Gold Price: బంగారం దూకుడు మళ్లీ మొదలైందిగా.. రానున్న రోజుల్లో చుక్కలేనా
Gold Price: దేశీయంగా పసిడి ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల వైఖరి మార్పులు కారణంగా ధరలు ఎగిసిపడుతున్నాయి. కొద్దిరోజులుగా తగ్గిన రేట్లు మళ్లీ పైకి ఎగబాకడం గమనార్హం.

ఈరోజు బంగారం తాజా ధరలు
ఈ రోజు (బుధవారం) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.440 పెరిగి రూ.1,51,370కు చేరింది. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం కూడా రూ.400 పెరిగి రూ.1,38,750 వద్ద ట్రేడవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరుగుదలతో రూ.1,13,530కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు
దేశంలోని ముఖ్య నగరాల్లో ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,370 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, సూరత్‌లో రూ. రూ.1,51,530 కాగా.. చెన్నై, మధురై, కోయంబత్తూరు – రూ.1,52,190గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరలు కూడా నగరాలవారీగా స్వల్ప మార్పులతో రూ.1.38 లక్షల పరిధిలో ఉన్నాయి.
వెండి ధరల పరిస్థితి
బంగారం పెరిగినా వెండి ధరల్లో మాత్రం పెద్ద మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే పారిశ్రామిక అవసరాలు పెరగడం వల్ల త్వరలో వెండి కూడా పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ ప్రభావం ఎలా ఉంది?
ప్రపంచ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్సుకు సుమారు 4,597 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితులు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అనిశ్చితి పెరగడం వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచి బంగారం డిమాండ్‌ను మరింత పెంచుతుంది.
ఇప్పుడు పెట్టుబడి పెట్టడం మంచిదేనా.?
ప్రస్తుతం మార్కెట్ స్పష్టమైన దిశలో లేదు. ధరలు ఒక పరిమితిలోనే కదులుతున్నాయి. అందుకే ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తాల్లో దశలవారీగా కొనుగోలు చేయడం సురక్షితం. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు స్పష్టత వచ్చిన తర్వాతే బంగారం ధరల్లో స్పష్టమైన ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది.

