Cyber Threats: సైబర్ దాడులపై మీ పిల్లలకు అవగాహన కల్పించారా? ఇవిగో టెక్నిక్స్
మీరు మీ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? కాని మీరు ఎప్పుడైనా వారికి ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలో నేర్పించారా? మీరు నేర్పించకపోతే వారు మీకు తెలియకుండా చెడు విషయాలు చూసే అవకాశం ఉంటుంది? సైబర్ దాడులకు గురయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మీ పిల్లలకు ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి టెక్నిక్స్ ఇక్కడ ఉన్నాయి.

ఏదైనా కొత్త వస్తువులకు, విషయాలకు పిల్లలు, యువత త్వరగా అట్రాక్ట్ అవుతారు. ఇక ఇంటర్నెట్ గురించి చెప్పక్కర లేదు. ప్రతి క్షణం కొత్త కొత్త వీడియోలు, ఫోటోలు, ఇతర విషయాలతో అప్ గ్రేడ్ అయ్యే ఇంటర్నెట్ కంటెంట్ కి అట్రాక్ట్ కాకుండా పిల్లలు, యువత ఎలా ఉండగలరు. అయితే కొత్త వస్తువులను ఎలా ఉపయోగించాలో పెద్దలు వారికి నేర్పించడం చూస్తుంటాం. అలాగే ఇంటర్నెట్ ని కూడా ఎలా ఉపయోగించాలో వారికి నేర్పిస్తే చెడు మార్గంలో వెళ్లకుండా ఉంటారు.
ఇంటర్నెట్ పెద్దలకు మాత్రమే అనుకుంటే మనం పొరపాటు పడ్డటే. ఎందుకంటే పిల్లలు, యువతను దీని అవసరం చాలా పెరిగిపోయింది. స్కూల్స్ లో అసైన్మెంట్స్ అని, కాలేజీల్లో ప్రాజెక్ట్ అని ఇలా ఎన్నో రకాలుగా ఇంటర్నెట్ అవసరం వారికి ఉంది. అయితే ఇంటర్నెట్ ఎలా ఉపయోగించాలన్న నాలెజ్డ్ వారికి నేర్పకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోయాయి. మన ఫోన్ హ్యాక్ చేయడం, ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, జీమెయిల్ అకౌంట్స్ హ్యాక్ చేయడం లాంటి పనులు చేసి బెదిరించడం, ఫిషింగ్ తదితర విషయాలు జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు విద్య, ఇతర కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ను ఎక్కువగా యాక్సెస్ చేస్తున్నందున ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని సర్వే సంస్థలు గుర్తించాయి.
ఇంటర్నెట్ పై పేరెంట్ కంట్రోల్
పిల్లలు తమ స్కూల్ అసైన్మెంట్, ప్రాజెక్ట్స్ లో భాగంగా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు. అయితే అశ్లీల కంటెంట్, హింసాత్మక విషయాలు, నేరాలు, అసభ్యకర వీడియోలు వారికి కనిపించి వారు పక్కదారిపట్టే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వారికి ఇచ్చే ఫోన్ లో ‘పేరెంట్ కంట్రోల్’ ఆప్షన్స్ ను ఎనేబుల్ చేసి ఇవ్వడం మంచింది. దీని కోసం మీరు ఉపయోగించి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)తో కూడా మాట్లాడవచ్చు. నిర్దిష్ట చాట్ రూమ్‌లు, వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయడానికి వారు మిమ్మల్ని అనుమతిస్తారు.
సైబర్ నేరాలపై అవగాహన
మీ పిల్లలకు సైబర్ నేరాలు, భద్రత గురించి వివరించండి. వారితో డిస్కస్ చేయండి. వ్యక్తిగత సమాచారాన్ని కొత్త వారికి చెప్పకూడదన్న విషయం వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఆన్‌లైన్‌లో అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని మీ పిల్లలకు నేర్పండి.
యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్
మీ పిల్లల ఉపయోగిస్తున్న ఫోన్ లో లేటెస్ట్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ను వేయండి. పిల్లలు ఉపయోగించకూడని వాటి కోసం కొన్ని సెట్టింగ్‌లు మార్చండి. ముఖ్యంగా వెబ్‌క్యామ్‌లు, ఆడియో సెట్టింగ్స్ ఆపండి.
స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను సెట్ చేయండి
స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను సెట్ చేయడం గురించి మీ పిల్లలకు నేర్పండి. దాని వల్ల కలిగే ఉపయోగాలు, చేయకపోతే జరిగే సైబర్ దాడుల గురించి కూడా చెప్పండి.
అప్పుడప్పుడు గమనించండి
తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తుండాలి. మీ పిల్లల అకౌంట్స్, కార్యాచరణను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుండండి. ఏవైనా అనుమానాస్పద ఫిషింగ్ దాడులు జరుగుతుంటే తెలుసుకోండి.