జిమ్, స్పా, వైన్ సెంటర్ ఉన్న ట్రైన్ వచ్చేస్తోంది. ఎక్కడానికి రెడీగా ఉండండి
మీకు తెలుసా? అక్కడ జిమ్ ఉంటుంది. స్పా సెంటర్ కూడా ఉంటుంది. వివిధ రకాల వంటలు చేసి రుచిగా పెడతారు. ఇదేదో హోటల్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడ్డారు. ఇది ఒక ట్రైన్. అద్భుతమైన ఈ లగ్జరీ ట్రైన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
సాధారణంగా ట్రైన్ లో చాలా సౌకర్యాలు కల్పిస్తారు. టీ, కాఫీ, టిఫెన్, భోజనం కూడా సప్లై చేస్తారు. ఇక స్నానాలు చేయొచ్చు, వాష్ రూమ్ ఫెసిలీటీ, ఏసీ కంపార్ట్‌మెంట్స్ ఉండనే ఉంటాయి. ఇంటికి ఏ మాత్రం తక్కువ కాని ఇలాంటి రైళ్లలో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇంతకు మించిన సౌకర్యాలు కల్పించడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైపోతోంది. లగ్జరీ ఫెసిలిటీస్ తో ఉన్న ఆ రైలు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్పా, జిమ్, ప్రత్యేక వైన్ కార్నర్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్న లగ్జరీ రైలు ప్రయాణాన్ని భారతీయ రైల్వే అందిస్తోంది. గోల్డెన్ ఛారియట్(Golden Chariot) అనే ఈ సర్వీస్ డిసెంబర్ 14, 2024న ప్రారంభమవుతుంది. 2025 మార్చి నెల వరకు కేవలం ఎంపిక చేసిన తేదీల్లో మాత్రమే నడుస్తుంది.
గోల్డెన్ ఛారియట్ రైలు సౌకర్యాలు
ఈ రైలులో 13 డబుల్ బెడ్ రూములు, 26 ట్విన్ బెడ్ రూములు ఉంటాయి. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 40 క్యాబిన్‌లు కూడా ఉన్నాయి. ప్రతి క్యాబిన్‌లో వైఫై కనెక్షన్, AC, OTT ప్లాట్‌ఫారమ్ యాక్సెస్‌తో స్మార్ట్ టీవీలు, లగ్జరీ బాత్రూమ్‌లు వంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.
ఈ రైలులోని రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు అంతర్జాతీయ, భారతీయ వంటకాలను అందిస్తాయి. అంతేకాకుండా ఈ లగ్జరీ రైలులో హెల్త్ స్పా, ఆధునిక జిమ్, ప్రీమియం వైన్లు, స్పిరిట్‌లను అందించే ప్రత్యేక బార్ కూడా ఉన్నాయి.
ఈ గోల్డెన్ ఛారియట్ రైలులో CCTV నిఘా, అధునాతన ఫైర్ అలారం వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 24 గంటల భద్రతా సిబ్బంది ద్వారా ప్రయాణీకుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు.
గోల్డెన్ ఛారియట్ రైలు మార్గాలు
ఈ లగ్జరీ రైలు 5 రాత్రులు, 6 పగళ్ళు ప్రయాణిస్తూనే ఉంటుంది. అంటే ఇది బెంగళూరు, బందిపూర్, మైసూర్, హలేబీడు, చిక్‌మగళూర్, హంపి, గోవా మీదుగా ప్రయాణికులను తీసుకెళుతుంది. జ్యువెల్స్ ఆఫ్ సౌత్ యాత్ర పేరుతో బెంగళూరు, మైసూర్, హంపి, మహాబలిపురం, తంజావూర్, చెట్టినాడు, కొచ్చి నగరాలను ఇది చుట్టి వస్తుంది. బెంగళూరు, బందిపూర్, మైసూర్ మరియు హంపిని మూడు రాత్రులు, నాలుగు రోజుల్లో కవర్ చేస్తుంది.
రైలు టికెట్ ధర
డీలక్స్ క్యాబిన్‌లో టిక్కెట్ ధర దాదాపు రూ.4,00,530 గా నిర్ణయించారు. దీనికి 5% GSTకూడా యాడ్ అవుతుంది. ఈ ధరలో లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, ప్రీమియం పానీయాలు, గైడెడ్ టూర్‌లు, స్మారక చిహ్నాల ఎంట్రీ ఫీజులు కూడా ఉంటాయి.
టికెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?
ఆసక్తి గల ప్రయాణికులు www.goldenchariot.org, Goldenchariot@irctc.com ద్వారా బుక్ చేసుకోవచ్చు. లేదా మరింత సమాచారం కోసం +91 8585931021 నంబర్‌కు కాల్ చేయవచ్చు.
దక్షిణ భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రయాణికులకు తెలియజేయాలని ఇండియన్ రైల్వే ఈ ట్రైన్ ప్రారంభిస్తోంది. అంతేకాకుండా లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ టూర్ ని ప్లాన్ చేసింది.