worthiness)ను సూచిస్తుంది. ఇది 300 నుండి 900 మధ్యలో ఉంటుంది, అతి తక్కువ స్కోరు 300, అత్యధిక స్కోరు 900. భారతదేశంలో ఈ స్కోరు CIBIL (Credit Information Bureau India Limited) ద్వారా జారీ చేయబడుతుంది. ఈ స్కోరు ఆధారంగా వ్యక్తి పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, హౌసింగ్ లోన్స్, ఇతర బ్యాంక్ రుణాలకు అర్హత కలిగి ఉన్నాడా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు.
అంటే, బ్యాంకులు, క్రెడిట్ ఇన్స్టిట్యూషన్లు ఈ స్కోరు ఆధారంగా వ్యక్తి గత రుణ చెల్లింపుల రికార్డు, లోన్ హిస్టరీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను అంచనా వేస్తాయి. మంచి CIBIL స్కోరు ఎక్కవ ఉన్నవారు రుణాలను తక్కువ వడ్డీ రేట్లతో పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. CIBIL స్కోరు వ్యక్తుల ఫైనాన్షియల్ డిసిప్లిన్‌ను ప్రతిబింబిస్తుంది. మీరు సంవత్సరానికి ఒకసారి మీ క్రెడిట్ నివేదికను ఆన్‌లైన్‌లో పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ఇది కాకుండా, క్రెడిట్ సమాచార కంపెనీలు (CICలు) తమ నివేదికను అందించడానికి గరిష్టంగా రూ. 100 వసూలు చేయవచ్చు.
RBI ఏం చెప్పింది?
RBI మాస్టర్ డైరెక్షన్ (తేదీ 06.01.2025) ప్రకారం.. మొదటిసారి రుణం తీసుకునేవారి దరఖాస్తులను కేవలం క్రెడిట్ హిస్టరీ లేకపోవడం లేదా CIBIL స్కోరు తక్కువగా ఉండడం కారణంగా బ్యాంకులు తిరస్కరించకూడదు. అంటే.. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ రుణం తీసుకోకపోయినా, బ్యాంక్ మీ అప్లికేషన్‌ను తిరస్కరించలేడు. ఇది కీలక మార్పు, ఎందుకంటే ఇప్పటివరకు చాలా మంది సిబిల్ స్కోరు లేకపోవడం వల్ల రుణం పొందలేకపోతున్నారు. ఈ మార్పు మొదటిసారి రుణదారులకు గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది, ఆర్థిక అవకాశాలను విస్తరించే దిశలో కీలక నిర్ణయమని చెప్పాలి.
ఎందుకు ముఖ్యం?
RBI కొత్త నిబంధన ప్రకారం.. మొదటిసారి రుణం తీసుకునేవారికి గొప్ప అవకాశం అందిస్తుంది. ముందు క్రెడిట్ హిస్టరీ లేకపోవడం వల్ల రుణం పొందలేని యువత, చిన్న వ్యాపారులు, కొత్త రుణదారులు ఇప్పుడు ధైర్యంగా బ్యాంకులకు దరఖాస్తు చేయవచ్చు. దీనివల్ల ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుంది, మరింత మంది వ్యక్తులకు రుణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, తద్వారా వ్యక్తిగత అవసరాలు, వ్యాపారం ప్రారంభించడం వంటి ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది.