- Home
- Business
- Salary hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న జీతాలు. ప్రైవేట్ ఎంప్లాయిస్‌కి కూడా
Salary hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న జీతాలు. ప్రైవేట్ ఎంప్లాయిస్‌కి కూడా
వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపిన విషయం తెలిసిందే. రూ. 12 లక్షల లోపు జీతం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరి ఇది సగటు ఉద్యోగి జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను విధానంలో మార్పులు చేసింది. ఈ కొత్త ఆదాయపు పన్ను విధానం ద్వారా రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయమున్న వ్యక్తులు పన్ను మినహాయింపు పొందుతారు. అదనంగా ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పన్ను రహిత ఆదాయం రూ. 12.75 లక్షలకు వరకు పెరుగుతుంది.
అంటే నెలకు సుమారు రూ. లక్షకిపైగా జీతం తీసుకుంటున్న ఉద్యోగి కూడా ఇకపై రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ లెక్కన చూస్తే పరోక్షంగా ఉద్యోగి జీతం పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదాయపు పన్ను మినహాయింపులో ఆదా అయిన మొత్తం నికర జీతానికి యాడ్ అవుతుంది. దీంతో ఏప్రిల్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతం పెరగనుందన్నమాట.
ఉదాహరణకు ఒక వ్యక్తి నెలకు రూ. 1 లక్షల జీతంతో పనిచేస్తున్నాడనుకుంటే అతనికి ఏటా రూ. 80 వేలు ఆదా అవుతుంది. ఈ లెక్కన సుమారు ఉద్యోగి జీతం రూ. 6500 పెరుగుతుంది. ప్రజల కొనుగోలు శక్తి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజల చేతిలో డబ్బులు పెరిగితే అది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎంత జీతం ఉన్న వారికి, ఎంత ఆదా అవుతోంది.?
ఇదిలా ఉంటే ఏటా ఆదాయం రూ.12.75 లక్షల కంటే రూపాయి ఎక్కువగా ఉన్నా అతనికి రిబేట్ వర్తించదు. దీంతో సదరు వ్యక్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను శ్లాబ్‌లతో రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం తీసుకునే వారికి కూడా పన్ను ఆదా అవుతుంది. ఉదాహరణకు రూ. 13 లక్షల జీతం తీసుకునే వారికి రూ. 25 వేలు, రూ.14 లక్షల జీతం ఉన్నవారికి రూ.30వేలు, రూ.15 లక్షల జీతం ఉన్న వారికి రూ. 35 వేలు, రూ.16 లక్షల జీతం ఉన్న వారికి రూ.50వేలు, రూ.17 లక్షల జీతం ఉన్నవారికి రూ. 60వేలు, రూ. 18 లక్షల జీతం ఉన్నవారికి రూ. 70 వేలు, రూ. 19 లక్షల జీతం ఉన్న వారికి రూ. 80 వేలు, రూ. 20 లక్షల జీతం ఉన్న వారికి రూ. 21 లక్షలు, రూ. 22 లక్షల జీతం ఉన్న వారికి రూ. 1 లక్ష, రూ. 23 లక్షల జీతం ఉన్న వారికి రూ. 1.05 లక్షలు, రూ. 24 లక్షల జీతం ఉన్నవారికి రూ. 1.10 లక్షల వరకు ఆదా అవుతుంది.