ITR filing: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించిన కేంద్రం
ITR filing: ఆదాయపు పన్ను శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ఐటీఆర్ ఫైలింగ్) దాఖలు చేయడానికి గడువును మరోసారి పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఐటీఆర్ ఫైలింగ్ గడువు పెంపు
ITR filing date extended: ఆదాయపు పన్ను శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరానికి (2025–26 మదింపు సంవత్సరానికి) ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలుకు గడువు పొడిగించింది. అంతకుముందు, జూలై 31, 2025 చివరి తేదీ కాగా, ఇప్పుడు దానిని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను రిటర్న్ ఫారముల విడుదలలో ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఏం చెప్పిందంటే?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విషయాన్ని మంగళవారం (మే 27, 2025న) అధికారికంగా ప్రకటించింది. ఐటీఆర్ ఫారములలో భాగంగా తీసుకువచ్చిన నిర్మాణాత్మక మార్పులు, టీడీఎస్ డేటా ఆప్డేట్ లో ఆలస్యం, అలాగే ఐటీఆర్ దాఖలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ టూల్స్ సిద్ధం కాకపోవడం వంటి కారణాల వల్ల ఈ పొడిగింపు అవసరమయ్యిందని సీబీడీటీ వెల్లడించింది.
ఐటీఆర్ ఫారములలో ముఖ్యమైన మార్పులు
CBDT తన X ఖాతా లో సంబంధిత ఉత్తర్వులను పంచుకుంది. "31 జూలై 2025 వరకు దాఖలు కావలసిన ఐటీఆర్‌ల గడువును 15 సెప్టెంబర్ 2025కు పొడిగించడంపై CBDT నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్ ఫారములలో చేసిన ముఖ్యమైన మార్పులు, సిస్టమ్ అభివృద్ధి అవసరాలు, టీడీఎస్ క్రెడిట్ సంబంధిత అంశాల నేపథ్యంలో ఈ పొడిగింపు అందరికీ అవసరమైన సమయాన్ని కల్పిస్తుంది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ త్వరలో జారీ అవుతుంది" అని తెలిపింది.
ఐటీఆర్ దాఖలు గడుపు పెంపుతో ఎవరికి ప్రయోజనం?
ఈ పొడిగింపు ముఖ్యంగా వేతన జీవులకు, ఉద్యోగులకు, అలాగే ఆడిట్ అవసరం లేని పన్ను దాతలకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. వారు ఇప్పుడు అదనంగా 46 రోజులు సమయం పొందనున్నారు. గడువు మించిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ. 5,000 వరకు జరిమానా విధించే అవకాశమున్న సంగతి తెలిసిందే.
సీబీడీటీ ప్రకారం, 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారములు పూర్తిగా పునఃనిర్మించారు. ఇవి మరింత పారదర్శకత, సరళీకరణ, ఖచ్చితమైన నివేదికలను అందించేందుకు మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ మార్పుల వల్ల ITR ఫైలింగ్ యుటిలిటీలు అభివృద్ధి చేయడానికి, ఇంటిగ్రేషన్ కోసం, అలాగే పరీక్షలు నిర్వహించేందుకు సమయం అవసరమవుతుందని తెలిపింది.
ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?
ఆర్థిక నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. టాక్స్‌మ్యాన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా మాట్లాడుతూ.. “2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫారములు ఆలస్యంగా ఏప్రిల్ 29 నుండి మే 9, 2025 వరకు ఏడు విడతల్లో విడుదలయ్యాయి. గత సంవత్సరాల కంటే ఇది ఆలస్యంగా జరగడం వల్ల CBDT ముందస్తుగా గడువు పొడిగించింది" అన్నారు.
TaxManager.in వ్యవస్థాపకుడు దీపక్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "ఈ సంవత్సరం 10 కోట్లకు పైగా పన్ను దాతలు రిటర్నులు దాఖలు చేయనున్నారు. ఇందులో తొలిసారిగా ఫైల్ చేసే వారు, విదేశీ ఆస్తులు కలిగిన వారు, బహుళ ఆదాయ వనరులు ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ పొడిగింపు వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని" తెలిపారు.