- Home
- Business
- Post Office: డబ్బులకు డబ్బులు కాయడం అంటే ఇదే.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 90 వేల లాభం
Post Office: డబ్బులకు డబ్బులు కాయడం అంటే ఇదే.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 90 వేల లాభం
Post Office: మంచి రాబడిని కోరుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ పథకంలో పెట్టుబడి సురక్షితంగా ఉండటమే కాకుండా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి వడ్డీ రేట్లు కూడా లభిస్తున్నాయి.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో నడిచే పొదుపు పథకం. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు నిర్ణీత కాలానికి జమ చేయవచ్చు. షేర్ మార్కెట్‌లో ఉండే రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు. పెట్టుబడిపై ప్రభుత్వం హామీ ఇవ్వడం వల్ల మూలధనం పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

ప్రస్తుతం లభిస్తున్న వడ్డీ రేట్లు
ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో వివిధ కాలపరిమితులకు ఈ క్రింది విధంగా వడ్డీ రేట్లు అందిస్తున్నారు. ఒక సంవత్సరం డిపాజిట్‌పై – 6.9% వడ్డీ లభిస్తుంది. 2 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.0%, 3 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.0%, 5 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.5% వడ్డీ పొందొచ్చు. అందులోనూ 5 సంవత్సరాల కాలపరిమితికి అత్యధిక వడ్డీ లభిస్తోంది. అందువల్ల దీర్ఘకాలిక పెట్టుబడి చేయాలనుకునే వారు ఈ ఎంపికను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
రూ.2 లక్షల పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుంది?
ఈ పథకంలో రూ.2 లక్షలను ఒకేసారి 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.2,89,990 అందుతుంది. అంటే పెట్టుబడి చేసిన రూ.2 లక్షలకు అదనంగా సుమారు రూ.89,990 వడ్డీ రూపంలో లాభంగా లభిస్తుంది. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా దాదాపు రూ.90 వేల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉండటం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఎవరు ఖాతా తెరవొచ్చు?
ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. పెట్టుబడిదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా ఎంత మొత్తమైనా జమ చేయవచ్చు. అలాగే వ్యక్తిగత (Single) ఖాతా తెరవొచ్చు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. 10 సంవత్సరాలు దాటిన పిల్లల పేరుతో కూడా ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. పన్ను మినహాయింపులు, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు ఉంటాయి. 5 సంవత్సరాల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో పెట్టుబడితో పాటు ట్యాక్స్ సేవింగ్ కూడా సాధ్యమవుతుంది.
అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి
ఖాతా తెరిచిన మొదటి 6 నెలల్లో డబ్బు ఉపసంహరించుకోలేరు. గడువు పూర్తికాకముందే డబ్బు తీసుకుంటే వడ్డీపై 1 శాతం వరకు కోత విధించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా కొనసాగిస్తే పూర్తి వడ్డీ ప్రయోజనం పొందవచ్చు.

