Jio వినియోగదారులకు షాక్: డేటా ప్యాక్ వ్యాలిడిటీలు తగ్గిపోయాయ్
జియో తన కస్టమర్లపై మరోసారి రీఛార్జ్ భారం మోపుతోంది. కొన్ని డేటా వోచర్ల వ్యాలిడిటీ తగ్గిస్తూ రిలయన్స్ జియో నిర్ణయం తీసుకుంది. దీని వల్ల జియో వినియోగదారులు తరచూ డేటా ప్లాన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏ వోచర్ల వ్యాలిడిటీ తగ్గించిందో తెలుసుకుందాం రండి.
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో మరోసారి తన కస్టమర్లపై డేటా ప్లాన్ భారం మోపుతోంది. జియోలో అత్యంత తక్కువ డేటా వోచర్‌లైన రూ.19, రూ.29ల వ్యాలిడిటీలో ప్రధాన మార్పులు చేసింది. టెంపరరీ డెేటా కోసం ఈ డేటా వోచర్‌లే చాలా మంది రిలయన్స్ జియో కస్టమర్‌లు ఉపయోగిస్తుంటారు. తాజాగా వీటి వ్యాలిడిటీ టైమ్ ని తగ్గిస్తూ రిలయన్స్ నిర్ణయం తీసుకుంది.
కొన్ని నెలల క్రితం వరకు రూ.19 వోచర్ రూ.15లకు, రూ.29 వోచర్ రూ.25కి లభించేది. 2024 సంవత్సరం ప్రారంభంలో అమలు చేసిన టారిఫ్ పెంపుదల వల్ల ఈ వోచర్‌ల ధర కూడా పెరిగిపోయింది.
రూ.19 డేటా వోచర్ రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారుడి బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు చెల్లుబాటు అయ్యేది. అంటే.. వినియోగదారు బేసిక్ ప్లాన్ 70 రోజుల వరకు చెల్లుబాటు అయితే, అతను రూ.19 డేటా వోచర్ కూడా వేయించుకుంటే 70 రోజులు లేదా డేటా పూర్తిగా ఉపయోగించే వరకు పని చేసేది. అయితే ఇప్పుడు రూ.19 డేటా వోచర్ వ్యాలిడిటీని కేవలం 1 రోజుకు పరిమితం చేశారు. కాబట్టి రూ.19 డేటా వోచర్ కొత్త వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. రోజు దాటితే అందులో డేటా మిగిలిపోయినా తర్వాత ఉపయోగించడానికి అవకాశం ఉండదు.
అదేవిధంగా రూ.29 డేటా వోచర్ కూడా గతంలో వినియోగదారు బేసిక్ యాక్టివ్ ప్లాన్ ఎంత కాలం వ్యాలిడిటీ ఉంటుందో అంతకాలం డేటా ఉన్నంత వరకు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దీని వ్యాలిడిటీని కూడా మార్చారు. రూ.29 డేటా వోచర్ వేయించుకుంటే ఇప్పుడు కేవలం 2 రోజుల వరకు మాత్రమే సర్వీస్ లభిస్తుంది. ఆ తర్వాత డేటా మిగిలిపోయినా ఉపయోగించుకోవడానికి వీలు కాదు.
ఈ ప్లాన్‌ల వ్యాలిడిటీకి జియో పెంచడం వెనుక కస్టమర్‌ల నుండి ఎక్కువ ఆదాయాన్ని కంపెనీ ఆశిస్తోందని అర్థమవుతోంది. డేటా వోచర్ల ధరలు పెంచకపోయినా వ్యాలిడిటీ తగ్గించడం వల్ల ఇప్పుడు అవసరమైనప్పుడల్లా రూ.19 రూ.29 రీఛార్జ్ చేసుకోవాలన్న మాట. గతంలో అయితే ఒకసారి రూ.19 గాని, రూ.29 తో గాని రీఛార్జ్ చేసుకుంటే బేసిక్ ప్లాన్ ఉన్నంత వరకు అందులో ఉండే డేటాను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. ఇకపై అలా కుదరదు. డేటా అవసరమైన ప్రతిసారి రీఛార్జ్ చేసుకోవాల్సిందే.