జీఎస్టీ సంస్కరణలు: కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయా? ఎంత మేరకు?
GST reforms: త్వరలో జీఎస్టీ సంస్కరణలు అమలుకానున్నాయి. ఈ సంస్కరణలతో ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

జీఎస్టీ సంస్కరణలు
ప్రధాని నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రణాళికను ప్రకటించారు. ఈ సంస్కరణల ద్వారా ఆటోమొబైల్ పరిశ్రమకు మాత్రమే కాదు, వినియోగదారులకూ ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
జీఎస్టీ స్లాబుల సరళీకరణ- వాహనాల ధరల తగ్గింపు
ప్రస్తుతం వస్తువులు, సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటన ప్రకారం ఈ స్లాబులను రెండు విస్తృత విభాగాలుగా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. స్టాండర్డ్ రేట్ 18%, మెరిట్ రేట్ 5%. ఈ మార్పుల ఫలితంగా ప్రస్తుతం 28% జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలపై పన్ను 18%కి తగ్గే అవకాశం ఉంది. దీంతో వాహనాల ధరలు సుమారు 5-10% వరకు పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మధ్యతరగతి వాహనదారులకు గుడ్ న్యూస్
ఈ జీఎస్టీ స్లాబ్ సరళీకరణ చర్యల వల్ల రూ. 10 లక్షల లోపు సబ్-కాంపాక్ట్ కార్లు, తక్కువ ధరలో లభించే ద్విచక్ర వాహనాలు వినియోగదారులకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, ఆటోమొబైల్ విడిభాగాలపై పన్ను తగ్గింపు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల తయారీదారుల ఖర్చులు తగ్గి, వినియోగదారులకు వాహనాలను మరింత తక్కువ ధరలో పొందే అవకాశముంది. విడిభాగాల పన్ను తగ్గుదల వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఎలక్ట్రిక్ వాహనాలు, లగ్జరీ కార్లు ప్రభావం
ప్రస్తుత జీఎస్టీ స్లాబ్ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలపై 5% పన్ను కొనసాగనుంది. లగ్జరీ కార్ల పన్ను విధానంలో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్యాసింజర్ కార్లపై అమలులో ఉన్న కాంపెన్సేషన్ సెస్ కొనసాగే అవకాశముంది. అదనంగా, కొన్ని లగ్జరీ, వస్తువులపై 40% పన్ను రేటు విధించబడే అవకాశం ఉంది,
ఆర్థిక వ్యవస్థకు ఊతం
జీఎస్టీ స్లాబ్ సరళీకరణల ప్రధాన లక్ష్యం ‘సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడం’. ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ (MSME) రంగానికి వ్యాపార విస్తరణకు ఈ మార్పులు తోడ్పడుతాయి. పన్నుల తగ్గింపు వల్ల వాహనాల పాటు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తక్కువ ధరల్లో లభించే అవకాశముంది. ఫలితంగా వినియోగదారులు లబ్ది పొందడమే కాకుండా, దేశీయ డిమాండ్ పెరుగుతూ మొత్తం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఎప్పటి వరకు అమలు కానున్నాయి?
కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ విధానాలను అమలు చేసేందుకు వేగవంతమైన ప్రయత్నాలు చేస్తున్నది. జీఎస్టీ కౌన్సిల్ రాబోయే సమావేశంలో GoM సిఫార్సులను చర్చించి, త్వరలో అమలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పన్ను మార్పులు దీపావళి లేదా అక్టోబర్-నవంబర్ ప్రారంభంలో అమల్లోకి రావొచ్చు. ఈ కొత్త విధానాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ప్రయోజనాలు పొందేలా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా, ఈ సంస్కరణలు వినియోగదారులకు తక్కువ ధరలు, పరిశ్రమలకు వ్యాపార వృద్ధి, దేశానికి ఆర్థిక బలాన్ని చేకూర్చనున్నాయి.