ఇకపై మీరు ట్రైన్ టిక్కెట్ లో బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చుకోవచ్చు. ఎలాగంటే..
మీరు రిజర్వేషన్ చేయించుకున్న ట్రైన్.. ఎక్కాల్సిన స్టేషన్ లో కాకుండా వేరే స్టేషన్ లో ఎక్కాలనుకుంటున్నారా? బోర్డింగ్ స్టేషన్ మార్చడానికి IRCTC అవకాశం కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో చేయాల్సిన ఈ ప్రాసెస్ గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
ఈ కాలంలో రిజర్వేషన్ చేయించడం చాలా సింపుల్. ఎక్కడ ఉన్నా ఎక్కడి నుంచైనా రిజర్వేషన్ చేసేయొచ్చు. అయితే అనుకోని కారణాల వల్ల మీరు బోర్డింగ్ స్టేషన్ లో ట్రైన్ ఎక్కకపోతే టీసీ వచ్చి చెక్ చేసి ఆ సీట్ వేరే వాళ్లకి ఇచ్చేస్తారు. ఆ తర్వాత స్టేషన్ లో మీరు ట్రైన్ ఎక్కినా మీరు సీట్ నాది అని అడగడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉండవు.
ట్రైన్ టిక్కెట్ రిజర్వ్ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ పనుల వల్ల ట్రైన్ టైంకీ స్టేషన్ కి రాలేరు. హడావడిగా వచ్చినా అప్పటికి రైలు వెళ్లిపోవచ్చు. దాని కంటే తర్వాత స్టేషన్ లో ఎక్కితే కంగారు పడక్కర్లేదని కొందరు నెక్ట్స్ స్టేషన్ కు ముందుగా వచ్చి ట్రైన్ ఎక్కుతారు. అయితే ఈ లోగా టిక్కెట్ కలెక్టర్ వచ్చి సీట్ చెక్ చేస్తే ఖాళీగా ఉండటం చూసి టిక్కెట్ క్యాన్సల్ చేసి వేరే వారికి ఆ సీటు కేటాయిస్తారు. ఇలాంటి సమస్య ఎవరికీ ఎదురవుకుండా ఉండాలని IRCTC బోర్డింగ్ స్టేషన్ మార్చుకొనే ఫెసిలిటీని తీసుకొచ్చింది. అదెలా మార్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసిన టిక్కెట్లలో బోర్డింగ్ స్టేషన్ మార్చడానికి రైల్వే అనుమతిస్తుంది. ఈ ప్రాసెస్ చాలా సులభం. ఇది సరిగ్గా జరగాలంటే బుకింగ్ సమయంలో సరైన మొబైల్ నంబర్ ఇవ్వాలి.
ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
లెఫ్ట్ సైడ్ 'ట్రాన్సాక్షన్ టైప్' మెనూ ఉంటుంది.
దాని కింద 'బోర్డింగ్ పాయింట్ ఛేంజ్' ఆప్షన్ ను ఎంచుకోండి.
మీ PNR నంబర్, రైలు నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా రాయండి.
కండిషన్స్ బటన్ టిక్ చేసి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి.
బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTP ఎంటర్ చేసి 'సబ్మిట్' క్లిక్ చేయండి.
OTP వెరిఫై అయ్యాక, టికెట్ వివరాలు కనిపిస్తాయి.
వివరాలు చెక్ చేసి, కొత్త బోర్డింగ్ స్టేషన్ ఎంచుకుని 'సబ్మిట్' క్లిక్ చేయండి.
కొత్త బోర్డింగ్ స్టేషన్‌తో సహా అప్‌డేట్ చేసిన PNR వివరాలు కనిపిస్తాయి.
ఈ అవకాశం చార్ట్ ప్రిపేర్ అవ్వనంతవరకే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రైలు క్యాన్సిల్ అయినా, బోగీ లేకపోయినా, లేదా మూడు గంటలకు మించి ఆలస్యంగా నడిచినా రీఫండ్ పాలసీలు వర్తిస్తాయి. బుకింగ్ సమయంలో బోర్డింగ్ స్టేషన్ అప్‌డేట్ చేసి ఉంటే మరో సారి మార్చుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఒకసారి బోర్డింగ్ పాయింట్ మార్చాక మళ్లీ మీరు అసలు స్టేషన్ నుండి ఎక్కాలనుకున్నా కుదరదు. మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. లేదా జనరల్ టిక్కెట్ తీసుకొని ఆ స్టేషన్ వరకు జనరల్ బోగీలో రావాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు రిజర్వేషన్ టిక్కెట్ డైరెక్ట్ గా కౌంటర్ లో తీసుకొని ఉండి ఉంటే అటువంటి టిక్కెట్లకు ఆన్‌లైన్‌లో బోర్డింగ్ స్టేషన్ మార్చడానికి అనుమతి ఉండదు. అలాంటప్పుడు మీ సమీపంలోని రిజర్వేషన్ కౌంటర్‌ను సంప్రదించాలి. వారు పరిశీలించి టిక్కెట్, పీఎన్ఆర్ నంబర్ తదితర వివరాలు మార్చి ఇస్తారు. ఏది ఏమైనా మీరు బోర్డింగ్ స్టేషన్ మార్చాలనుకుంటే చార్ట్ ప్రిపేర్ కాకముందే చేయాల్సి ఉంటుంది. ఒకసారి చార్ట్ ప్రిపేర్ అయిపోతే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు.