మంచి ఐడియాతో వస్తే రూ. 20 కోట్లు మీ సొంతం.. యువతకు బంపరాఫర్
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగులకు, పేదలకు, రైతులపై వరాల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇక దేశంలో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ఊతమిచ్చే విధంగా పలు పథకాలను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే దేశంలో స్టార్టప్‌ల కల్పనకు కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది..

దేశంలో స్టార్టప్ కల్చర్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియాను ప్రారంశించిన విషయం తెలిసిందే. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, కొత్త వ్యాపారాలను అభివృద్ధి చేయడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు పెద్ద పీట వేసింది. స్టార్టప్ కోసం ప్రత్యేక ఫండ్ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Startup india
మంచి వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తారు. ఎంఎస్‌ఈలు, స్టార్టప్ కంపెనీల కోసం రూ. 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
స్టార్టప్ ఇండియా నేపథ్యం..
దేశంలో స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో స్టార్టప్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సాయంతో పాటు పన్ను రాయితీలు కల్పిస్తుంది. స్టార్టప్ ఇండియా ద్వారా కంపెనీలు ఏర్పాటు చేసిన వారికి 3 ఏళ్లపాటు పన్ను మినహాయింపు ఇస్తారు. 80 ఐఏసీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కోసం అదనంగా రూ. 2వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న డీప్ టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి స్టార్టప్‌లకు మద్ధతు ఇవ్వనున్నారు. జొమాటో, ఓలా, బైజూస్, పేటీఎమ్, నైకా, ఫార్మ్‌ఈజీ వంటి కంపెనీలన్నీ స్టార్టప్ ఇండియాలో భాగంగానే ఏర్పాటైనవే.