- Home
- Business
- IRCTC Offer: ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి ఐఆర్సిటిసి కొత్త ప్యాకేజీ, 12 రోజుల ప్రయాణానికి టిక్కెట్ ధర ఎంతంటే
IRCTC Offer: ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి ఐఆర్సిటిసి కొత్త ప్యాకేజీ, 12 రోజుల ప్రయాణానికి టిక్కెట్ ధర ఎంతంటే
జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలని ప్రతి హిందూ భక్తుడు కోరుకుంటాడు. శివుడికి అంకితం చేసిన ఈ జ్యోతిర్లింగాలలో ఏడింటిని దర్శించుకునే భాగ్యాన్ని ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీ ఇస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.

ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సిటిసి.. మన దేశంలో ఉన్న ఏడు పవిత్ర జ్యోతిర్లింగాల దర్శనం కోసం కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 12 రోజులలో ఏడు జ్యోతిర్లింగాలను ఈ ప్యాకేజీలో భాగంగా చూడవచ్చు. అంతేకాదు ద్వారకను కూడా చూసే అదృష్టం దక్కుతుంది. ఏ ఏ జ్యోతిర్లింగాలను ఈ టూర్ ప్యాకేజీ లో భాగం చేశారో? ఇది ఎప్పుడు మొదలవుతుందో? ఎంత చెల్లించాలో తెలుసుకోండి.
ఏఏ జ్యోతిర్లింగాలు?
ఐఆర్సిటిసి చెబుతున్న ప్రకారం మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్), నాగేశ్వర్ (గుజరాత్), సోమనాథ్ (గుజరాత్), త్రయంబకేశ్వర్ (మహారాష్ట్రా), భీమశంకర్ (మహారాష్ట్ర), ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర), ఓంకారేశ్వర్ (మధ్య ప్రదేశ్) జ్యోతిర్లింగాలను ఈ టూర్ ప్యాకేజీలో భాగం చేశారు. వీటితో పాటు బెట్ ద్వారకా, ద్వారకా వంటి ప్రదేశాలను కూడా సందర్శించేలా ఏర్పాటు చేశారు. ఏడు జ్యోతిర్లింగాల టూర్ ప్యాకేజీకి ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ అనే ప్రత్యేక రైలును ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ పర్యటన సాగుతుంది.
ప్యాకేజీ వివరాలు
ఏడు జ్యోతిర్లింగాల టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీ ఈ ఏడాది నవంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది. నవంబర్ 29 వరకు సాగుతుంది. అంటే 11 రాత్రులు 12 పగళ్ళు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ట్రైన్లో మొత్తం బెర్తులు 767. ఈ ప్యాకేజీ ఖర్చు ఒక్కొక్కరికి 24,100 రూపాయలు అవుతుంది. ఇందులో కూడా స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసి ఉన్నాయి. క్లాసును బట్టి ఖర్చులు కూడా ఉంటాయి.
స్లీపర్లో వెళ్లాలనుకుంటే పెద్దలు ఒక్కొక్కరికి 24,100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే పిల్లలకైతే 22,200 రూపాయలు అవుతుంది. ఇక థర్డ్ ఏసిలో ప్రయాణించాలనుకున్న పెద్దలు ఒక్కొక్కరికి 40,890 రూపయాలు చెల్లించాలి. అదే పిల్లలకైతే 39,260 రూపాయలు చెల్లించాలి. సెకండ్ ఏసీలో ప్రయాణం చేయాలనుకునే వారు 54,390 రూపాయలు చెల్లించాలి. అదే పిల్లలకైతే 52,425 రూపాయలు చెల్లించాలి.
ప్యాకేజీలో ఏమేమి దక్కుతాయి?
ఈ ప్యాకేజీలో భాగంగానే రైలు ప్రయాణం, అలాగే హోటల్లలో రాత్రి బస చేయడం, ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఇస్తారు. అయితే కేవలం శాఖాహారాన్ని మాత్రమే అందిస్తారు. ప్రయాణికులకు ప్రయాణ భీమా కూడా ఉంటుంది. మీతో పాటు ఐఆర్సిటిసి టూర్ మేనేజర్లు ప్రయాణమంతటా మీతోనే ఉంటారు.
ఈ ఖర్చులు మీవే
టూర్ కు వెళ్లిన తర్వాత అక్కడ ఆలయ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సందర్శన ప్రవేశ రుసుములు వంటివి మాత్రం ఐఆర్సిటిసి చెల్లించదు. మినరల్ వాటర్, ఇతర ఆహారాలు ప్రత్యేకంగా కొనుక్కోవడం వంటివి మీరే భరించాలి. కాబట్టి ఇవి ప్యాకేజీలో భాగం కావు.
ఈ రైలు బుక్ చేసుకోవడానికి ముందు కచ్చితంగా ఓటర్ ఐడి, లేదా ఆధార్ ఐడి ఉండాలి. అలాగే కోవిడ్ టీకా తీసుకున్నట్టు ప్రూఫ్ ను చూపించాలి. ఈ ప్రయాణం నవంబర్ 18, 2025న ఉత్తరాఖండ్ లోని యోగ నాగరి రిషికేష్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. ఎక్కడ నుంచి మీరు ఈ రైలు బుక్ చేసుకున్నా కూడా అందరూ రిషికేష్ రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ టూరు మొదలవుతుంది.