8th Pay Commission: ఎనిమిదో పే కమిషన్ రావడానికి ఎన్నాళ్ళ సమయం పడుతుంది?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ పే కమిషన్ (8th Pay Commission) పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది ఎప్పుడు వస్తుందో మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. తాజా పరిణామాలను చూస్తే పే కమిషన్ రావడానికి ఇంకా రెండు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఎనిమిదో పే కమిషన్ కోసం ఎదురుచూపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు 8వ పే కమిషన్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కోటి 20 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల ఆశలన్నీ కూడా 8వ పే కమిషన్ పైనే. దీనికి కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది జనవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ కమిషన్ పని మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. ఈ నెల అక్టోబర్ ఒకటవ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకను ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. డిఏ మూడు శాతం పెంచింది. ఇది ఏడవ వేతన సంఘం ఇచ్చిన డిఎ.
ఎప్పుడు వస్తుంది?
ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు వస్తుందా? జీతాలు ఎప్పుడు పెరుగుతాయా? అని ఉద్యోగులు, పెన్షన్ దారులు వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి శుభవార్తను అందించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది వేతన సంఘమే. ఎనిమిదవ వేతన సంఘం వస్తే ప్రాథమిక జీతం పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొత్తం జీతం పై ప్రభావం పడుతుంది. కాబట్టి ఉద్యోగుల జీతాలు మరింతగా పెరుగుతాయి. అందుకే ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు వస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చేస్తున్నారు.
ఏడో వేతన సంఘం ఎప్పుడు వచ్చింది?
కొన్ని నివేదికల ప్రకారం ఎనిమిదవ పే కమిషన్ రావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గతంలో ఏడవ వేతన సంఘాన్ని 2014లో ఏర్పాటు చేశారు. ఈ వేతన సంఘం తన నివేదికను 2017లోనే విడుదల చేసింది. ఇక జీతాలు పెంపు 2016లోనే అమల్లోకి వచ్చాయి. అప్పటినుంచి జీతాలను సవరిస్తూ వస్తోంది. ఇక ఎనిమిదవ కమిషన్ వస్తే జీతాలు ఇంకా ఎంతో మరింతగా పెరుగుతాయన్నది వేతన జీవుల ఆశ.
ఎంత జీతం పెరుగుతుంది?
ఎనిమిదవ పే కమిషన్ వస్తే ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక జీతం పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రాధమిక జీతం 18 వేల రూపాయలు ఉంటే అది 26వేల రూపాయలకు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి హెచ్ఆర్ఏ, స్పెషల్ అలవెన్సులు, టీఏ, డీఏ.. అన్నీ కలుపుకుంటే జీతంలో భారీ పెరుగుదల కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ పే కమిషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎంత మంది ఉద్యోగులు?
మన దేశంలో 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్టు అంచనా. వీరందరికీ కూడా ఎనిమిదవ వేతన సంఘం రావడం వల్ల జీతాలు భారీగా పెరుగుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వేతన సంఘంపై ఎలాంటి చర్యలు ప్రస్తుతం తీసుకోవడం లేదు.