Fixed depositపై Highest Interest ఇచ్చే బ్యాంక్ ఏదో తెలుసా!!
తక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను అందించేందుకు కొన్ని బ్యాంకులు పోటీపడుతున్నాయి. వీటికి అధికంగా 9 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఆ బ్యాంకుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వడ్డీల ద్వారా స్థిరమైన ఆదాయం పొందేందుకు అందరూ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed deposit) చేస్తుంటారు. ఇలాంటి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనేక బ్యాంకులు అధిక వడ్డీరేట్లను ఇస్తున్నాయి. గరిష్ఠంగా 15 నెలల తక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రకటించాయి. ఈ ఏడాది జులై 30న పైసా బజార్ అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం రూ.కోటి లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు అధికంగా 9 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంది.
ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నికర ఆదాయం పొందేందుకు ఎక్కువగా ఎఫ్‌డీలు చేస్తుంటారు. ఇలాంటివి చేసిన సీనియర్ సిటిజన్లు తక్కువ పన్ను పరిధిలోకి వస్తారు. అందుకే వారిని ఆకర్షించే విధంగా కొన్ని బ్యాంకులు ఇలాంటి ప్రత్యేక స్కీమ్లు రూపొందించాయి.
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(equitas small finance bank)2016 నుంచి దేశవ్యాప్తంగా సేవలందిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 444 రోజుల కాల పరిమితికి FDలపై 9 శాతం వడ్డీ ఇస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఈ బ్యాంకు ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తోంది.
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు(Ujjivan Small Finance Bank) 2017 ఫిబ్రవరి 1న కార్యకలాపాలను ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 464 శాఖల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. ఈ బ్యాంకు 12 నెలల కాలవ్యవధి FDలపై 8.75 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.
కోల్‌కతా నుండి 60 కి.మీ దూరంలో ఉన్న బగ్నాన్ అనే చిన్న గ్రామం నుండి 2001లో మైక్రోఫైనాన్స్ కార్యకలాపాలను ప్రారంభించిన బంధన్(Bandhan bank)... 2015లో బ్యాంకుగా ఏర్పడి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. 3.44 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. ఈ బ్యాంకు ప్రస్తుతం 12 నెలల కాలవ్యవధి FDలపై 8.35 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ప్రైవేట్ బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది.
ముంబైలో ప్రధాన కార్యాలయం ఉన్న IndusInd బ్యాంకు 1994లో ప్రారంభమైంది. ప్రస్తుతం 2,728 శాఖలతో 38 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉంది. ఈ బ్యాంకు 12 నెలల వ్యవధి ఉన్న FDలపై 8.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది.
DBS(డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ లిమిటెడ్) బ్యాంక్ 376-రోజులకు 8 శాతం, కరూర్ వైశ్యా బ్యాంక్ 444 రోజులకు FDలపై 8 శాతం వడ్డీ రేట్లను ఇస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ 400 రోజులకు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 390 రోజులకు FDలపై 7.9 శాతం అందిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు 444 రోజులకు 7.8 శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి.