Parking Fees: ఇలా చేస్తే షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ కి డబ్బులు కట్టక్కర్లేదు
Parking Fees: మీరు షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు మీ వెహికల్ కోసం పార్కింగ్ ఫీజు కడుతున్నారా? ఇకపై అలా చేయకండి. ఎందుకంటే రూల్స్ ప్రకారం పార్కింగ్ ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత షాపింగ్ మాల్స్ పై ఉంది. పార్కింగ్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

సాధారణంగా షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా రద్దీ ప్రాంతాల్లో వెహికల్ పార్కింగ్ కి ప్రత్యేకంగా ఫీజ్ తీసుకుంటారు. ఈ ఫీజు కూడా ఒక్కోచోట ఒక్కో రేటు ఉంటుంది. తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజ్ రూ.10, రూ.20 ఉంటుంది. అదే రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లాంటి ప్రైవేట్ భవనాల వద్ద వెహికల్ పార్కింగ్ ఫీజ్ 50 రూపాయలు పైగానే ఉంటుంది.
షాపింగ్ మాల్ కి వెళ్లి, వాళ్లు అమ్మిన ప్రొడక్ట్స్ కొనడమే కాకుండా మన వెహికల్ పార్క్ చేసినందుకు వాళ్లకి ప్రత్యేకంగా ఫీజు కట్టడం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయంపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. వెహికల్ పార్కింగ్ ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు వసూలు చేయొచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో వాహనాల పార్కింగ్ కి కచ్చితంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఫీజ్ తో వెహికల్ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో షాపింగ్ మాల్స్ లో వెహికల్ పార్కింగ్ పై జిహెచ్ఎంసి ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తుంది.
జిహెచ్ఎంసి రూల్స్ ప్రకారం షాపింగ్ మాల్స్ లో వెహికల్ పార్క్ చేసినప్పుడు 30 నిమిషాల వరకు ఎలాంటి ఫీజు తీసుకోకూడదు. ఆ వ్యక్తి ఆ షాపింగ్ మాల్ లో వస్తువులు కొన్నా, కొనకపోయినా అరగంటసేపు వెహికల్ ని ఉచితంగా పార్క్ చేసుకోవచ్చు.
30 నిమిషాల తర్వాత కూడా వెహికల్ పార్క్ చేసి ఉంటే అప్పుడు డబ్బులు వసూలు చేయొచ్చు. ఇందులో కూడా ఒక ప్రత్యేకమైన సడలింపు ఉంది. అదేంటంటే.. షాపింగ్ మాల్ లో మీరు కొన్న వస్తువుల ధర పార్కింగ్ ఫీజ్ కంటే ఎక్కువగా ఉంటే పార్కింగ్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ తక్కువ ఉంటే డబ్బులు కచ్చితంగా కట్టాలి.
ఈ విషయం తెలియక హైదరాబాదులో ఉండే చాలామంది షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి సారి పార్కింగ్ ఫీజ్ కడుతున్నారు. ఇకపై ఏ షాపింగ్ మాలోనైనా పార్కింగ్ ఫీజ్ అడిగితే వారికి ఈ రూల్ గుర్తు చేయండి. పార్కింగ్ డబ్బులు ఆదా చేసుకోండి.