ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా? తగ్గుతుందా?
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కొక్కరి దగ్గర మల్టిపుల్ క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడితే క్రెడిట్ స్కోర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

మల్టిపుల్ క్రెడిట్ కార్డుల వల్ల లాభమా? నష్టమా?
ప్రస్తుతం చాలామంది రోజువారీ ఖర్చులకు, ఆన్‌లైన్ షాపింగ్‌కి లేదా పండుగల సమయంలో ఉండే అవసరాలు తీర్చుకోవడానికి క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఐదారు క్రెడిట్ కార్డులు కూడా వాడేవారు ఉన్నారు. అయితే ఈ మల్టిపుల్ క్రెడిట్ కార్డులు మీ క్రెడిట్ స్కోరును పెంచుతాయా? లేదా తగ్గిస్తాయా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగిస్తే లాభం
మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే వాటిని సరిగ్గా నిర్వహించడం ముఖ్యం. తద్వారా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. మీ క్రెడిట్ లిమిట్ లో తక్కువ శాతం మాత్రమే ఉపయోగిస్తే.. క్రెడిట్ వినియోగ నిష్పత్తి (credit utilization ratio) మెరుగవుతుంది. ఇది స్కోర్ పెరగడానికి సహాయపడుతుంది.
అలాగే షాపింగ్, ట్రావెల్, పెట్రోల్ వంటి వివిధ అవసరాలకు వేర్వేరు కార్డులు ఉపయోగిస్తే, మీ క్రెడిట్ మిక్స్ మెరుగుపడుతుంది. అంటే మీరు ఆర్థికంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు రుణమిచ్చిన సంస్థలకు అర్థమవుతుంది.
ముఖ్యంగా ఉపయోగించిన ప్రతి కార్డుకి టైంకి పేమెంట్ చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే.. గడువు తేదీకి ముందే బిల్లు కట్టేస్తే.. అది మీ రీపేమెంట్ హిస్టరీని బలంగా చూపిస్తుంది. దానివల్ల బ్యాంకులు మిమ్మల్ని నమ్మకమైన కస్టమర్ గా పరిగణిస్తాయి.
క్రెడిట్ కార్డులను సరిగ్గా నిర్వహించకపోతే నష్టం ఎక్కువ
మల్టిపుల్ కార్డులను సరిగ్గా నిర్వహించకపోతే అవి మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తాయి. ఒక్క కార్డు పేమెంట్ ఆలస్యం చేసినా లేదా మిస్ చేసినా.. అది మీ మొత్తం స్కోర్ పై చెడు ప్రభావం చూపిస్తుంది. అలాగే తక్కువ టైంలో ఎక్కువ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసినా మీ క్రెడిట్ రిపోర్ట్‌లో ‘హార్డ్ ఎంక్వైరీలు’ పెరుగుతాయి. దానివల్ల స్కోర్ తగ్గుతుంది.
అలాగే ప్రతి కార్డు మీద ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి, క్రెడిట్ పరిమితికి దగ్గరగా వెళ్లినా కూడా అది క్రెడిట్ పై ఎక్కువగా ఆధారపడుతున్నారని సూచిస్తుంది. దానివల్ల కూడా స్కోర్ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఖర్చులు తగ్గించేందుకు పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసినా.. క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మల్టిపుల్ కార్డులను సురక్షితంగా వాడే చిట్కాలు
- మొత్తం క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువ మాత్రమే ఉపయోగించాలి.
- సమయానికి చెల్లింపులు చేయాలి.
- పాత కార్డులకు ఎక్కువ ఫీజులు లేకపోతే వాటిని ఆక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి.
- క్రెడిట్ రిపోర్ట్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి.
- ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలి.